Take a fresh look at your lifestyle.

ఆర్మీ …‘ఆపరేషన్‌ ‌నమస్తే’

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనా వైరస్‌తో యుద్ధానికి చివరకు ఇండియన్‌ ఆర్మీకూడా రంగంలోకి దిగింది. దేశ రక్షణ విషయంలో ఇప్పటికే అనేక ‘ఆపరేషన్‌’‌లను విజయవంతంగా పూర్తిచేసిన ఆర్మీ కోవిద్‌-19 ‌మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటంలో తనవంతు పాత్ర పోషించేందుకు రంగంసిద్ధం చేసింది. ఆపరేషన్‌ ‌నమస్తే పేరున చేపడుతున్న ఆపరేషన్‌లో కూడా విజయం సాధిస్తామని ఆర్మీ ధీమా వ్యక్తం చేసింది. కొరోనాపై పోరాటం చేయడమంటేనే మనకు మనం రక్షించుకునే విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. దాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు, జవాన్లు స్వీయ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలను చేస్తున్నారు. దేశ రక్షణలో తమ ఇండ్లకు దూరంగా ఉన్న జవాన్లు కొరోనా విస్తృతమవుతున్న సమయంలో తమ కుటుంబీకుల ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఒక వేళ వారి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఎదురైతే స్థానిక ఆర్మీక్యాంపుకు తగిన సమాచారాన్ని చేరవేస్తే, వారికి తగిన చికిత్సను అందించే ఏర్పాటుకోసమే ఈ ‘ఆపరేషన్‌ ‌నమస్తే’ అంటూ, దాని ప్రారంభోత్సవ సందర్భంగా భారత ఆర్మీ ఛీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవణే పేర్కొనడం గమనార్హం.

ప్రపంచ దేశాలన్నిటినీ ఆందోళనలో ముంచడంతో పాటు, వేల సంఖ్యలో ప్రజల మరణానికి కారణమవుతున్న కొరోనాను శస్త్రాస్తాలతో ఎదుర్కునే అవకాశం లేకపోవడంతో మూడు వందల కోట్ల జనం ఇళ్ళకే పరిమితమైనారు. మిగతాదేశాలతో పాటు భారత్‌ ‌కూడా స్వీయరక్షణే దీనికి తగిన మందుగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. చాపకింద నీరులో దేశంలోని విభిన్న ప్రాంతాల్లో శరవేగంగా విజృంభిస్తుండడంతో ఇప్పటికే భారత ప్రభుత్వం ఏప్రిల్‌ 14 ‌వరకు లాక్‌ ‌డౌన్‌ను ప్రకటించింది. బస్సులు, రైళ్ళు, విమానాలతో పాటు ఎలాంటి రవాణా సదుపాయాలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంది. కేవలం వాహనాలే కాదు, రోడ్లపై జన సంచారమే లేకుండా కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించింది. అత్యవసర సమయాల్లో లేదా నిత్యావసర సరుకులను కొనుగోలుచేసేందుకు మాత్రమే కొంత వెసులబాటును కల్పించింది. ఇంతటి భయానక పరిస్థితిలో ఎల్‌ఓసిలో, ఎల్‌ఏసీలో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న జవాన్లు, తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందటం సహజం. పాక్‌, ‌చైనా సరిహద్దుల్లో కంటిరెప్పవేయకుండా దేశరక్షణలో ఉన్న జవాన్లతో పాటు , ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆర్మీకేర్పడింది. జవాన్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటేనే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరు. అందుకే వారి కుటుంబ సభ్యులగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, వారికి సహాయంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఆర్మీ ప్రవేశపెట్టింది. ఈ హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌కు సమాచారం అందించిన వెంటనే వారికి కావాల్సిన చికిత్సను వెంటనే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కమాండ్లవారీగా సాయం అందించే ఏర్పాట్లుచేశారు. కొరోనా వైరస్‌ అనుమానిత కేసులకోసం పంజాబ్‌, ‌హరియాణ, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్మూకాశ్మీర్‌లతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది క్వారంటైన్‌ ‌సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఆర్మీఛీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌కుమార్‌ ‌ముకుంద్‌ ‌నరవణే చెప్పడం, ఈ మహమ్మారి పోర•టంలో ఆర్మీ భాగస్వామ్యాన్ని చెప్పకనే చెబుతున్నది.

ఇదిలా ఉంటే రోజురోజుకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో విజృంభిస్తున్న కొరోనా అనుమానితులను అబ్జర్వేషన్‌లో పెట్టేందుకు ఆసుపత్రులు, స్టేడియంలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఏమాత్రం సరిపోయే పరిస్థితి కనిపించడంలేదు. అందుకు ఇండియన్‌ ‌రైల్వేస్‌ ‌మరో సులభ మార్గాన్ని కనిపెట్టింది. తమ ఆధీనంలో ఉన్న ఏసి కోచ్‌లను క్వారంటైన్‌ ‌వార్డులుగా మార్చేంచుకు సన్నద్ధమైంది. కోవిద్‌ 19 అనుమానిత పేషంట్‌ను ఐసోలేషన్‌లో ఉంచేందుకు ఈ కోచ్‌లు బాగా ఉపయోగపడనున్నాయన్న ఆలోచన చేశారు. అన్ని హంగులతో ఉండే ఒక్కో కోచ్‌లో పార్టీషన్‌చేసి, పదిమంది పేషంట్స్‌కు ఒక కోచ్‌ను ఏర్పాటు చేసేందుకు •కేంద్ర రైల్వే మంత్రితోపాటు, సంబంధిత అధికారులు ఆలోచిస్తున్నారు. ఆందుకోసం కావాల్సిన సదుపాయాలను ఎలా అమర్చాలన్న విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రతీ వారం ఒక జోన్‌ ‌పరిధిలో పదికోచ్‌లను ఇలా మార్పిడిచేయాలనుకుంటున్న ఇండియన్‌ ‌రైల్వేకు దేశ వ్యాప్తంగా పదిహేడు జోన్స్ ఉన్నాయి. ఈ ఐసోలేటెడ్‌ ‌కోచ్‌లను రైల్‌ ‌పరిధిలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. వీటిని పూర్తిగా సానిటైజ్‌ ‌చేసి ఉంచుతారు. ఇదిలాఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అనుమానిత పేషంట్స్‌ను ఐసోలేషన్‌లలో ఉంచేందుకు కావల్సిన వసతులతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల వివరాలను తమకు అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఇవి జనావాసాలకు, స్టేడియం, ప్రార్థనాలయాలకు దూరంగా ఉండాలని కూడా సూచనచేసింది. దీనివల్ల దేశంలో విధించిన లాక్‌డైన్‌ ఏ‌ప్రిల్‌ 14‌తోనే అంతం కాదని, మరికొంతకాలం కొనసాగనుందన్నది అర్థమవుతున్నది.

Leave a Reply