Take a fresh look at your lifestyle.

తెరుచుకున్న మద్యం దుకాణాలు

  • ఉదయం నుంచే కిలోమీటర్ల కొద్దీ బారులు
  • క్రమశిక్షణతో కొనుగోలు చేసిన మందుబాబులు
  • క్యూలైన్లు ఏర్పాటు మాస్కు లేకుంటే నో లిక్కర్‌
  • ‌రాష్ట్రవ్యాప్తంగా 2300 దుకాణాలలో మద్యం విక్రయాలు
  • హైదరాబాద్‌లో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సిపి అంజనీకుమార్‌
  • ‌తొలిరోజు ప్రభుత్వానికి  రూ. 40 కోట్లు ఆదాయం

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో గత 40 రోజులుగా మూసుకుపోయిన దుకాణాలు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇవ్వడంతో బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతినివ్వగా మందుబాబులు ఉదయం 6 గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ క్రమశిక్షణతో మద్యం కొనుగోలు చేశారు. పొరుగు రాష్ట్రమైన ఏపీ మాదిరిగా మద్యం దుకాణాల ముందు ఎక్కడా తోపులాట గానీ మద్యం కోసం గుంపులుగా గుమిగూడటం కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతోపాటు నిర్వాహకులు మద్యం దుకాణాల ముందు భౌతిక దూరాన్ని పాటించే విధంగా మార్కింగ్‌ ‌చేసి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దుకాణాల ముందు పోలీసుల పహారా మధ్య మద్యం విక్రయాలు జరపడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2300 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో 15 కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఉన్నాయి. వీటిని మినహాయించి మిగతా దుకాణాలన్నింటిలో మద్యం విక్రయాలు యధావిధిగా జరిగాయి. కాగా, సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించిన విధంగా మద్యం దుకాణాలు తిరిగి తెరిచిన బుధవారం రోజు నుంచే పేదలు ఎక్కువగా వినియోగించే చీప్‌ ‌లిక్కర్‌పై 11 శాతం, ఇతర బ్రాండ్లపై 16 శాతం పెంచిన ధరలతో విక్రయాలు జరిపారు. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి కనిపించింది.

నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాధాపూర్‌, ‌దిల్‌సుక్‌నగర్‌, ‌సికింద్రాబాద్‌, ‌నారాయణగూడ, ఎల్బీనగర్‌ ‌ప్రాంతాలలో మందుబాబులు మద్యం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. సికింద్రాబాద్‌ ‌ప్రాంతంలోని తుకారాంగేట్‌ ‌ప్రాంతంలోని ఏ మద్యం దుకాణం వద్ద మహిళలు సైతం మద్యం కోసం బారులు తీరడం గమనార్హం. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో మందుబాబులు తాము నిలుచున్న సర్కిల్‌లో చెప్పులు, చేతి రుమాళ్లు ఉంచి సమీపంలో ఉన్న దుకాణాలు, చెట్ల నీడన విశ్రాంతి తీసుకోవడం కనిపించింది. నగరంలోని మొత్తం 178 దుకాణాలలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నగరంలోని మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని హైదరాబాద్‌ ‌నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌స్వయంగా పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌ ‌వద్ద ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయాల కోసం ప్రత్యేక మార్కింగ్‌ ‌చేయించామని చెప్పారు. మద్యం దుకాణాలు తెరిచిన నేపథ్యంలో కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామనీ, భౌతిక దూరంతోనే కొరోనాను నియంత్రించే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా అంజనీకుమార్‌ ‌కోరారు. మరోవైపు, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన వరంగల్‌, ‌కరీంనగర్‌,‌నిజామాబాద్‌, ‌ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో సైతం ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆయా ప్రాంతాలలో ఉదయం నుంచే మందుబాబులు బారులు తీరగా పోలీసుల పర్యవేక్షణలో నిర్వాహకులు మద్యం విక్రయాలు జరిపారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కు నిబంధన తప్పనిసరి అని ప్రకటింకడంతో మందుబాబులు ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని మద్యం కొనుగోలు చేశారు.

Opening liquor stores

మరోవైపు, లాక్‌డౌన్‌ ‌సమయంలో దుకాణాల నుంచి మద్యం నిల్వలు మాయమైనట్లు ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం, బుధవారం ఉదయం ఆయా దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా ఎక్సైజ్‌ అధికారులు భారీ మొత్తంలో దొంగచాటుగా సరుకు రవాణా అయినట్లు గమనించారు. మద్యం బాటిళ్లతో నిండుగా ఉండాల్సిన ర్యాక్‌లన్నీ ఖాళీగా కనిపించాయి. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న నిల్వలో దాదాపు 70 శాతం వరకూ నిర్వాహకులు తమదైన శైలిలో విక్రయించినట్లు సమాచారం. ముఖ్యంగా బీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేనందున ముందుగా వాటిని దొడ్డిదారిన బ్లాక్‌ ‌మార్కెట్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విధంగా దాదాపు రూ. 300 కోట్ల విలువైన బీరును లాక్‌డౌన్‌ ‌సమయంలో విక్రయించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తొలిరోజు ఆదాయం రూ. 40 కోట్లు
లాక్‌డౌన్‌తో తెలంగాణలో 40 రోజుల పాటు మూతపడ్డ మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్న తొలిరోజే జోరుగా విక్రయాలు సాగాయి. మద్యం అమ్మకాలపై బుధవారం ప్రభుత్వానికి రూ. 40 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు వెల్లడించారు. చాలా షాపులలో మధ్యాహ్నం వరకే నిల్వలు నిండుకోవడంతో సమీపంలో ఉన్న లిక్కర్‌ ‌డిపోల నుంచి దుకాణాలకు తరలిచేందుకు ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply