Take a fresh look at your lifestyle.

ఆక్సీజన్‌….ఆక్సీజన్‌ ప్రాణాలు తీస్తున్న ప్రాణవాయువు కొరత

నిన్నటి వరకు దేశమంతా కొరోనా..కొరోనా అన్నమాటలు మారుమోగాయి. ఇప్పుడేమో ఎక్కడ విన్నా ఆక్సీజన్‌ ‌గురించిన చర్చే జరుగుతున్నది. కోవిద్‌ ‌మొదటి విడుతలోనే ఆక్సీజన్‌ అవసరమేంటో తెలిసిపోయింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టింది లేదు. కోవిద్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ప్రభుత్వాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కోవిద్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌, ‌ఫస్ట్ ‌వేవ్‌కన్నా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. రెండవ విడుత వైరస్‌ను తట్టుకోవడం ప్రజల శక్తికి మించిపోతున్నది. నీతి అయోగ్‌, ఐసిఎంఆర్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన సర్వేకూడా అదే చెబుతున్నది. కొరోనా మొదటి వేవ్‌లో 41.1 శాతం మందికి ఆక్సీజన్‌ ‌బెడ్స్ అవసరం కాగా, సెకండ్‌ ‌వేవ్‌ ‌వొచ్చేసరికి 54.5 శాతం మందికి ఆక్సీజన్‌ ‌బెడ్స్ అవసరమని తమ సర్వేలో పేర్కొనడాన్ని బట్టి రెండవ వేవ్‌లో ఆక్సీజన్‌ ‌తప్పనిసరన్నది స్పష్టమవుతున్నది. నిన్నటివరకు కోవిద్‌ను పారదోలేందుకు మందులెలా వాడాలన్న దానిపైన్నే ఎక్కువ శ్రద్ధ చూపించారు.

సెకండ్‌ ‌వేవ్‌ ‌మందుల అవసరానికన్నా ప్రాణాలు నిలుపడానికి ప్రాణవాయువు వాడకం అత్యంత ఆవశ్యకమన్నది తేలిపోయింది. దీంతో దేశంలో అటు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఒక్క కేరళ మినహా అన్ని రాష్ట్రాలు అక్సీజన్‌ ‌కోసం ఎదురుచూస్తున్నాయి. కేరళలో ఆ రాష్ట్రానికి సరిపడ ఆక్సీజన్‌ ఉం‌డడమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేంతగా అక్కడ ఉత్పత్తి జరుగుతున్నదంటున్నారు. వాస్తవంగా ఆక్సీజన్‌ ఉత్పత్తి, సరఫరా అంతా కేంద్రం ఆధీనంలో ఉండడంతో కేంద్రానికి కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. దేశ వ్యాప్తంగా కొరోనా ప్రబలని రాష్ట్రమంటూ ఏదీలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ సెకండ్‌వేవ్‌ ఎఫెక్ట్ ‌తీవ్రతరంగా ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సీజన్‌ ‌కొరత కొట్టవొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యంత ఆవశ్యకత ఉన్న రాష్ట్రాలను గుర్తించేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఎంపవర్డ్ ‌గ్రూప్‌ -2 ‌పన్నెండు రాష్ట్రాలను గుర్తించింది.

వాటిల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌రాజస్థాన్‌, ‌కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ‌కేరళ, తమిళనాడు, పంజాబ్‌, ‌హర్యానాలతో పాటు ఢిల్లీ కూడా ఉంది. అంతెందుకు దేశ రాజధాని ఢిల్లీలోనే ఆక్సీజన్‌ ‌లేక పలువురు అసువులు బాసిన సంఘటనలెన్నో వెలుగుచూశాయి. తాజాగా ఢిల్లీలోని సర్‌ ‌గంగారాం హాస్పిటల్‌ ‌విషాధ గాథ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ హాస్పిటల్‌లో ఆక్సీజన్‌ అం‌దక ఒకే రోజున 25మంది కోవిద్‌ ‌పేషంట్స్ ‌మరణించినారంటేనే దేశ రాజధానిలోనే ఆక్సీజన్‌ ‌కొరత ఏమేరకుందన్నది అర్థమవుతున్నది. అప్పటికీ అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరికొందరు కోవిద్‌ ‌పేషంట్స్‌కు కొన్ని గంటల వరకే ప్రాణవాయువును అందించే అవకాశముందంటూ హాస్పిటల్‌ ‌వర్గాలు చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఆక్సీజన్‌ ‌నిల్వలపట్ల కేంద్రం ఏమాత్రం దూరదృష్టితో వ్యవహరించలేదనేది స్పష్టమవుతున్నది. ఇదే సమయంలో జైపూర్‌ ‌గోల్డెన్‌ ‌హాస్పిటల్‌లో కూడా ఆక్సీజన్‌ అం‌దక మరో ఇరవై మంది ప్రాణాలు వొదిలారు. ముంబాయిలో వారం రోజుల కింద ఆక్సీజన్‌ ‌సరిపోక ఏడుగురు మృతిచెందారు, నాసిక్‌లో ఆక్సీజన్‌ ‌సరఫరాలో జరిగిన అంతరాయం కారణంగా ఇరవై రెండు మంది మృత్యువాత పడ్డారు.

అంతెందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం తీసిపోదు. దాహం అయినప్పుడు బావి తవ్వడం మొదలెట్టినట్లు ఆక్సీజన్‌ అం‌దక ప్రాణాలు కోల్పోతున్నారన్న గగ్గోలు పుట్టిన తర్వాతగాని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాణవాయువు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సంఘటనే దీనికి అద్దంపడుతున్నది. బెంగుళూరు నుంచి తమ బంధువులను కలుసుకునేందుకు కారులో హైదరాబాద్‌ ‌చేరుకున్న ఒక కుటుంబం ఎదుర్కున్న పరిస్థితి చూస్తే ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవానికి బహుదూరమున్నట్లు స్పష్టమవుతున్నది. అనిత కుమారి(48) అనే వివాహిత మహిళ ఈ నెల 21న హైదరాబాద్‌ ‌చేరుకున్న మరిసటి రోజున్నే శ్వాస సరిగా రాకపోవడంతో కుటుంబసభ్యులు నగరంలోని దాదాపు అన్ని పెద్ద హాస్పిటళ్ల చుట్టు తిరిగినా లాభం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిన బెడ్స్‌లేవు, ఆక్సీజన్‌ ‌లేదనడంతో హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్న ఆంబులెన్స్‌లోనే చివరి శ్వాస వొదిలిందంటే ప్రజలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుంటున్నారో అర్థమవుతున్నది. జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే బెడ్స్‌లేవనో, ఆక్సీజన్‌లేదనో, వెంటిలేటర్లు లేవనో చెప్పి కనీస చికిత్సకు కూడా అవకాశం లేకుండా పంపిస్తున్నారు.

కొన్ని హాస్పిటల్‌ ‌యాజమాన్యాలయితే ఆక్సీజన్‌ది మీదే బాధ్యతంటూ పేషంట్‌కే వొదిలేస్తున్నారు. ఆక్సీజన్‌ ‌విషయంలో తీవ్ర వొత్తిడి నెలకొన్న పరిస్థితిలో పేషంట్లకు బయట ఆక్సీజన్‌ ‌సిలిండర్‌లు లభించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక వేళ పొరపాటున సిలిండర్‌లు ఉన్నాయన్నా గతంలో నూటాయాభైకి లభించే సిలిండర్లు ఇప్పుడు ఆరువేల వరకు డిమాండ్‌ ‌చేస్తున్నట్లు పేషంట్ల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఇంత ఆక్సీజన్‌ ‌కొరత ఉన్నప్పటికీ బయటి దేశాలకు అమ్ముకోవడమేంటని ప్రతిపక్షాలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. 2019-20లో 4వేల 514 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సీజన్‌ను 5.5 కోట్లకు ఇతర దేశాలకు బారత్‌ ‌విక్రయించిందని, అలాగే 2020-21 జనవరిలో 9వేల301 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సీజన్‌ను ఎగుమతిచేసి 8.9 కోట్ల రూపాయలను ఆర్జించిందని కేంద్రంపై ఘాటైన విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

కాగా కేంద్రం మాత్రం ఈ సంక్షోభ నుండి గట్టెక్కేందుకు 50వేల టన్నుల ప్రాణవాయువును దిగుమతి చేయడంతో పాటు, దేశంలో తన ఆధీనంలో ఉన్న ఉత్పత్తి ఫ్యాక్టరీల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఉత్పత్తి చేసే విధంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నది. తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన ఆక్సీజన్‌ను రాష్ట్రానికి తేవడంలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు 80 టన్నుల ఆక్సీజన్‌ ‌కోసం కేటాయించిన ఎనిమిది కంటెయినర్లను మిలటరీ విమానాల్లో ఒడిస్సా భువనేశ్వర్‌ ‌నుంచి తీసుకువొచ్చే ప్రక్రియ చేపట్టడం మాత్రం హర్షించాల్సిన విషయమే.

Leave a Reply