Take a fresh look at your lifestyle.

భయానకం ..ఆందోళనకరం ..!

మార్చ్ 24..

ఒక్కసారిగా జీవన చక్రం ఆగిపోయింది..అప్పటి వరకు పచ్చటి తోరణాలు…పూల దండలతో పండుగ వాతావరణం తో కళకళ లాడిన ఇండ్లన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమా తీరుగ నలుపు తెలుపు లకు మారి పోయినవి.పిల్లల అట పాటలు,పెద్దల హడావుడి, వచ్చీ పోయే చుట్టాలు,స్నేహితుల హాయ్…భాయ్.. పలకరింపులు ‘స్టాచ్యూ ‘ చెప్పినట్టు స్తంభించి పోయినవి.రాత్రికి రాత్రి కర్ఫ్యూ వాతావరణం. దైనందిన జీవితం లో ఎన్నడూ వినని కొత్త మాట లాక్ డౌన్ …ఆశల పైన…భవిష్యత్ ఊహాలపైన…బంగారు కలలపైనా నిప్పులు చల్లిన ఆ రోజు కొన్ని తరాల వరకు మర్చిపోలేని, నరక ప్రాయమైన రోజు…అదే మార్చ్ 25. .భయంకరమైన వైరస్ రాక్షసి ఆకాశమంత చేతులను చాచుకొని మనుషుల ఊపిరిని క్షణ కాలం ఉఫ్ న ఊదేస్తూ,అష్ట వంకరలతో వికృత చేష్టలతో కంటికి కనిపించకుండా గాలిలొ తిష్ట వేసుకుని కూర్చున్నది… అది కొరోనా అట.. కోవిద్ 19 అని కూడా అంటున్నారు. ఆ నాటినుంచి ఈ రోజటి వరకూ లాక్ డౌన్…అన్ లాక్.. క్వరంటైన్…తప్పితే మరో మాట లేకుండా పోయింది.సరదాలు..సంతోషాలకు చెక్ పెట్టే నిస్సారమైన జీవితం గడుపుతున్న ప్రజలు రేపనేది వున్నదా…ఈ రోజే శాశ్వతమా…పిల్లల జీవితాలు ఏం కాను ..మనిషి మనుగడ ఇక్కడితో ఆగిపోతుందా…సవా లక్ష సందేహాలతో ప్రతికూల ధోరణిలో వున్నారు.ఈ నేపథ్యం లో వివిధ వర్గాలకు చెందిన మహిళల ను పలకరించిన ” ప్రజాతంత్ర ” అక్షర వీక్షణమే ఈ కథనం !

  • ప్రభుత్వాల నిష్క్రియతత్వం
  • మద్యం అమ్మకాలు ఆపేయాలి
  • బళ్ళు తెరిచే సమయం రాలేదు
  • ప్రజలు సామాజిక బాధ్యత గుర్తించాలి
  • వాక్సిన్ లేదా మందులు వొస్తాయి
  • 2021 మనదే ..మహిళల మనోగతం

