ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించిన కొరోనా టీకాకు సంబంధించి తుది దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో సోమవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుణెకు చెందిన సస్సోన్ జనరల్ హాస్పిటల్లో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ‘కోవీషీల్డ్(ఆక్స్ఫర్డ్ టీకా) వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ సోమవారం నుంచీ ప్రారంభమవ్వచ్చు’ అని సస్సోన్ జనరల్ హాస్పిటల్ డీన్ మురళీధర్ తంబే ప్రకటించారు.
ఈ తుది దశ టీకా పరీక్షల్లో 150 నుంచి 200 మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే కొంత మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు మురళీధర్ తెలిపారు. ఈ ట్రయల్స్‌లో పాలుపంచుకోవాలనుకుంటున్న వారు హాస్పిటల్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఆక్సఫర్డ్ టీకాకు సంబంధించి రెండో దశ ఫేజ్-2 క్లీనికల్ ట్రయల్స్‌ను పూణెకు చెందిన భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో జరిగాయి.