Take a fresh look at your lifestyle.

సీఏఏపై చర్చిద్దాం..

వివాదాలు వొద్దు.. వ్యతిరేకిస్తూ తీర్మానం చేద్దాం: కేసీఆర్‌
‌పజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.శనివారం శాసనసభలో ప్రతిపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ సీఏఏ ఎన్‌పీఆర్‌పై ప్రసంగిస్తుండగా ఆయన మాటలను వారించి సీఎం జోక్యం చేసుకొని సీఏఏపై ప్రభుత్వ వైఖరిని విస్పష్టంగా ప్రకటించారు. సీఏఏపై శాసనసభలో పూర్తిస్థాయిలో చర్చ జరగాలని టీఆర్‌ఎస్‌ అభిప్రాయమని పేర్కొన్నారు. యావద్ధేశాన్ని ఈ అంశం కుదిపేస్తున్నదని, దేశమంతటా ఇది వివాదాస్పదమైందని, అందుకని ప్రభుత్వమే సీఏఏపై తీర్మనం ప్రవేశపెడుతుందని, ఒకరోజంతా చర్చ జరగాలని భావిస్తున్నామని సీఎం వివరించారు. అందుకని అక్చరుద్దీన్‌కానీ, రాజాసింగ్‌కానీ ,ఈ అంశాన్ని వివాదాస్పదం చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. చర్చ సందర్భంలో ఎవరి పార్టీ అభిప్రాయాన్ని వారు నిక్కచ్చిగా చెప్పవచ్చని సీఎం సీఏఏపై చర్చను ఆహ్వానించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని, భిన్నాభిప్రాయాలను చట్టసభలో ఖండితంగా చెప్పేందుకు అవకాశాలు ఉంటాయని,ఈ అవకాశాలను అన్నీ పార్టీలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.దేశంలో ఇప్పటికే ఘర్షణ వాతావరణం నెలకొన్నదని, ఈ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేవిధంగా, అర్ధవంతమైన, సారవంతమైన, ప్రజాస్వామ్యయుతమైన చర్చ సీఏఏపైన జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఈ అంశంపైన అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నదని, దేశభవిష్యత్తు చర్చనీయాంశమవుతున్నదని ఆయన పేర్కొన్నారు. అతిముఖ్యమైన అంశమైనందున అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చునని, అందుకోసం పూర్తిగా సమయాన్ని కేటాయించుకొని చర్చించుకుందామని సీఎం పేర్కొన్నారు.శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని,ఆ తీర్మానం వెలుగులోనే శాసనసభలో చర్చ జరుగనున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.ఇక జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ విషయంలో ఇప్పటికే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌లోకసభ సభ్యులు గలాటా జరిపారని, రాష్ట్రానికి జీఎస్‌టీ రావాల్సినంత నిష్పత్తిలో రావడంలేదని దీనిపైన కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని సీఎం చెప్పారు. అయితే తగిన సందర్బంలో జీఎస్‌టీ వాటాపైన కేంద్రాన్ని ప్రశ్నిస్తామని, అన్నీ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలకన్నా సీఏఏ పైననే చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని, ఒకరోజంతా దీనిపైన మాట్లాడుకుందామని సీఎం పిలుపు నిచ్చారు.

Leave a Reply