- ఆయన బిసిలకు అండగా నిలిచారు
- ఆత్మగౌరవం కల్పించిన ఏకైక నేత
- విజయవాడ సభలో ఆర్. కృష్ణయ్య ప్రశంసలు
విజయవాడ,డిసెంబర్7 : ఏపీలో సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ బిల్లు వస్తే.. బీసీల తలరాతలు మారిపోతాయి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు జగన్.. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశానని.. కానీ ఎవరూ ముఖ్యమంత్రి జగన్‌లా కృషి చేయలేదన్నారు.
ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారని.. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నేత అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారని కితాబిచ్చారు. మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడ దన్నారు. చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పాలన చూసి ఇతర రాష్టాల్రప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుతున్నారని..
ఆ మధ్య కర్ణాటకకు పోయినా అక్కడ బెల్గాంలో సమావేశం పెట్టిన సమయంలో కొందరు ఈ డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు ఏపీలో కలపాలని కోరుతున్నారని.. సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు అడుగుతున్నారన్నారు. కర్ణాటకలో కూడా బాగానే ఉంది కదా అని తాను అడిగితే.. లేదు ఏపీలో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీలు, ఇతర పదవులు ఇస్తున్నారని.. అలాగే వివిధ పథకాల ద్వారా సంక్షేమం అందిస్తున్నారని తనతో చెప్పారని వివరించారు.