వీణ, ప్రజాతంత్ర డెస్క్ జర్నలిస్ట్: ప్రపంచం మొత్తం చుట్టేస్తున్న కొరోనా మహమ్మారి తన వంటిట్లోకి ప్రవేశిస్తుందేమోనన్న భయం ఈ రోజు ప్రతి గృహిణిని ఆందోళనకు గురి చేస్తున్నది . తను , తన కుటుంబ సభ్యులు వైరస్‌ అం‌టుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా .. ఇతరులు సామాజిక బాధ్యతను గుర్తించడం లేదని భయం ..భయం గా రోజులు గడపాల్సి వొస్తుందంటున్నారు కొందరు గృహిణులు . కారణం లేక పోలేదు …దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టి నాలుగు నెలలు గడిచినా ,, వైరస్‌ ‌వ్యాప్తి ‘ఫ్లాటెన్‌ ‘ అటుంచి…నిటారుగా పైకి పోతుంది ..మార్చ్ ఆఖరి వారం లో పదుల సంఖ్యలో ఉన్న పాజిటివ్‌ ‌కేసులు ..నాలుగు నెలల వ్యవధిలో లక్షల సంఖ్యకు చేరుకోవడం ఆందోళనకర అంశమే ..! లాక్‌ ‌డౌన్‌ ‌ప్రారంభం ..మార్చ్ 25 ‌నుంచి ..రెండవ దశ అన్‌ ‌లాక్ ‌ప్రక్రియ ఆఖరు జులై 31 వరకు కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి అంశం పై ‘ప్రజాతంత్ర‘ ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా కొందరు గృహిణులను , ఇంటి నుంచే పని చేస్తున్న మహిళా ఉద్యోగులను వారి అనుభవాలు, ఆలోచనలను , అభిప్రాయాలను సేకరించింది. ‘ఒక వైపు వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించాలంటూ ప్రకటనలు చేస్తూ …ప్రభుత్వం లో ఉన్న వారు ప్రారంభోత్సవాలు మంది ,మార్బలంతో చేపట్టడం పట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు . కొంత కాలం పాటు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం..లేదా ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా నిర్వహించాలని వారి అభిప్రాయం .అన్‌ ‌లాక్‌ 1 ‌ప్రక్రియ ప్రారంభమే ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మొదలు పెట్టినాయి .. మద్యానికి అనుమతి ఇవ్వడం పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం ..మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం ఎక్కడా పాటించడం లేదు . గుంపులుగా సమీపం లోనే మద్యం సేవించడం కనిపిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ..వీరి నుంచి వైరస్‌ ‌వ్యాప్తి వేగంగా విస్తరించే ప్రమాదమున్నది .. కొరోనా కాలం లోని మొదటి రెండు నెలలు ఈ ప్రమాదం లేదు .. అన్‌ ‌లాక్‌ ‌తరువాత రెండు నెలల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ..తక్షణమే మద్యం అమ్మకాలను కొంత కాలం నిలిపివేయాలి . వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు ఇతర రాష్ట్రాల మాదిరి ..వ్యాపార , వాణిజ్య పని వేళలను కుదించాలి అంటున్నారు గృహిణి అమిత . దైనందిన జీవితంలో మాస్క్ , ‌భౌతిక దూరం పాటించడం భాగమయిన నేపథ్యంలో బస్తీ కి ఇద్దరు స్వచ్చందంగా పని చేసే వారిని గుర్తించి …ప్రజలు నియమాలు పాటించేలా వారికి ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి , పర్వవేక్షణ బాధ్యతతో పాటు తగిన పారితోషికం ఇవ్వాలి అంటున్నారు గృహిణి నిలోఫర్‌ పంజ్వాని . ‘నాలుగు నెలలు గా ఇంటినుంచి పని చేయడం వల్ల పని ఒత్తిడి తీవ్రంగా ఉంది ..అదే సమయంలో ఉత్పాదక పెరగడం సంతోషం కలిగిస్తుంది .. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కట్టడిలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి .

lockdown in india

లాక్‌ ‌డౌన్‌ ‌ప్రజలలో సామాజికి బాధ్యతను గుర్తించేలా చేసింది ..విదేశాల్లో వల్లే కాకుండా ..మన దేశం లో వైద్యులు కోవిద్‌ 19 సోకిన వారికి వారి శారీరక ఆరోగ్యం బట్టి వైద్యం అందిస్తున్నారు ..త్వరలో దీనికి మందులు కూడా అందుబాటులోకి వొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగిని శరణ్య .’పరిస్థితి రోజు రోజు కు భయంకరంగా కనిపిస్తుంది ..వ్యక్తిగతంగా ..కుటుంబపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ …బయట పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది ….పాలకుల్లో , అధికారుల్లో శాస్త్రీయత లోపించింది ..రోజుకొక ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్నారు . ప్రారంభంలో ఎన్‌ 95 ‌మాస్క్ అత్యంత సురక్షితమని ..ఇప్పుడు దాని వల్ల ప్రయోజనం లేదంటున్నారు . మొదటి రెండు నెలలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ ‌వ్యాప్తి కట్టడికి చూపించిన శ్రద్ధ ..తరువాత రెండు నెలల్లో కనిపించడం లేదు . ప్రజల ఆరోగ్యాన్ని , ప్రాణాలను వారికే వొదిలేశారు . ఈ రోజు సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని , ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరడం ప్రభుత్వాల నిస్సహాయతకు నిదర్శనం . హైదరాబాద్‌ ‌నుంచి ఇతర జిల్లాలకు వైరస్‌ ‌విస్తరించిందన్న దాంట్లో వాస్తవం లేదు … ఎక్కడో వుహాన్‌ ‌లో పుట్టిన వైరస్‌ ‌ప్రపంచం మొత్తం విస్తరించలేదా అని ప్రశ్నిస్తున్నారు గృహిణి అజిత. ‘ఒక్కో రోజు తెల్లవారు 4.30 గం ల వరకు పని చేయాల్సి వొస్తున్నది . ఇంటి నుంచే పని చేయడం వల్ల .. ఒత్తిడి తీవ్రంగా ఉంది … అత్త గారి సహాయం వల్ల నెట్టుకు రాగలుగుతున్నాను ..అయినా కోల్పోయిన దానిని తిరిగి పొందామనిపిస్తున్నది ..యోగ ..ధ్యానం ఇటువంటి సమయాల్లో చాలా అవసరం ..‘ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‘ ‌సభ్యురాలిగా ఆందోళనకు , భయానికి గురవుతున్న వారికి ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా కౌన్సిలింగ్‌ ‌చేస్తూ వారికి మనో ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్న ..రోజుకు పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ ‌వొస్తుంటాయి ..వారి మాటల్లో తీవ్ర మానసిక ఒత్తిడి ,ఆందోళన కనిపిస్తుంది ..ఈ ప్రళయం అతి కొద్దీ రోజుల్లో సమిసి పోతుంది ,,2021 లో మళ్ళీ మామూలు రోజులు వొస్తాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ..’అంటున్నారు ఐటి ఉద్యోగిని ప్రశాంతి . ‘ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తిసినాయి ..ప్రజలలో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది .. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యా … అన్‌లాక్‌ ‌తరువాత పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం ..మరొక సారి లాక్‌ ‌డౌన్‌ ‌విధించి ..ఈ సారి ఆ సమయాన్ని కేసులను గుర్తించి, , పరీక్షించి ..వైద్యం అందించాలి .ప్రజలు కూడ తమ బాధ్యతను గుర్తించి …అనివార్యమయితేనే బయటికి రావాలి ..ఇంట్లో నే ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడమే కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు సరయిన వైద్యం అంటున్నారు గృహిణి అరుణశ్రీ .ఈ విపత్కర సమయంలో ఆర్థికంగా,మానసికంగా దృఢంగా ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేదు ..అవి లేని పేద ప్రజలను గుర్తించి వారికి ప్రభుత్వాలు అండగా నిలబడాలి అంటారు వారు .’ మార్చ్ 25 ముందున్న స్వేచ్ఛ ఆ తరువాత నిర్బంధంగా మారిపోయింది. ప్రజల బాధ్యతారాహిత్యమే కేసులు పెరగడానికి ప్రధాన కారణం.మాస్క్ లు దరించక పోవడం,సామాజిక దూరాన్ని పాటించక పోవడం,విచ్చలవిడి తిరుగుళ్ళు …వైరస్ విస్తృతంగా వ్యాపించడానికి కారణమయ్యాయి.లాక్ డౌన్ పీరియడ్ ను మరింత పొడిగిస్తే బాగుండేది.ప్రభుత్వాల తీరు యెట్లున్నప్పటికీ ప్రజలే బాధ్యతగా తమ జీవితాల కోసం ఆలోచించాలి.ఈ కష్టకాలం లో పాఠశాలలు తెరవక పోవడమే మంచిది…అన్నారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సంధ్యా రాణి, .మరికొంత మంది అభిప్రాయం పేజీ 2 లో …

1.పాములపర్తి చంద్రకీర్తి , రిటైర్డ్ టీచర్

women with corona virua

పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణాలు చర్చించుకునే ముందు పరిస్థితికి ముందు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మార్చ్ కు ముందే అమెరికాలో కొరోనా వైరస్ చేయి దాటి పోయింది.రాజకీయ సంక్షోభం నెలకొన్నది అప్పు డు అక్కడ…అది మనం చూస్తూ కొంత ఆలస్యం చేసినం…ఫిబ్రవరి లోనే మనం జాగ్రత్త పడాల్సింది.ఇప్పుడు అనుభవిస్తున్నాం.లాక్ డౌన్ పీరియడ్ లో మద్యం అమ్మకాలు రాజకీయ నాయకుల లాభాపేక్ష మాత్రమే. ఉద్యోగస్తులు పిల్లలు ఇంటికే పరిమితం కావడం వొక రకంగా సంతోషమే.కానీ ఎంత కాలం…ఎవరి పనులకు వాళ్ళు బయటికి పోయి వస్తుంటేనే ఆరోగ్యం ఆనందం. సన్నిహితులకు దూరం గా వుంటున్నందుకు బాధగానే వున్నది.సరదాలు సంతోషాల ను చాలా వరకు మిస్సవు తున్నము.ప్రభుత్వాలు ఎప్పుడూ తమ స్వాలాభమే చూసుకుం టాయి.ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజోపయోగ పనుల పేరుతో టీవీలలో కనిపించడం కేవలం వాళ్ళ స్వార్థం మాత్రమే.ప్రజల గురించి ఆలోచించే వాళ్ళయితే ఇప్పుడు అన్ని పనులు పెట్టుకోరు. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి వుంటే ఇప్పుడు ఈ సమస్యను సులభంగా అధిగమించేవి.కొరోనాను అదుపు చేసే విషయంలో కట్టడి చేసే విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినవనే చెప్పాలి.విద్యార్థులకు ఇది కష్టకాలం.పాఠశాలలు ప్రారంభించక పోవడమే మంచిది.

2.భాస్వతి,ప్రిన్సిపాల్ ,కార్పొరేట్ కాలేజీ
మార్చ్ 24 నుంచి విపరీతమైన మానసిక సంఘర్షణ…కంటికి కనిపించని శత్రువు తో ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒంటరి యుద్ధం చేస్తున్నాం. అందరి మధ్యలో ఉన్నాం కానీ ఏకాకులం.ఇంతటి భయంకరమైన విపత్తును ఎదుర్కొంటామని అసలు ఊహించలేదు .మాటలలో వర్ణించడానికి వీలు కాని పరిస్థితి.వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు ప్రారంభం కావడం ఒక రకంగా మంచిదే.కాకపోతే కొరోనా చావుల కంటే ఆకలి చావులు ఎక్కువ అయ్యేవి.కొన్ని రంగాలు ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్ట పోయినవి.రోజూవారీ సంపాదన లేక పూట గడవడం కష్టంగా వున్నది. లాక్ డౌన్ కారణంగా చీకటిలో బతుకుతున్నట్టు వున్నది.ప్లాన్స్ అన్నీ తల్లకిందులు అయినవి.రేపు ఏమిటి అన్న ప్రశ్న భయపెడుతున్న ది.చాలామంది మాస్కులు లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నారు.రోడ్లపై వుమ్మి వేస్తున్నారు.దీనికి కారణం కఠిన మైన శిక్షలు లేకపోవడమే .చట్టాల పట్ల భయం ,గౌరవం,అవగాహన వుంటే ఇంతగా వైరస్ స్ప్రెడ్ కాదు.ప్రభుత్వ బహిరంగ సమావేశాలలో సిబ్బంది,ప్రజలు కూడా పాల్గొంటారు…దీని వల్ల వైరస్ ఇంకా ఎక్కువ వ్యాపిస్తుంది.ప్రభుత్వ వైఫల్యం తో పాటు ప్రజల వైఫల్యం కూడా వున్నది.కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఉద్దీపన పథకం ప్రారంభించి వుంటే ప్రజలు బయటికి వెళ్ళే అవసరం రాక పోయేది.ప్రజలకు చాలా వరకు మేలు అయ్యేది.పేదవాళ్ళు,మధ్య తరగతి ఎక్కువగా సఫర్ అవుతున్నారు.ఇంటింటి సర్వే,టెస్టులు సక్రమంగా చేయించడం, కొరోనా ను ఎదుర్కోవడం ఎలాగో తెలిపే ప్రకటనలను పెంచుకోవడం,ప్రభుత్వ హాస్పిటల్స్ లో సౌకర్యాలు పెంచడం, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టడం,మెడికల్ సిబ్బందిని పెంచి డాక్టర్లకు నాన్ మెడికల్ సిబ్బంది కి రిలాక్సేషన్ ఇవ్వడం …ఇవ్వన్నీ అమలు చేయడం వల్ల కూడా కోవిద్ 19 ను కట్టడి చేయవచ్చు ..!

3.శృతి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్…

 womens-while-lockdown
ఈ పాండమిక్ ప్రభావం మహిళలపై ఎక్కువ గా చూపించింది.పని…పని…పని … ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనులతో నే సరిపోతున్నది.ఇంటి పని,వంట పని,పిల్లల అవసరాలు చూడడం,పని అమ్మాయి అవతారం ఎత్తడం,కుటుంబ సభ్యుల రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలో ఎప్పటి కంటే మరింత శ్రద్ధ తీసుకోవడం, ఇమ్యునిటీనీ పెంచే క్రమంలో ఆహారం విషయంలో వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎప్పటి కప్పుడు వండి వార్చడం ..అదే పనిగా సాగిపోతున్నది …ఊపిరి సలపని పని!.. కంటికి కనిపించని వైరస్ క్రిమి తో లోలోపల భయపడుతూనే పైకి మాత్రం శత్రువును ఎదుర్కోవడానికి ఎంతో మానసిక శారీరక స్థైర్యాన్ని కూడగట్టుకొని కుటుంబాన్ని కాపాడుకోవలసి వస్తున్నది. ఎంతో ఓపిక ను , మనో నిబ్బరం కలిగి వుండాలి. లాక్ డౌన్ విధించిన ప్రారంభంలో అంతా చాలా ప్రశాంతంగా గడిచింది.ప్రభుత్వాలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాయి కూడా… ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు…అంటే అన్ లాక్… లాక్ డౌన్ తీవ్ర ఇబ్బందులకు కారణ మయాయి.కొరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగి పోవడం జరిగింది.ఇదంతా చూస్తుంటే … నా చిన్నప్పుడు పిల్లలం అందరం ఎక్కి సరదా ఆడిన రంగుల రాట్నం రైడ్ గుర్తుకొస్తున్నది .అది ఎక్కే వరకు తెలియదు ఎంత పైకి వెళ్తుంది అన్నది…ఇప్పుడు మనం ఇదే స్థితి లో ఉన్నాం…ఎంత పైకి వెళ్ళినా మళ్లీ అదే క్రమంలో కిందికి రాక తప్పదు కదా.. ఆ సమయం కోసం వేచి చూసే నిశ్శబ్ద వీక్షకులం మాత్రమే మనం! వేచి చూడక తప్పదు…

4.డా .యామిని,అసిస్టెంట్ ప్రొఫెసర్
కొరోనా..కొరోనా..కొరోనా…
ఈ మధ్య….ఈ టాపిక్ తప్ప మరొకటి లేదు.ఆరోగ్య సేతు ఆప్ .. పాజిటివ్ కేసులు.. జీ హెచ్ ఏం సి కేసులు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ఆరోగ్య శాఖ ఇస్తున్న సూచనలు..ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే… కొరోనా కు ముందు,కొరోనా టైమ్ లో,కొరోనా తరువాత ప్రజల జీవన శైలి యెట్లా వున్నది…యెట్లా వుండబోతున్నది అవలోకనం చేస్తే…కొరోనాకు ముందు సామాజిక సహజీవనం స్వేచ్చగా సాగింది.ఇంటి పనులకు హెల్పర్ రావడం,పేపర్ బాయ్ పత్రిక వేయడం, పాల ప్యాకెట్ ఇంటికి తెచ్చి ఇవ్వడం,ఇరుగుపొరుగు స్నేహ పూర్వక పలకరింపులు,ప్రజా రవాణా సౌకర్యం,తోటి ప్రయాణికుల పలారింపు,పని చేసే సహోద్యోగుల స్నేహ పూర్వక వాతావరణం,కలిసి లంచ్ చేయడం, ఇంటికి వచ్చిన తరువాత ఆ రోజటికి కావలసిన సరుకులు తెచ్చుకోవడం,షాపింగ్,ఈవెనింగ్ వాకింగ్,పిల్లలతో పార్క్ కు వెళ్ళడం,వారాంతం లో సినిమా , మాల్స్,బంధువులు,స్నేహితుల ఇండ్లకు వెళ్ళడం,ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమగా ఆహ్వానించడం…ఇవన్నీ యెటువంటి నిర్బంధాలు లేకుండా హాయిగా నిర్భయంగా సంతోషంగా గడిపిన సందర్భాలు.కొరోనా పీరియడ్ లో …ఊహించని ఎన్నో మార్పులను ఎదుర్కొంటున్నము.అసాధ్యము,చేయలేము,మనవల్ల కాదు అనుకున్న ఎన్నో పనులు మనం చేసుకుంటున్నాము.చేసుకోక తప్పని పరిస్థితి.

అదే నిర్బంధం…!మనిషి సంఘజీవి.సామాజిక జీవనం పైనే నిర్బంధం ఏర్పడి తన అస్తిత్వాన్ని కోల్పోతున్న డు సగటు మానవుడు. కానీ తప్పదు…ఎవరినీ కలవకుండా నాలుగు గోడల మధ్య తనని తాను నిర్బంధిం చుకోవలసిన పరిస్థితి. ఎదుటి మనిషితో మాట్లాడాలంటే భయం..హెల్పేర్ తో పని చేయించుకోవాలంటే భయం…పేపర్ బాయ్,మిల్క్ వెండర్… అందరూ ఇంటికి రావడం నిషేధం…తప్పదు మరి…కొరోనా ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించక తప్పని పరిస్థితి.ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ..ఇది ఇట్లా వుంటే…కొరోనా తరువాత…పాజిటివ్ గా ఆలోచిస్తే… వాక్సిన్ వస్తుంది…రోగ నిరోధక శక్తి పెరుగుతుంది…అని ఆశావహ దృక్పథం తో ముందుకు వెళితే…కొరోనా తరువాత అన్నీ మంచి రోజులే అనిపిస్తున్నది.క్రమశిక్షణ తో కూడిన స్వేచ్ఛ…ఎవరి పై ఆధారపడకుండా మన పని మనమే చేసుకోవడం..అది వ్యాయామం లాగా మారి అనారోగ్యం దరి చేరక పోవడం..బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడం..ఇరుగు పొరుగు తో అనవసరమైన గొడవలు సమసిపోయి ప్రశాంత మైన వాతావరణం ఏర్పడడం..బయటి తిండ్లు కు స్వస్తి చెప్పడం వల్ల ఆరోగ్యం…డబ్బు కూడా ఆదా అవడం…వాహనాల రద్దీ తగ్గడం వల్ల కాలుష్యం తగ్గడం…ఫలితంగా.. ఇన్ మాస్క్ ధరించడం,ఇంటికే పరిమితం కావడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పట్టాయి.. బయటి ఫుడ్ మానేయడం తో గ్యాస్ట్రో ఎంట్రీటీస్ సమస్యలు రావు..రోడ్డు ప్రమాదాలు , క్రైమ్ రేట్ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి..ఈ విధంగా క్రమ శిక్షణతో కూడిన జీవన విధానం అలవాటు చేసుకుంటే ఎటువంటి వైరస్ ను అయిన మనోనిబ్బరం తో ఎదుర్కోవచ్చు.

5.మాలతి లత,అధ్యాపకురాలు
కొరోన ఉనికి తో నాలుగు నెలల కాలం అనేది ఒక ఊహించని అనుభవం. ఈ కాలం రాకముందు అసలు ఇలాంటి కాలం వస్తది అన్నది ఊహించలేదు. మద్యం కి అనుమతి అనేది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు, ఇంకా చెప్పాలంటే నేరం కూడా.. ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల కు అనుమతి ఉండాలి.ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలి కాబట్టి .కాకపోతే అక్కడ కూడా బిజినెస్ కి కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.పనిభారం ఒత్తిడి చాలా ఫీల్ అయ్యామండి. ఇంట్లో కూర్చోవడం బయటకి వెళ్లకపోవడం వస్తువులు ఏమన్నా అయితే తీసుకొచ్చిన తర్వాత శుభ్రపరచడం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిన టెన్షన్ పడటం పని మనుషులు మానేయడం వల్ల ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి ,కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్న వారికి కావలసినవి అన్ని తయారు చేయడం. ఇవన్నీ పని ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఒక మానవీయ స్పందనకు, ఆత్మీయ స్పర్శకు మాత్రం దూరమవుతున్నామని బాధా గా ఉంది.శానిటైజర్ లు మాస్కులు కొనుక్కునే పరిస్థితి లేని పేదలకు వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కలిగించి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు గానీ వారికి ఉచితంగా చేయాలి. ఎందుకంటే మన దేశం ఎక్కువగా గ్రామీణ భారతదేశం కాబట్టి…పేదల సంఖ్య ఎక్కువ గా ఉంది కాబట్టి.ఇక ప్రభుత్వ బహిరంగ కార్యక్రమాలు చాలా తప్పు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మందిగా ఎక్కడ ఉండకూడదు.. కమ్యూనిటీ స్ప్రెడ్ కి ఇవే ముఖ్య కారణం. బహిరంగ కార్యకలాపాలు ప్రజలైన ప్రభుత్వమైనా ఎట్టి పరిస్థితుల్లో జరపకూడదు.రోడ్లమీద తిరిగే మనందరం ఆదిమ కాలంలో ఆదిమానవుల్లా పాత రాతి గుహలు లోనే ఉండి కేవలం ఆహార సేకరణ బయటికి వచ్చి తర్వాత తలుపులు మూసుకున్నట్టు ఉంది. లాక్ డాన్ ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరలేదు .రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వం ఒక స్థాయిలో కొరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం నిజంగానే చాలా సమర్థవతంగా పని చేశాయి. కానీ తర్వాత కాలం లో ఇంటెన్సిటీ ని తగ్గించి ప్రజల స్వయం బాధ్యతను పెంచినట్టు నేను భావిస్తున్నాను.చిన్న పిల్లలకు స్కూల్ స్టార్ట్ చేయొద్దు. పెద్ద పిల్లలకు ఆన్లైన్లో కనెక్ట్ చేయాలి. చిన్న పిల్లల్ని బయటికి పంపించే ముచ్చటే లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరానికి సదువు వస్తది. భవిష్యత్ తరాలు బ్రతికి ఉండాలి అని నా అభిప్రాయం, కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలైన విషయం 100 శాతం నిజం. మనలాంటి దేశాల ప్రజలకు సమూహ స్వభావం ఎక్కువ. ఏదో ఒకరకంగా ఒక మనిషి ఇంకో మనిషిని కలిసి ఉండాలి అనే భావం ఎక్కువగా ఉంటది.కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ ని ఎదుర్కోవాల్సిండే.. కమ్యూనిటీ స్ప్రె డ్ఒక స్థాయి దాటినప్పుడు ఆటోమేటిక్ వైరస్ ని ఎదుర్కొనే ఇమ్మ్యూనిటి ప్రజల్లో మొదలతుంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు నెలల కాలము అనేది వ్యక్తుల లో ఉన్న అంతర్గత సృజన ను వెలికి తీసుకు వచ్చింది. మానవ సంబంధాలను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చింది, ఒక ఉరుకుల పరుగుల జీవితం నుంచి తిరిగి ముఖ్యంగా ఆత్మవలోకానికి ఒక ఉత్పాదక సమయాన్ని ఇచ్చింది.

Leave a Reply