Take a fresh look at your lifestyle.

సంఘటిత పోరాటమే సమస్యల పరిష్కారానికి మార్గం

“పేదరికాన్ని నిర్మూలించి ,ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, సంపదను కొద్దిమంది చేతిలోనే కేంద్రీకరించ కుండా చేసి, శ్రమైక జీవన సౌందర్యానికి వెన్నుదన్నుగా నిలిచే పాలనా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకు రాజ్యాంగ పరిధిలోనే ప్రజలు డిమాండ్‌ ‌చేసి సాధించుకోవడం అనివార్యం. పాలకులు బాధపడతారనో, ఇంతకాలం అధికారాన్ని అనుభవించిన ఉన్నత వర్గాలు ఏమనుకుంటారో అనో మొహమాటపడకుండా కోల్పోయిన హక్కులు, అనుభవిస్తున్న నిర్బంధాలు, ఇబ్బందులు, బాధలు ఇక ఎంతో కాలం సాగవని సవాల్‌ ‌విసిర వలసిన అవసరం ఉన్నది.”

సంఘటిత శక్తి ఎంతటి అసాధ్యమైన పని నైనా సుసాధ్యం చేయగలదు. అంతేకాదు అపాయకర, ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితుల నుండి గట్టెక్కడానికి తోడ్పడుతుంది. ‘‘గడ్డిపోచలు కలిసి తయారైన తాడు మదపుటేనుగు నైనా బంధించ గలదు’’ అనే చారిత్రక వాస్తవం మనమంతా విన్నదే కదా! సంఘటితమై సాధించలేనిది లేదు. అసంఘటితంగా ఉన్నాము కనుకనే కుటుంబం నుండి మొదలుకొని దేశ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
శత్రువు ఎంతటి బలవంతుడైన కలిమిడి శక్తిని చూచి తప్పకుండా రాజీ పడతాడు. అవసరమైతే లొంగిపోతాడు. అందుకే ‘‘ఐకమత్యమే బలం ‘‘అనే సామెత నాటి నుండి నేటి వరకు ఏనాడు కూడా విఫలం కాలేదు. వినియోగించుకునే తీరు పైన ,సమయస్ఫూర్తి పైన, పోరాట పటిమ పైన, చిత్తశుద్ధి పైన, ఉద్యమ స్ఫూర్తి పైన సంఘటిత శక్తి  యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

స్వతంత్ర భారతంలో అనేక వైఫ ల్యాలు:-
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒకవైపు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆ యుద్ధములో పాల్గొంటూనే భారతీయుల డిమాండ్‌కు తలవంచి అక్కడ అధికార మార్పిడి కారణంగా 1947 ఆగస్టు 15వ తేదీన తెల్ల వాళ్ళు మనకు స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. పరిపాలన అనుభవం లేదని, పాలన  లో శిక్షణ ఇస్తామని అందుకే పరిపాలిస్తున్న మని శ్వేతజాతీయులు ప్రపంచంలోని ఇతర దేశాలతో డాంబికాలు పలికినట్లే భారతీయుల తోనూ అదే దారిలో ప్రయాణించి మనలను చిన్నచూపు చూశారు. అయితే ఏమి ఆంగ్లేయుల పాలనా కాలంలోనే రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసుకొని స్వతంత్ర రాజ్యాంగాన్ని రాసుకొని  ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామిక శక్తిగా నిలబడగలిగి నాము. అందులో సందేహం లేదు. కానీ…
ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ, సంపదను విస్తారంగా పెంచుకున్న ప్పటికీ సంపద పంపిణీ సక్రమంగా జరగని కారణంగా ఈ దేశంలో పెరుగుదల మాత్రమే జరిగింది. కానీ అభివృద్ధి అనబడదు. పెరిగిన సంపద ప్రజలందరికీ సమాన స్థాయిలో అందినప్పుడే అభివృద్ధి అనబడుతుంది. అమర్త్యసేన్‌ ‌చెప్పినట్లుగా మానవాభివృద్ధియే అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నో వైఫల్యాలు కళ్లారా కనిపిస్తున్నాయి.

స్వపరిపాలన లేని స్వాతంత్రం ఈ దేశంలో కొనసాగుతున్నది. శక్తివంతమైన వోటు హక్కు ఉన్నది కానీ సామాన్యులు రాజ్యాధికారానికి దూరమై వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మెజారిటీ ప్రజానీకం రాజ్యాధికారానికి దూరంగా విసిరి వేయబడి ఉన్నారు. ఇది పెద్ద వైఫల్యం. వోటు హక్కు ను ఉపయోగించి యజమానిగా మారాలని అంబేద్కర్‌ ‌హెచ్చరిస్తే  వోటరు యజమానిగా మారెబదులు ప్రజలు బానిసలు గానే మిగిలిపోతున్నారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా రాసినటువంటి, ప్రపంచ దేశాల అనుభవాలు జోడించి నటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉంది. కానీ ప్రపంచంలో మన దేశానికి మన దేశంలో ప్రజలకు సార్వభౌమాధికారం  లేకపోవడం  అత్యంత దయనీయం.. రాజ్యాంగంలో ‘‘ సమన్యాయ పాలన’’ అనేది స్పష్టంగా ఉన్నప్పటికీ, చట్టం ముందు అందరూ సమానులే అని దాని అర్థం అయినప్పటికీ చట్టాలు నేడు ఉన్న వారికే చుట్టాలుగా మారిపోయాయి ఇది అతిపెద్ద వైఫల్యం.

