Take a fresh look at your lifestyle.

అతి ప్రైవేటీకరణ భారత్ కు ప్రమాదమే

భారతదేశం లాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు క్రియాశీలక పాత్రను పోషిస్తాయి. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్రంగా ముందుకెళ్లాలంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండు సమపాళ్లలో ఉండాలి. ఈ మధ్య కాలం లో ఎన్. డి. ఏ. ప్రభుత్వం ప్రైవేటీకరణ పై ఎక్కువ మ్రొగ్గు చూపడం, నిధుల సమీకరణ కై ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాను ప్రైవేటీకరించడం జరుగుతుంది. ప్రైవేటీకరణ అనేది ఆర్ధికశాస్త్రంలో, రాష్ట్ర లేదా ప్రభుత్వ రంగం చేతిలో ఉన్న ఒక సంస్థ లేదా కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం.ప్రైవేటీకరణ యొక్క ప్రాథమిక లక్ష్యం ,ఆర్థిక వ్యవస్థ ప్రకారం స్వేచ్ఛా మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర జోక్యాన్ని తగ్గించడం గా చెప్పవచ్చు.

ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థల పాత్రలు మరియు బాధ్యతలలో మార్పులు ఉంటాయి, ఇది ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్మడం మాత్రమే కాదు. ప్రైవేటీకరణ అనేది మూడు ప్రధాన మార్గాల్లో నిర్వహించగల ఒక ప్రక్రియ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్మడం, ప్రైవేటు సంస్థలచే ప్రభుత్వ వస్తు సేవల నిర్వహణ. ఒక ప్రైవేట్ సంస్థ నుండి సేవలను రాష్ట్రాల ద్వారా కొనుగోలు చేయడం.

ఇటీవల, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైనంతవరకు ప్రైవేటీకరిస్తామని, అందుకు వీలుపడని వాటిని మూసేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అంతే కాకుండా, ‘2020-21 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.32వేల కోట్లే వచ్చాయని, కొవిడ్‌ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు పెట్టుబడుల ఉపసంహరణపై తీవ్ర ప్రభావం చూపాయని ఠాకూర్ పేర్కొన్నారు. అయితే, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌కు నిధులు సమీకరించాలనే ఉద్దేశ్యంతో, నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని ఖరారుచేసి అన్ని నాన్‌స్ట్రాటజిక్‌, స్ట్రాటజిక్‌ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు మార్గసూచిని కేంద్రం విడుదల చేసింది.

దేశంలో ఇప్పుడు అన్ని ప్రధాన పబ్లిక్ సంస్థలైన ఇన్సూరెన్స్, రైల్వే , పెట్రోలియం , బ్యాంకింగ్, విశాఖ ఉక్కు మరియు కమ్యూనికేషన్ సంస్థలు ప్రయివేటీకరణ అనే గొడుగు క్రిందికి నెట్టివేయబడుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వెనుక గల ప్రధాన కారణం నిర్వాహణ వ్యయం తగ్గించుకోవడం, నష్టాల నివారణ, ఉత్పాదకతను గరిష్టం చేయడం లాంటివి ప్రభుత్వం చూపెట్టినప్పటికీ వాస్తవానికి నిధుల సమీకరణ, కార్పొరేట్ శక్తులను మరియు పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ రంగ సంస్థల పై అజమాయిషీ హక్కులను ప్రసాదింపజేసే ప్రయత్నం అనే చెప్పాలి.

ప్రైవేటీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తే గుత్తాధిపత్యం పెరుగడం, జవాబుదారితనం లోపించడం, నిధుల దుర్వినియోగం, ప్రాంతీయ మరియు ఆదాయ అసమానతలు, ప్రజల సంక్షేమం కొరవడడం లాంటి సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. లాభార్జనే ప్రధాన ధ్యేయంగా ఉండటంతో ప్రజల శ్రేయస్సు కనుమరుగవుతుంది.

ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వానికి అమ్మకపు ఆదాయం వచ్చినప్పటికీ భవిష్యత్ లో డివిడెండ్ ఆదాయాలు మాత్రం ఉండవు. ఏది ఏమైనప్పటికి, ప్రైవేటీకరణ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలేగాని, విదేశీయులను ,కార్పొరేట్ శక్తులను దేశ ఆర్థిక వ్యవస్థను శాషించే స్థాయికి తీసుకొచ్చేలా ఉండకుండా చూసుకోవాలి.

dr md
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply