Take a fresh look at your lifestyle.

టిపిసిసి చీఫ్‌ ‌మార్పుపై తర్జనభర్జనలు

  • పైకి అడిగింది జగ్గారెడ్డి ఒక్కడే…
  • అంతర్గతంగా పైరవీ చేస్తున్న వాళ్లెందరో..
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆశలన్నీ టాగూర్‌పైనే..

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా అడుగుతున్నట్లుగానే…రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ నూతన రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి, ఎంపి మణిక్కం టాగూర్ వద్ద సైతం తన మనసులో ఉన్న మాటను వ్యక్తం చేశారు. పైకి జగ్గారెడ్డి ఒక్కడే తనకు టిపిసిసి చీఫ్‌ ‌పదవీ ఇవ్వాలని పార్టీ వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ ‌ను కోరినప్పటికీ…ఈ పదవీని ఆశిస్తున్న నేతల్లో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ ‌విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ..పార్టీ అధిష్టానం పరిశీలనలో పార్టీ సీనియర్‌ ‌నాయకుడు కె.జానారెడ్డి, జీవన్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరుల పేర్లు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వీరే కాకుండా, పిసిసి మాజీ చీఫ్‌ ‌వి.హనుమంతరావు వంటి సీనియర్ నాయకుడు సైతం ఈ పదవి కోసం లోలోపల బాగానే పోటీ పడుతూ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే,జ గ్గారెడ్డి మాత్రం టిపిసిసి చీఫ్‌ ‌ప్రచారం తెర మీదకు వచ్చినప్పుడల్లా పోస్టు తనకు ఇవ్వాలన్న వాదనను గట్టిగా వినిపిస్తూ రావడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులై, రాష్ట్రానికి తొలిసారిగా వచ్చిన టాగూర్ ‌తో భేటీ అయిన సందర్భంగా టిపిసిసి చీఫ్‌గా తనకు అవకాశం ఇవ్వాలని, తనకు అవకాశం ఇవ్వకుంటే తాను సూచించిన నేతకు టిపిసిసి చీఫ్‌ ‌పోస్టు ఇవ్వాలని మాట్లాడటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్‌ ఇం‌ఛార్జిగా మణిక్కం టాగూర్ ‌రావడంతో టిపిసిసి చీఫ్‌ ‌మార్పు కూడా ఉంటుందనీ అందరూ భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులో మార్పుపై పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ముందర దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలున్నాయి. ఈ మూడు ఎన్నికలు ఒక దాని వెనుక ఒకటి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ…టిపిసిసి చీఫ్‌ ‌మారిస్తే ఎలా ఉంటుంది? మార్చకపోతే ఎలా ఉంటుందన్న తర్జనభర్జనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లుగా అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు మంగళవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి తెలిపాయి. దీంతోనే టిపిసిసి చీఫ్‌ ‌పదవి మార్పు ఎప్పుడు ఉంటుందనే దానిపై కాంగ్రెస్‌ ‌పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదనీ తెలుస్తుంది. అయితే, తెలంగాణకు టాగూర్ ‌ ‌కొత్త ఇంఛార్జిగా రావడంతో.. టిపిసిసి చీఫ్‌ ‌మార్పు కూడా ఉంటుందని చాలామంది భావించారు. ఈ అంశంపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌వర్గాలను కొంత నిరాశకు గురి చేస్తున్నాయి. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన టాగూర్ ‌.. ‌టిపిసిసి చీఫ్‌ ‌మార్పుపై మాట్లాడారు. ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు. పీసీసీ మార్పు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తేవడమే తమ మిషన్‌ అని అన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే టీమ్‌ ‌వర్క్ అవసరమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి లీడర్లు ఉన్నారని.. పార్టీ అధికారంలోకి రావాలంటే పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 2023లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని స్టాండ్స్ ‌తీసుకొని ఫాలో కావాల్సి ఉందని అన్నారు. పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతల మధ్య ఐక్యత ఉండాలని టాగూర్ ‌ ‌సూచిండంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలో ఐక్యత, సమన్వయం లేదన్న ఒక అంచనాకు టాగూర్ ‌కూడా వచ్చినట్లు ఆయన చెప్పకనే చెప్పారు. మిగతా అంశాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల నూతన ఇంఛార్జి ఎన్ని చెప్పినా.. మార్పు ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ ‌వస్తే… పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందనే భావనలో పలువురు ఉన్నారు. ఓ వైపు బీజేపీ వంటి పార్టీ సైతం కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతుంటే.. తమ పార్టీ మాత్రం ఈ విషయంలో నాన్చడం ఏంటనే అభిప్రాయం కూడా కాంగ్రెస్‌లో సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆశలన్నీ టాగూర్ ‌పైనే..
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ విషయానికి వస్తే…తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన యంగ్‌ అం‌డ్‌ ‌డైనమిక్‌ ఎం‌పీ టాగూర్ ‌ ‌బాధ్యతలు తీసుకోవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణులన్నీ ఆయనపైనే ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ ‌విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ నుంచి మణిక్కం టాగూర్ ‌ అం‌చెలంచెలుగా ఎదిగారు. ఎన్‌ఎస్‌యూఐ ఆల్‌ ఇం‌డియా వైస్‌ ‌ప్రెసిడెంట్‌గా,ఇండియన్‌ ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జనరల్‌ ‌సెక్రటరీగా, సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ ఛైర్మన్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఛత్తీస్‌గఢ్‌, ‌బెంగాల్‌, ‌బిహార్‌, అసోం, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఐసీసీ స్క్రీనింగ్‌ ‌కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్తగా ఇంఛార్జిగా నియమించిన టాగూర్ ‌ ‌గత మూడ్రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన తీరు…కాంగ్రెస్‌ ‌నేతలతో వరుస భేటీలవుతున్న తీరు…నేతలకు, శ్రేణులకు చేస్తున్న దిశానిర్దేశంతో 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులొచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తేవడమే మా మిషన్‌ అని అన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే టీమ్‌ ‌వర్క్ అవసరమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి లీడర్లు ఉన్నారని.. పార్టీ అధికారంలోకి రావాలంటే పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 2023లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని స్టాండ్స్ ‌తీసుకొని ఫాలో కావాల్సి ఉందంటున్నారు. పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతల మధ్య ఐక్యత ఉండాలని మణిక్కం టాగూర్ ‌ అన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు అనేది క్రికెట్‌ ‌టీమ్‌ ‌లాంటిదని…అందరూ టీమ్‌ ‌కోసం మాత్రమే అడుతారని అన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తానని అన్నారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదు అని రెండూ ఎమోషనల్‌ ఉన్న రాష్ట్రాలు అని అన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే స్టాటజీ ఉపయోగపడదని.. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉండాలన్నారు. మొత్తంగా టాగూర్ ‌ ‌వొస్తూ వొస్తూనే నేతలతో వరుస భేటీలవుతుండటం…గ్రామస్థాయి వరకు వెళ్తాననీ చెబుతున్న తీరుతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నది. అయితే, గ్రూపులు, వర్గాలు, కోవర్టులతో అస్తవ్యస్థంగా మారిన రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీని గాడిలో పెట్టడమంటే టాగూర్ ‌కు పెద్ద టాస్క్‌గానే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply