వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నార్సీ ఆందోళనలపై కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో విపక్షాలు భేటీ

January 14, 2020

Opposition parties led by Congress meet NNRC concerns
మమతా, మాయావతి, ఆప్‌ ‌నేతలు గైర్హాజరు

పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హాజరుకాలేదు. ప్రతిపక్షాల ఐక్యత చాటే ఉద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండటం గమనార్హం.ఇటీవల కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌వామపక్ష కార్యకర్తల మధ్య ఉద్రిక్త ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలపై అసహనంగా ఉన్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల సమావేశానికి తాను హాజరుకావట్లేదని స్పష్టం చేశారు.

‘సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా ముందు నేనే ఉద్యమం ప్రారంభించాను. అయితే సీఏఏ-ఎన్నార్సీ పేరుతో కాంగ్రెస్‌, ‌వామపక్షాలు ఉద్యమానికి బదులుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. వారి ద్వంద్వ సిద్దాంతాలను మేం ఎప్పటికీ సహించబోం. విపక్ష భేటీకి హాజరయ్యే ప్రసక్తే లేదు’ అని దీదీ గట్టిగా చెప్పారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరైతే అది రాజస్థాన్‌లోని పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుందని మాయావతి ట్విటర్‌ ‌వేదికగా పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరుకావట్లేదు. భేటీ గురించి
తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, అందుకే తాము దూరంగా ఉంటున్నామని ఆప్‌ ఎం‌పీ సంజయ్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటాలు చేయాలని నిర్ణయించారు.

Tags: Opposition, parties led, Congress meeting, NNRC concerns, mamatha benarji,