‘ఇక చాలు….
ద్వారాలు తెరవాలనుంది
మానవీయత పులుముకుని
పునీతమైన ‘‘కొత్త’’దారులలో
‘‘స్వేచ్ఛగా’ అలా
అలా నడచివెళ్ళాలనుంది’
ఊచల చాటు నుంచి ఒక మాట..
రంగులు జల్లుకొని మరీ
నవ్వులు రువ్వుతున్నావు కదూ!
వెన్నెలా!
సంకెలలు లేని ఖైదులో
అచ్ఛాదన చాటు నుండి
అస్పష్టంగా పలుకరించే
విశృంఖల స్వేచ్ఛా జీవిని
నా ‘‘ఇరుకు’’ గది బతుకు చూసి
నవ్వులాటలా వుందా!
బయట….
కనిపించని శత్రువుతో
ఆయుధాలే లేని యుద్ధంలో
ఆక్రందనల ఘోష
హననమైన జీవుల
నిర్జీవ దేహరాశుల
ఖననానికైనా చాలని నేల
శత్రువు నిఘా కంటికింద
ఉచ్వాస,నిచ్వాసాల ఉనికి
ప్రశ్నార్థకమైతున్న వేళ
రణభూమిలోని రహస్య బొరియలాంటి
నా గది కిటికీ రెక్క సందుల్లోంచి
ఒంటి కనురెప్ప మాటుగా చూస్తూ
భయం గుప్పిట్లో
పిడికెడు గుండెను
పదిలంగా చిక్కబట్టుకొని
మాట్లాడుతున్నాను.
ఊచలు లేని బందీఖానాలో
తెలియని నేరానికి ఖైదీయై
ఒంటరితనం చేస్తున్న
నిశ్శబ్ధ దాడిలో
దివారాత్రుల తేడాలు తెలియని
చిత్తభ్రమణ చిత్ర శయ్యపై పరుండి
తలకిందులుండే మతం గబ్బిలాలతో
మాట్లాడుతున్నాను.
బాల్కానీ లోకి దూసుకొచ్చిన
చల్లని గాలి తెమ్మెరొకటి
నన్ను స్పృహలోకి తోసినప్పుడు
వాస్తవ లోకాన తూలిపడ్డప్పుడు
నను ఓదార్చే, నా నెచ్చెలి
నా హృదయరాజ్ఞి, ‘సాహితీ’
సౌందర్యపు పాపిట కురులు సరిచేస్తూ
‘‘కమ్మల’’ సున్నిత స్పర్షలతో
గుసగుసలాడుతున్నాను.
ఇక చాలు….
ద్వారాలు తెరవాలనుంది
మానవీయత పులుముకుని
పునీతమైన ‘‘కొత్త’’దారులలో
‘‘స్వేచ్ఛగా’ అలా
అలా నడచివెళ్ళాలనుంది
‘‘బలుసాకు’’ తోటలు దాటి
విద్వేషాలను వెదజల్లిన
దారి పొడవునా వెదకి, వెదకి
మానవత్వాన్ని పిచికారి చేస్తూ
భయం తొలగిన వూరి వాడలన్నీ
చుట్టి రావాలనుంది.
మండిబజార్ చెట్టు నీడన
కమ్మని ఇరానీ ఛాయి త్రాగి
మళ్ళీ నా దేహంలోకి
ప్రాణ వాయువును
నిర్రంధిగా నింపుకోవాలనుంది.
ఇక చాలు!
నవ్వులింక ఆపు! వెన్నెలా!
(బ్లూ మూన్ రాత్రి)
