Take a fresh look at your lifestyle.

రైతుల స్వేచ్ఛను ప్రతిపక్షాలు హరిస్తున్నాయి

  • ఓపెన్‌ ‌మార్కెట్‌తో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు
  • పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు
  • రైతుల ఆకాంక్షలను దెబ్బతీసేలా విపక్షాల చర్యలు
  • ట్రాక్టర్‌ ‌తగులబెట్టడం రైతులను అవమానించడమే

ఓపెన్‌ ‌మార్కెట్‌లో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మధ్యవర్తులు, దలారులు లాభం పొందే విధంగా ప్రతిపక్షాల చర్యలు ఉన్నాయని మోదీ విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద ట్రాక్టర్‌ను దహనం చేసిన ఘటనను ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఇన్నాళ్లూ పూజించిన మెషిన్లు, పరికరాలకు ఇప్పుడు నిప్పుపెట్టి రైతులను అవమానిస్తున్నారని ఆయన అన్నారు. రైతుల స్వేచ్ఛను వారు హరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో నామామి గంగే మిషన్‌ ‌కింద పలు ప్రాజెక్టులను మంగళవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ‌సమావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించి సంస్కరణలు తీసుకువచ్చినట్లు మోదీ తెలిపారు. తాము తెచ్చిన సంస్కరణలతో కార్మికులు, యువత, మహిళలు, రైతులు బలోపేతం అవుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కానీ కొందరు తమ స్వార్థం కోసం ఎలా ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నారో దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.

ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే హక్కును రైతులకు కల్పించినట్లు ప్రధాని తెలిపారు. రైతులకు తాము హక్కులు కల్పిస్తుంటే.. వాటిని ప్రతిపక్షాలు అడ్డుకుంటు న్నాయని విమర్శించారు. కనీస మద్దతు ధరపై విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే విధంగా రైతుకు స్వేచ్చ కల్పిస్తామని ప్రధాని చెప్పారు. అయితే కొందరు ఈ స్వేచ్ఛను తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. నల్ల ధనం ఆర్జించే వారి ప్రయత్నాలకు గండిపడినట్లు మోదీ ఆరోపించారు. నమావి• గంగా మిషన్‌ ‌కింద ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలో 6 మెగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.

గ్రామపంచాయతీల్లో పానీ సమితుల ఏర్పాటు ద్వారా జల జీవన్‌ ‌మిషన్‌ ‌కార్యక్రమం కింద ప్రతి ఇంటికి జలం నినాదంతో రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌కార్యక్రమ లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. జగజీత్‌ ‌పూర్‌, ‌హరిద్వార్‌, ‌రిషికేష్‌, ‌లక్కడ్‌ ‌ఘాట్‌ ‌లలో ఎస్టీపీతోపాటు రక్షిత మంచి నీటి పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేసారు. హరిద్వార్‌- ‌రిషికేష్‌ ‌జోన్‌లో 80 శాతం వ్యర్థజలాలు గంగానదిలో వృథాగా పోతున్నాయని, వాటిని ఎస్టీపీల ద్వారా మళ్లించి గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని ప్రధాని చెప్పారు. చోర్పానీ, బద్రీనాథ్‌ ‌ప్రాంతాల్లో మూడు ఎస్టీపీలకు ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేసారు.గంగా అవలోకన్‌ ‌పేరిట మొట్టమొదటి మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభించారు. హరిద్వార్‌ ‌లోని చండీఘాట్‌లో గంగా అవలోకన్‌ ‌మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. క్లీన్‌ ‌గంగా ప్రాజెక్టులతోపాటు వన్యప్రాణుల సంస్థను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.

Leave a Reply