Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్ తయారీకి అర్హులకు అవకాశం కల్పించాలి: కేజ్రీవాల్

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ .మే 11: చాలా కంపెనీలకు వ్యాక్సిన్ తయారు చేసే శక్తి ఉంది వారందరికీ కేంద్రం అవకాశం కల్పించాలి అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్రం వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి ఫార్ములా తీసుకొని, అన్ని కంపె నీలకు ఇవ్వాలి అని కేజ్రివాల్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇలా వ్యాక్సిన్ ఫార్ములా తీసుకునే అధికారం ఉంది కనుక ఈ క్లిష్ట పరిస్థితులలో ఫార్ములా తీసుకోవడం సాధ్యం అవుతుంది అది నేటి అవసరం అని కేజ్రివాల్ అభిప్రాయ పడ్డారు. కొరోనా వ్యాక్సిన్ ఫార్ములాను సార్వజనికం చేసి అన్ని కంపెనీలకు కేంద్రం ఇవ్వొచ్చు దీనివలన వ్యాక్సిన్ తయారీని కేవలం రెండు కంపెనీలు మాత్రమే చేయకుండా అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమై దేశంలో వ్యాక్సిన్ కొరత తీరుతుంది అని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం కేవలం రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు నెలకు కేవలం 6, 7 కోట్ల డోసులు మాత్రమే తయారు చేస్తున్నాయి.

ఈ పరిస్థితి వలన దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లకు పైగా టైం పడుతుంది. అప్పటి లోపు ఎన్నో కొత్త వెరియంట్ వైరస్ లు, వేవ్ లు వస్తాయి అని కేజ్రీవాల్ అన్నారు. నేటి పరిస్థితి ఇలానే కొనసాగితే దేశం పూర్తిగా నాశనం అవుతుంది అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం దేశంలో వ్యాక్సిన్ తయారీని యుద్ద ప్రతిపాదన వేగవంతం చేయాలి అని, రానున్న కొద్ది రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ అందేలాగా “రాష్ట్రీయ యోజన” పధకం కేంద్రం తీసుకురావాలి అని కేజ్రీవాల్ అన్నారు. ఎప్పటి వరకు అయితే ప్రజలకు వ్యాక్సిన్ అందదో, అప్పటి వరకు కరోనపై చేసే యుద్దంలో మనం గెలవలేం అని కేజ్రీ నొక్కి వక్కాణించారు.

కేంద్రం రెండు కంపెనీల నుంచి ఫార్ములా తీసుకుని సాధ్యమైనంత త్వరగా పలు కంపెనీలకు ఇస్తే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా ముగించ వచ్చని కేజ్రీవాల్ అన్నారు. ఫస్ట్ వేవ్ లో దేశంలో పిపిఈ కిట్ల కొరత ఉంది. అప్పుడు రెండు కంపెనీలే పిపిఈ కిట్లు తయారీ చేశాయి. నేడు దేశంలో ఎన్నో కంపెనీలు పిపిఈ కిట్లు తయారు చేయడంతో కొరత లేదు అని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే పేరెన్నిక గల గొప్ప ఫార్మా కంపెనీలు ఇండియాలో ఉన్నాయి అని కేజ్రీవాల్ అన్నారు.

విశ్వంలోనే సర్వ శ్రేష్టమైన శాస్త్ర వేత్తలు మన దేశంలో ఉన్నారు అని చెబుతూ ఢిల్లీలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల కొరత లేదు అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది అని ప్రజలు సంతోషంగా ఉన్నారు అని కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీలో వేగ వంతంగా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నాం అని చెబుతూ వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తోన్న స్కూల్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ప్రతి రోజు లక్షా 25 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం అని కేజ్రీవాల్ అన్నారు.

ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి.. 3 నెలల్లో ఢిల్లీలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది తన ప్రభుత్వ లక్ష్యం అని కేజ్రీ అన్నారు. అయితే ఢిల్లీలో వ్యాక్సిన్ కొరత పెద్ద సమస్యగా మారింది అని తెలిపారు. కేవలం కొద్ది రోజులకు సరిపడ వ్యాక్సిన్ మాత్రమే ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉంది అని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉంది అని కేజ్రీ అన్నారు. టీకాలు లేకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించ లేదు అని కేజ్రీవాల్ గుర్తు చేశారు

Leave a Reply