పాలనలో సంస్కరణలు, ప్రక్షాళన అవసరం:-
ప్రజాస్వామ్యంలో ప్రభువులుగా చలామణి కావాల్సిన ప్రజలు బానిసలుగా జీవిస్తున్నారనే చేదు వాస్తవాన్ని గనుక ప్రజానీకం అటు పాలకులు గుర్తిస్తే ముఖ్యమైన మార్పులు రావాల్సి ఉన్నదని గ్రహించక తప్పదు. ఇకపై ప్రజలు ఆంగ్లేయుల కాలంలో పోరాడినట్లు బానిసలుగా పోరాటం చేయవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన ప్రజలు ప్రభువులు గానే చలామణి అయ్యి పాలకులపై సంఘటిత శక్తిగా పోరాటం చేసి సాధించుకోవాలి.

వ్యవస్థాపరమైనటువంటి అనేక రుగ్మతలను ,లోపాలను, వైఫల్యాలను పైన చెప్పుకున్న అన్ని విషయాలను సాధించడానికి ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, వృత్తి సంఘాలు సామాన్య ప్రజానీకం సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైనది.  క్రమానుగతంగా జరిగిన అభివృద్ధి కారణంగా  స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ మన ముందు ఉన్నటువంటి బలీయమైన లక్ష్యం సమానత్వాన్ని, అంతరాలు అసమానతలు లేని వ్యవస్థను స్థాపించడం. పేదరికాన్ని నిర్మూలించి,ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, సంపదను కొద్దిమంది చేతిలోనే కేంద్రీకరించ కుండా చేసి, శ్రమైక జీవన సౌందర్యానికి వెన్నుదన్నుగా నిలిచే పాలనా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకు రాజ్యాంగ పరిధిలోనే ప్రజలు డిమాండ్‌ ‌చేసి సాధించుకోవడం అనివార్యం. పాలకులు  బాధపడతారనో, ఇంతకాలం అధికారాన్ని అనుభవించిన ఉన్నత వర్గాలు ఏమనుకుంటారో అనో మొహమాటపడకుండా కోల్పోయిన హక్కులు, అనుభవిస్తున్న నిర్బంధాలు, ఇబ్బందులు, బాధలు ఇక ఎంతో కాలం సాగవని సవాల్‌ ‌విసిర వలసిన అవసరం ఉన్నది.

ఒక్క మాట…….
స్వాతంత్ర పోరాట కాలంలో ఏ మీడియా ,సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉర్రూతలూగించింది. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కావలసినంత సాంకేతిక పరిజ్ఞానం, దానికితోడు సామాజిక మాధ్యమాలు,ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సమాజాన్ని సంస్కరించు కోవడం పాలనలో విప్లవాత్మక మార్పులకు పూనుకోవడం రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను తిరిగి రక్షించుకోవడం యువతతో పాటు ఆలోచనాపరులు, విద్యార్థి ,మేధావి, బుద్ధి జీవుల ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే ఆ కృషి సంఘటితంగా ఉండాలి. సమన్వయపరిచి ఏకాభిప్రాయ సాధన ద్వారా లోపాలను పసిగట్టి, వైఫల్యాలను ఎత్తిచూపి, సంస్కరణలకు పూనుకుంటే సామాన్యుడు అసామాన్య డై పేదలు గద్దెనెక్కిన రోజు మాత్రమే ఈ దేశ స్వాతంత్య్రానికి నిజమైన అర్థం ఉంటుంది. ఆ వైపుగా సామాన్యులతో పాటు అగ్రవర్ణాలు, ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు,కార్పొరేట్‌ ‌సంస్థలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది.
నేరపూరిత రాజకీయాలతో చట్టసభలు కలుషి తమైనవి.నీతివంతమైన యువతను చట్టసభల్లోకి పంపించి నేరస్తులకు శిక్షపడేలా ఒత్తిడితేవాల్సింది సామణ్యప్రజానీకమే. న్యాయంగా అందాల్సిన వాటా ఎవరెవరికి ఎంత దక్కాలో అంత దక్కకపోతే పోరాటం అని వార్యంగా వస్తుంది. ఆ ఓర్పు చిత్తశుద్ధి ఉన్నత వర్గాలకు పాలకులకు ఉంటేనే అది సాధ్యం. లేకుంటే వ్యవస్థ పక్కదారి పడుతుంది. వర్గ సంఘర్షణ కు దారితీస్తుంది.

– వడ్డేపల్లి మల్లేశము, 9014206412
సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్‌
ఉపాధ్యాయులు
హుస్నాబాద్‌, ‌సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం

Leave a Reply