కోవిడ్-19 విజృంభనతో విశ్వమానవాళి జీవనశైలిలో అవాంఛనీయ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్డౌన్లు, సామాజిక దూరాలు, గృహ నిర్బంధాలు లాంటి కరోనా నియమాలను పాటించాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాలతో వర్తక వ్యాపారాలు, సినిమా షూటింగులు మరియు సినిమా హాల్లు మూతపడ్డాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు, నూతన సినిమాల షూటింగులు ఆగిపోయాయి. సామాజిక దూరాలను పాటిస్తూ సినిమా హాల్స్ వెంటనే తెరిచే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇంట్లోనే కూర్చొని టివీల్లో ఆన్లైన్ ఓటిటి (ఓవర్ ది టాప్) డిజిటల్ వేదికల్లో సినిమాలు చూడటానికి ప్రజలు అలవాటు పడుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీం హాట్‌స్టార్, ఆహా మరియు డిజిటల్ మీడియాల్లో (సోషల్ మీడియా) వీడియోలు మరియు సినిమాలు చూడాల్సి వస్తున్నది. ఓటిటికి లభిస్తున్న ప్రజాధరణను గమనించిన కేంద్రప్రభుత్వ ఐ అండ్ బి మంత్రిత్వశాఖ 09 నవంబర్ రోజున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సినిమాలు, దృశ్య శ్రవణ ప్రోగ్రామ్‌లు, వార్తలు, సమకాలీన విశేషాలు లాంటి ఆన్లైన్ వీడియో నిర్మాతలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. డిజిటల్ మీడియా మరియు ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల రూపకర్తలు పాటించాల్సిన విధివిధానాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం వరకు పొందవచ్చునని తెలిపారు. డిజిటల్ మీడియా మరియు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవరోధాలు కలిగించదని, స్వేచ్ఛను హరించదని మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఓటిటి ప్లాట్‌ఫామ్ చిత్రాలకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లు విధిగా తీసుకునేలా విధివిధానాలను (పాలసీ) రూపొందిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రింట్, టివీ మరియు రేడియో ప్రసారాలకు వర్తించే విధానాలే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు వర్తించేలా పాలసీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు ఓటిటి సినిమాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. వీటిలో లీల (నెట్‌ఫ్లిక్స్), ఆశ్రమ్ (యంయక్స్ ప్లేయర్) మరియు గాడ్‌మ్యాన్ (జీ 5 తమిళ సీరియల్) లాంటివి మతపరమైన వివాదాలకు తెర లేపాయి. అల్ట్ బాలాజీ షో ఎక్స్ఎ.క్స్ఎ.క్స్ సెన్సార్ కాని సినిమాలో ఇండియన్ ఆర్మీని కించపరిచేలా ఉన్న భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. అలాగే బ్యాడ్ బాయ్ మిలియనీర్ (నెట్‌ఫ్లిక్స్) మరియు మీర్జాపూర్ (అమెజాన్ ప్రైమ్) ధారావాహికలు నేడు పలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఓటిటి మార్కెట్ పెట్టుబడులు 2024 నాటికి 2.9 బిలియన్ డాలర్లకు చేరతాయని అంచనా వేస్తున్నారు. గత 5 ఏండ్లలో ఓటిటి వీడియోల వినియోగదారులు 300 శాతం పెరగడం జరిగింది. 2019లో ఇండియాలో 10 మిలియన్ల వినియోగదారులు 21 మిలియన్ వీడియోలకు చందాదారులుగా చేరారు. నేడు భారత్‌లో 40కి పైగా వీడియో ఓటిటి ప్లేయర్లు ఉన్నారు. 2019లో ఇండియాలో 1,600 గంటల నిడివిగల ఓటిటి ప్లాట్‌ఫామ్ వీడియోలు నిర్మించారు. జూన్ 2018లో 260 మిలియన్ల వీక్షకులు (20 మిలియన్ నిమిషాలు) ఉండగా జూలై 2019లో 282 మిలియన్ల వీక్షకులకు (90 మిలియన్ నిమిషాలు) పెరగడంతో ఓటిటి వేదికల ప్రాముఖ్యతను గుర్తించవచ్చు. రాబోయే రోజుల్లో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతున్నదని, సినిమా హాల్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. కోవిడ్-19 మేఘాలు తొలగిన తరువాత కూడా ఓటిటి వినియోగదారులు తగ్గరని, సినిమా హాల్‌కు వెళ్లే వారి సంఖ్య పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. వెంటనే సినిమా హాల్స్ తెరిచినా కరోనా 2వ దశ వ్యాప్తి పెరుగుతుందనే భయంతో ప్రేక్షకుల సంఖ్య పడిపోతుందని సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. కరోనాతో మూతబడిన సినీ థియేటర్లకు ఇంట్లో కూర్చొని చూసే ఓటిటి ప్లాట్‌ఫామ్ సినిమాలు చక్కటి ప్రత్యామ్నాయం కావడం వీక్షకులకు కొంత ఊరటనిస్తున్నది.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037