- కృష్ణాజలాలలో మన వాటా తేల్చండి
- డిమాండ్ చేస్తూ టిజెఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ దీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొ. కోదండరామ్ జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిలదీస్తామని హెచ్చరించారు.
కృష్ణా పరీవాహిక ప్రాంతంలో టీజేఎస్ యాత్ర నిర్వహించి వివిధ నిరసన కార్యక్రమాలు చేశామని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని తీవ్రం చేయుటలో భాగంగా ఈ దీక్ష చేస్తున్నామన్న ఆయన..తన నాయకత్వంలో టీజేఎస్ బృందం ఈ నెల 30, 31వ తేదీల్లో దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, కృష్ణా, గోదావరి బోర్డు అధికారులను కలుస్తామని స్పష్టం చేశారు.ప్రొ .కోదండరాం దీక్షకు తొలి ,మలి దశ తెలంగాణ ఉద్యమకారులు,ప్రొ .హరగోపాల్ ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా.మల్లు రవి ,తెవివి అధ్యక్షుడు అంబటి నాగయ్య ,న్యూ డెమోక్రసీ (ఎం ఎల్ ) నాయకుడు గోవర్ధన్ తదితరులు సంఘీభావం తెలిపారు.