Take a fresh look at your lifestyle.

శ్రీ‌శైలం ఘటనపై.. విచారణకు విపక్షాల డిమాండ్‌

  • ‌సీఎం బాధ్యత వహించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌పలు అనుమానాలున్నాయి..సీబీఐతో విచారణ జరిపించాలి : ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ ‌కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ప్రమాదంతో ఈ సీజన్‌లో పొందే విద్యుత్‌ను తెలంగాణ నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శ్రీశైలం ప్రమాద ఘటనపై ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి సందర్భంగా అన్ని విభాగాలు నాణ్యతతో పని చేస్తున్నాయా లేదా అనే ప్రధాన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని సీఎం కేసీఆర్‌, ‌విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

జరిగిన ప్రమాదం వెనుక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందనీ, జరిగిన కోట్ల రూపాయల నష్టం ఎవరి వల్ల జరిగిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయనీ, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ జరగాలనీ, వెంటనే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ ‌చేశారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా ఫామ్‌ ‌హౌస్‌ ‌రాజకీయాలు మానుకుని ప్రజల క్షేమం కోసం రాజకీయాలు చేయాలన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాననీ, ప్రమాదంలో చిక్కుకున్న మిగతా ఉద్యోగులంతా క్షేమంగా బయటికి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు.

పలు అనుమానాలున్నాయి..సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి : ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ ‌కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అన్నారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని జగన్‌ ‌జలదోపిడీకి కేసీఆర్‌ ‌సహకరిస్తూ, శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌విద్యుత్‌ ‌ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. చాలా కాలంగా తాము చెబుతూ వస్తున్నామని ఈ నేపథ్యంలో దుర్ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కనుక, రాష్ట్ర పరిధిలోని విచారణ సంస్థలతో కాక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

నిర్లక్ష్యం వల్లనే శ్రీశైలం ప్రమాదం : నారాయణ
ప్రభుత్వ వైఫల్యం వల్లే శ్రీశైలం పవర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అధికారులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని విమర్శించారు. శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. నిద్రపోయే కేసీఆర్‌ ‌పదవి నుంచి తప్పుకుని.. పనిచేసే కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పచెప్పాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించి వైద్య సిబ్బందికి భరోసా కల్పించడంలో కేసీఆర్‌ ‌విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్‌ ‌జోక్యాన్ని ఒప్పుకోమని నారాయణ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!