Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌కు తొత్తులుగా ప్రతిపక్షాలు..పోలీసులు

  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే దీక్షను అడ్డుకున్నారు
  • మంగళవారం దీక్ష భగ్నం చేసి అరెస్ట్ ‌చేసిన సందర్భంగా షర్మిల
  • రోడ్డుపై బైఠాయింపు..అరెస్ట్..‌ట్రాఫిక్‌ ‌జామ్‌

అనుమతి లేదంటూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ ‌చేశారు.  వైఎస్సార్‌టీపీ మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి ఈ వారం ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’కు పీర్జాదిగూడ ఉప్పల్‌ ‌బస్‌డిపో సమీపంలోని ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్ ‌స్థలాన్ని ఎంచుకుంది. దీక్షా స్థలికి షర్మిల చేరుకునే సమయానికి ముందే పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొద్ది సేపు దీక్షలో కూర్చున్న షర్మిల వద్దకు పోలీసులు వొచ్చి అనుమతి లేదని, దీక్షా స్థలం విడిచివెళ్లాలని స్ఫష్టం చేశారు. దీనిపై ఆమె ప్రతిపక్షాలతో పాటు పోలీసులు కూడా కేసీఆర్‌కు తొత్తులుగా మారి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపిస్తూ మండిపడ్డారు.

దీక్షకు 2  రోజుల ముందే అనుమతి తీసుకున్నాం. ఈ ప్రాంతం పోలీస్‌ ఎస్‌హెచ్‌వో దీక్షకు ఓకే చెప్పారు, కానీ చివరి నిమిషంలో పోలీసులు అనుమతి లేదంటున్నారు. అయినా మేం దీక్ష చేస్తాం.. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. 12 వారాలుగా ప్రతి మంగళవారం శాంతియుతంగా దీక్ష చేస్తున్నాం, మాకు ప్రజల మద్దతు ఉంది. పొద్దుటి నుంచి మెతుకు ముట్టకుండా పవిత్రంగా దీక్ష చేస్తున్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కోసం.. కేసీఆర్‌ ‌మెడలు వంచి నోటిఫికేషన్లు సాదించేందుకోసం అని షర్మిల అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే అక్కసుతో మా పార్టీపై కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌కక్షగట్టిందని ధ్వజమెత్తారు. మా పార్టీకి సంబంధించిన పోస్టర్లు సైతం పోలీసులు పెట్టనియ్యడం లేదని విమర్శించారు.

కేవలం కేసీఆర్‌ ‌పోస్టర్లు మాత్రమే ఉండాలట, వేరే వాళ్ళవి పెట్టకూడదని చెబుతున్నారు. వేల మంది ప్రజలు మా చుట్టూ ఉంటే వారికి సౌకర్యాలు కల్పిండానికి అనుమతివ్వడం లేదు. దీనికి నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే దీక్ష చేస్తామంటూ కాలినడకన బయలుదేరి వెళ్లారు.

రోడ్డుపై బైఠాయింపు..అరెస్ట్..‌ట్రాఫిక్‌ ‌జామ్‌
‌దీక్షా స్థలి నుంచి షర్మిల మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరుతుండగా ఆమె చుట్టూ పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీనికి ఆమె నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులతో వాదానికి దిగి అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్‌ ‌టీపీ జిందాబాద్‌.. ‌షర్మిలక్క జిందాబాద్‌ అం‌టూ పెద్ద పెట్టున నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లేలా హోరెత్తించారు. ఈ సంఘటనతో పోలీసులు నినాదాలు చేస్తున్నవారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీక్షకు అనుమతి లేదని చెబుతూ షర్మిలను పోలీసులు అరెస్ట్ ‌చేయడానికి ప్రయత్నించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా అడ్డుకున్నా వారిని పోలీసులు చెదరగొట్టి ఆమెను అరెస్ట్ ‌చేశారు. ఈ సంఘటనలతో హైదరాబాద్‌-‌వరంగల్‌ ‌హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ను సరిచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వొచ్చింది.

కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు
షెడ్యూల్‌ ‌ప్రకారం షర్మిల దీక్షా స్థలికి చేరుకునేందుకు ముందే బోడుప్పల్‌ ‌చెంగిచర్లలో నివసిస్తున్న నిరుద్యోగి రవీంద్ర నాయక్‌ ‌కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆమె మాట్లాడుతూ నిఖార్సయిన ఉద్యమకారుడు రవీంద్ర నాయక్‌ అని నివాళులర్పించారు. తెలంగాణ వొస్తే తన లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయని రవీంద్ర నాయక్‌ ఆశించారని, తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో ఉండి పోలీసుల లాఠీ దెబ్బలు తిని స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషిస్తే ఆయనకు చివరకు మిగిలింది ఆత్మహత్యేనని ఆమె వాపోయారు.

రవీంద్ర నాయక్‌ ‌మృతితో అతని కుటుంబం ఒంటరైందని, సర్కార్‌ ‌కనీసం స్పందించలేదని విమర్శించారు. ఉద్యమకారుడు చనిపోతే ఇప్పటివరకు పరామర్శించడానికి ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ రాకపోవడం పట్ల ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం గానీ ఎటువంటి పథకం గానీ అందలేదని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగి రవీంద్ర నాయక్‌ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఆరేళ్లు  నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్యకు ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగానికి, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ ‌పూర్తి భాధ్యుడని, ఇంటికో ఉద్యోగమని చెప్పి యువతను మోసం చేసింది ముమ్మాటికీ కేసీఆరేనని నిప్పులు చెరిగారు.

తెలంగాణలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్‌ ‌పార్టీ మేలుకోలేదని, ఇన్నాళ్ళకు నిద్రలేచి, ఆ పార్టీ కొత్త రాగం అందుకుని గర్జనలు చేస్తోందని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉద్యమకారుడు, నిరుద్యోగి రవీంద్ర నాయక్‌ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే ఆయన కండ్లకు కనబడడం లేదా..? ఆ కుటుంబాన్ని పరామర్శించే భాధ్యత లేదా..?  ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేని మీరు ఎంపీయేనా..? ఇక తెలంగాణ నిరుద్యోగులకు ఏం భరోసానిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించి ఉంటే ఈ రోజు ఇంత మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదా అంటూ ఆమె నిలదీశారు. ఏడేళ్ళుగా కాంగ్రెస్‌, ‌బీజేపీలు నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేశాయా..అని ఆమె ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌కు ఈ రెండు పార్టీలు తొత్తులుగా మారాయని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిపై వందల ఆధారాలు ఉన్నాయని ఊదరగొడుతున్న బీజేపీ ఏ ఒక్కటీ బయటపెట్టడం లేదెందుకని చురకలంటించారు. తెలంగాణలో ఈ రోజు నిజమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నదని ఒక్క వైఎస్సార్‌టీపీ మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం మెడలు వంచైనా నోటిఫికేషన్లు వేయిస్తామని భరోసానిచ్చారు.

షర్మిల వెంట రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏపూరి సోమన్న, సయ్యద్‌ ‌ముజ్తబా అహ్మద్‌, ‌సత్యవతి, మతీన్‌ ‌మూజాదాద్ది, మల్కాజిగిరి పార్లమెంట్‌ ‌నియోజకవర్గం కన్వీనర్‌ ‌దేశిరెడ్డి సరేష్‌ ‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ ‌నీలం రమేష్‌, ఐటీ వింగ్‌ ‌కన్వీనర్‌ ఇరుమళ్ళ కార్తీక్‌, ‌జహీరాబాద్‌, ‌పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌  ‌పార్లమెంట్‌ ‌కన్వీనర్లు బోర్గి సంజీవ్‌, ‌జిమ్మీ బాబు, ఎల్‌. ‌జస్వంత్‌ ‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply