ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మనందరికీ గర్వకారణం

పహల్గామ్‌కు భారత్‌ ‌ప్రతీకార దాడి
కేబినేట్‌ ‌సమావేశంలో ప్రధాని మోదీ వివరణ

న్యూదిల్లీ, మే 7 :  పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ‌ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్‌ ‌సమావేశం జరిగింది. ఈ దాడి గురించి ప్రధాని మోదీ సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’‌ను అభివర్ణించారని సమాచారం. పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు ఉగ్ర శిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్‌ 22‌న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధి కారులు ప్రపంచ దేశాలకు వివరించారు.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్‌ ‌డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ ‌పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దభోల్‌ ‌మాట్లాడారు. ఏప్రిల్‌ 22‌న పహల్గాంలోని బైసరన్‌ ‌లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రమూక టార్గెట్‌ ‌చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్‌ ‌నర్వాల్‌, ‌హిమాన్షి ఉన్నారు.టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కుదిపేసింది. వినయ్‌ ‌నేవీ అధికారి కూడా. ఈ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీనిని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *