Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ అం‌తరాన్ని పెంచుతున్న ఆన్‌లైన్‌ ‌విద్య

“వైద్య సదుపాయాల కొరత వలన ఎన్నో ప్రాణాలు గాలిలో కలసి పోయిన తరుణంలో మన దేశంలో వైద్య అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు మధ్య ఉన్న అంతరాన్ని కళ్ళ ముందు చూపింది. ఇటువంటి విపత్తులో అందరికీ విద్య అందించే విషయంలో సాంకేతికత అందించడంలో ఎంత వెనక్కు ఉన్నామో అనేది స్పష్టం చేసింది.సిలబస్‌ అయిపోయింది అనిపించుకుని పై తరగతులకు ప్రమోట్‌ ‌చేసుకుంటూ పోతున్న ఈ సాంకేతిక బోధనలో సృజనాత్మకత గల విద్యార్థులు లభిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.ఇది వ్యక్తిగతంగా పిల్లలే కాదు సమాజం మొత్తం నష్టపోతోంది.”

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా అంతర్జాలం ( ఇంటర్నెట్‌) అనేది ఈ రోజు ప్రపంచంలోని ప్రతి పౌరుడి జీవితంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. కోవిడ్‌ ‌మహమ్మారి మన చెంతకు చేరిన ప్రస్తుత సమయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించించుకు నే ఎన్నో పనులు ను చక్కబెట్టుకుంటున్నాం.భౌతికంగా దగ్గర కాలేని సమయంలో వర్చువల్‌ ‌గా దగ్గర అవుతున్నాం.ఇంటి వద్దనుండే ఉద్యోగాలు చేపడుతున్నాం..ఆన్లైన్లోనే వైద్య సలహాలు పొందుతున్నాం.అయితే ఈ మహమ్మారి కారణంగా నేడు సమూహాలుగా ఒక చోట చేరే అవకాశం లేకుండా పోయింది..ఇది ప్రధానంగా విద్యా రంగానికి తీవ్ర అవరోధంగా మారింది.. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా సాంకేతికతను ఆసరాగా తీసుకుని ఇంటివద్ద నుండే విద్యార్థులు పాఠాలు వినే విధంగా ఆన్లైన్‌ ‌క్లాసెస్‌ ‌కు ఆన్లైన్‌ ‌బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉపాధ్యాయుడు పిల్లలతో కూడిన తరగతిగది అనుభూతి తో పోలిస్తే ఆన్‌ ‌లైన్‌ ‌బోధన అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది.ఎందుచేతనంటే తరగతి గది అనేది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఒక వారధి వంటిది. బోధనలో అనుబంధంగా సాంకేతికత ఉపయోగిస్తే విద్యార్థులు మరింత పరిణితి సాధించే వీలు ఏర్పడుతుంది.అయితే ఇక్కడ సాంకేతికత అనేది అనుబంధంగా కాకుండా అంతా తానుగానే కొనసాగితే.. మానవ ప్రమేయం లోపిస్తుంది.

ఇటువంటి స్దితిలో విద్యార్థులలో సామాజిక స్పృహ ..బాధ్యత అనేవి లోపిస్తాయి..నైతికతకు అవకాశం లేకుండా పోయే బోధన వలన ఏర్పడే పరిణామాలు సమాజానికి చేటు తెస్తాయి.తరగతి గదిలో సమూహంగా ఉండి విద్యను అభ్యసించడం..ఏకాంతంగా ఉండి విద్యను అభ్యసించడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది.తరగతి గది విద్యాభ్యాసం లోపిస్తే స్నేహితులు లభించరు.బంధాలు ఏర్పడవు.డిజిటల్‌ ‌తరగతి గది కి మించిన అద్భుతమైన ప్రపంచం సాధారణ తరగతి గదిలో ఉంది..తరగతి గది లోపల బయట అనేక పరిసరాలు పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో సహకరిస్తాయి.వారి యొక్క మానసిక స్థితిగతులకు అనుగుణంగా బోధన చేయడం అనేది తరగతి గదిలోనే సాధ్యం అవుతుంది ముఖాముఖి బోధనతోనే విద్యార్థులలో సృజనాత్మకత ఏర్పడుతుంది.దీనిని బట్టి నిస్సందేహంగా తరగతి బోధనకు మరొక ప్రత్యామ్నాయమే లేదనే చెప్పవచ్చును.ఇన్ని ప్రయోజనాలు తరగతి గది బోధనలో ఉన్నప్పటికీ నేటి కరోనా సంక్షోభ సమయంలో అసాధారణమైన పరిస్థితుల్లో డిజిటల్‌ ‌పద్ధతుల్లో విద్యాబోధన జరగటం అవసరమైనది మరియు అనివార్యమైనదిగా చెప్పవచ్చును. ఎందుకంటే నెలల తరబడి విద్యార్థులు పుస్తకాలను మూసి ఉంచే పరిస్థితిని తప్పించి క్రమం తప్పకుండా ఏదో ఒకటి చదవాల్సిన, వినాల్సిన స్థితికి రావడం నిజంగా ప్రయోజనకరమే! అయితే ఈ బోధన అందరికి అందుబాటులోకి తీసుకురాగలగాలి. అంటే దానిని పొందగలిగే సాంకేతిక పరికరాలు కొనగలిగే స్ధోమత అందరికి ఉండాలి.దానిని ఉపయోగితలోనికి తీసుకురావడానికి అవసరమైన అంతర్జాల సేవలు అన్ని ప్రాంతాలలో వికేంద్రీకృతం కావాలి ఎందుకంటే నెట్‌వర్క్ ఇబ్బందుల్ని పరిష్కరించకుండా ఆన్‌లైన్‌ ‌చదువులు కొనసాగించడం వలన అందరూ ఆ అవకాశాలను ఉపయోగించుకోలేరు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లలు ఉంటే వాటిని ఉపయోగించే పరిజ్ఞానం వారి తల్లి తండ్రులకు తెలిసి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి నిరక్షరాస్యత ఎక్కువ.అయితే ఈ కోణంలో పరిశీలిస్తే దేశంలో ఎందరో పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ ‌విద్యను అందిపుచ్చుకొనే పరిస్థితుల్లో లేరని మరియు గిరిజన ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ ‌బోధన చేరడమనేది ఎప్పటికి సాధ్యమవుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొని ఉందని వివిధ అధ్యయనాలు ద్వారా తెలుస్తుంది. అంతే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యుచ్చక్తి సదుపాయాలు లేకపోవడం..లేదా విద్యుచ్చక్తి కోత, నెట్‌ ‌సిగ్నల్స్ ‌రాకపోవడం, కంప్యూటర్‌ అక్షరాస్యత లేకపోవడం వలన ఎక్కువ మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.

ఇన్ని ఇబ్బందుల నడుమ ఆన్లైన్‌ ‌విద్య ఒక పక్క కొద్దిమందికి కొంత ఉపయోగ పడినప్పటికీ మరొక పక్క అది నేటి సామాజిక,ఆర్థిక అసమానతలను మరింత పెంచి పోషిస్తుందనే చెప్పవచ్చును. మెజారిటీ గా ఉన్న దళిత ,పీడిత కులాలు, బీద బడుగు వర్గాల నుండి వచ్చే విద్యార్థులదగ్గర సాంకేతిక పరికరాలు లేక డిజిటల్‌ ‌బోధనకు కొందరు దూరం అయిపోయారు.వీరిలో చాలా మంది తల్లి తండ్రులకు సహాయకులుగా వ్యవసాయ శ్రామికులుగా మారిపోయారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.దానితో పాటు మన దేశంలో పోషకాహార లేమితో బాధపడే వారి సంఖ్య అధికమే. అయినప్పటికీ వీరి ఎదుగుదలకు కావలసిన పోషకాహారాన్ని అందించడంలో అంగన్వాడీలు, పాఠశాలలే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 12 లక్షల పాఠశాలల్లో దాదాపు 12 కోట్ల మంది పిల్లలకు కోవిడ్‌ ‌మహమ్మరి కారణంగా మధ్యాహ్న భోజన పథకం అందుబాటులో లేకుండా పోవడం వలన లక్షలాది మంది పిల్లలు తీవ్ర పోషకాహార లేమితో బాధపడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం పిల్లలుకు పోషకాహారాన్ని ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేశామని చెబుతున్నాయి.అయితే ఆక్స్ఫామ్‌ ‌సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పిల్లలలో కేవలం 35% మందికే ఇది అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.

సాధారణ పరిస్దితులలో నే పేదరికం కారణంగా చదువుకు దూరమైన వాళ్ళు కలిగిన మన సమాజంలో ఈ ఆన్లైన్‌ ‌విద్య ద్వారా మరికొంత మంది పై జాబితాలోనికి చేరుతున్నారు.. భాగ్యవంతుల బిడ్డలకు విద్యాభ్యాసంలో మాత్రం అంతరం ఏర్పడటం లేదు..ఈ పరిస్దితులు ఈ రెండు వర్గాల మధ్య అసమానతలను అధికం చేస్తున్నాయి.అసలే ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్న మన సమాజంలో ఆర్ధిక అసమానతలు గత కొన్ని దశాబ్దాలు తరబడి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అనివార్యమైన ఈ డిజిటల్‌ ‌బోధన నూతనంగా సాంకేతిక అంతరాన్ని తీసుకు వచ్చింది.మధ్యతరగతి పేద వర్గాలు వారు అధికంగా ఉండే మన సమాజంలో ప్రజలు ఆర్థికంగానే కాదు సాంకేతిక వసతులలో కూడా వెనుకబడ్డారు.ఈ కారణంగా ఈ కోవిడ్‌ ‌విపత్తులో ఆన్లైన్‌ ‌లో మూడో వంతు మంది పిల్లలే అభ్యసిస్తున్నారని వార్షిక విద్యా నివేదిక సారాంశం.దీనిని బట్టి డిజిటల్‌ ‌బోధనలో డ్రాప్‌ అవుట్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక దేశ వ్యాప్తంగా 24 % కుటుంబాలకు ఇంటర్నెట్‌ ‌సదుపాయం లేదు. పట్టణ ప్రాంతాలలో 42% కుటుంబాలకు ఇంటర్నెట్‌ ‌సదుపాయం ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో 15% కుటుంబాలు మాత్రమే ఈ సదుపాయం కలిగి ఉన్నాయి.దీనిని బట్టి చూస్తే డిజిటల్‌ అం‌తరం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. పేద కుటుంబాలలో కేవలం 2.7% మందికి మాత్రమే కంప్యూటర్‌ అం‌దుబాటులో ఉండగా, 8.9% మందికి మాత్రమే ఇంటర్నెట్‌ ‌సదుపాయం ఉంది. సంస్థాగత పరంగా చూసిన డిజిటల్‌ ‌బోధనకు తగిన సంసిద్ధత మన దేశంలో లేదనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా 12 లక్షల ప్రభుత్వ పాఠశాలలకు, 4 లక్షల చిన్న స్థాయి ప్రైవేట్‌ ‌పాఠశాలలకు డిజిటల్‌ ఆధారిత బోధనను నిర్వహించేందుకు తగిన మౌలిక సదుపాయాలు కానీ, ఆర్ధిక వనరులు కానీ లేవు.కర్ణాటక, తమిళనాడు సహా పది రాష్ట్రాల్లో 20శాతం కన్నా తక్కువ జనాభాకే నెట్‌ ‌సదుపాయం ఉందని, అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పేద వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని అందరికి ఆన్లైన్‌ ‌విద్య అందే విధంగా చర్యలు చేపట్టడంలో దేశం మొత్తం మీద కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పవచ్చును.దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుంటే ఆన్లైన్‌ ‌విద్య అందరికి అందుబాటులో లేదని తెలుస్తూ ఉంది.ఆన్లైన్‌ ‌విద్య ప్రస్తుత సమస్యకు ఇది ఒక ఉపశమనం మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం కాదు అని ప్రభుత్వాలు గుర్తించాలి.

ఇంటర్నెట్‌ ‌ద్వారా విద్య అభ్యసించడం అనేది.తరగతి గదిలో ఆర్జించే విద్యకు అనుబంధంగా ఉండాలి తప్ప ప్రత్యామ్నాయం కాకూడదు.దానినే ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చే ఆలోచనలు బలోపేతం చేస్తే సమాజంలో పైన పేర్కొన్న అంతరాలు మరింత బలోపేతం అయ్యే ప్రమాదం ఉంది.ఎందుచేతనంటే సాంకేతికత అనేది అభివృద్ధి కి పునాది దానిని అంది పుచ్చుకున్న ఎన్నో దేశాలు భాగ్యవంతంగా రూపుదిద్దుకున్నాయి..అయితే సాంకేతిక కలిగిన ఈ దేశాల్లో కూడా ఇది అందరికి అందుబాటులో లేదు.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే ఇది కొద్దిమంది కే కేంద్రీకృతం అయ్యింది..దాని ఫలితాలు ఆ కొద్దిమందే పొందుతున్నారు..ఇప్పుడు ఈ విపత్తులో ప్రత్యామ్నాయం అనుకున్న ఈ డిజిటల్‌ ‌బోధన కూడా అంతరాలను మరింత పెంచుతుంది. ఏది ఏమైనా విద్య మౌళిక లక్ష్యం అంతరాలు లేకుండా అందరికీ సమానంగా విద్యను అందించడమే. అదే నిజమైన విద్య. బోధనా అభ్యాస ప్రక్రియలో ఆన్లైన్‌ ‌విద్య ఒక ఆధునిక సహాయకారి మాత్రమే తప్ప ఇది శాశ్వత పరిష్కారం ఎప్పటికి కాదు.

సమాజంతో, ప్రకృతితో సజీవ సంబంధం, నిజమైన కౌశలాలు, ప్రేరణ, పిల్లల స్థాయికి తగ్గ బోధన, సమయపాలన, క్రమశిక్షణ, సమూహ స్ఫూర్తి , సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వంటివి తరగతి గది తప్ప ఆన్‌లైన్‌ ‌టెక్నాలజీ ఎప్పటికి అందించలేదు. ఈ క్లిష్ట సమయంలో విద్య ఎలా అందించాలి అనేది తాత్కాలిక సమస్య.అంతే కానీ ఆన్లైన్‌ ‌విద్యే తరగతి విద్యకు పూర్తి పరిష్కారంగా భావించకూడదు. అలా భావించిన నాడు అదే అసలైన సమస్య తయారవుతోంది..ఎందుకంటే రానున్న కాలంలో తరగతి గది విద్యకు చరమ గీతం పాడి అత్యంత తక్కువ వ్యయంతో ఆన్లైన్‌ ‌విద్య వైపు ప్రభుత్వాలు అడుగులు వేసే ప్రమాదం కూడా లేకపోలేదు.అదే పూర్తి పరిష్కారంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తే మాత్రం విద్య పూర్తిగా లాభాలే పరమావధిగా భావించే కార్పోరేట్‌ ‌శక్తుల చేతుల్లోనికి వెళ్లి పోవడం ఖాయం..ఇప్పటికే ఈ సాంకేతికతను అందుకోలేక చదువులకు దూరం అయిన వాళ్ళు ఎందరో..రాబోయే కాలంలో ఇది సమాజంలో మరింత విస్తృతి చెంది అసమానతల తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉంది.ప్రతి విపత్తులో కొత్త అవకాశాలు,ప్రత్యామ్నాయాలుంటాయి.

అయితే విద్యకు సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ఎంతైనా అవసరం ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు.కానీ తాత్కాలిక సమస్యకు ఇదే పరిష్కారం అనే దిశగా అడుగులు వేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు.ఈ పరిణామాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా ఆన్లైన్‌ ‌విద్యకు తేదీలు ప్రకటించి చేతులు దులుపు కోవడం ఎంత వరకు సమంజసం.ఏది ఏమైనా కరోనా మహమ్మారి మన వ్యవస్ధలో గల వ్యవస్దీకృత లోపాలను బట్ట బయలు చేసింది.వైద్య సదుపాయాల కొరత వలన ఎన్నో ప్రాణాలు గాలిలో కలసి పోయిన తరుణంలో మన దేశంలో వైద్య అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు మధ్య ఉన్న అంతరాన్ని కళ్ళ ముందు చూపింది.ఇటువంటి విపత్తులో అందరికీ విద్య అందించే విషయంలో సాంకేతికత అందించడంలో ఎంత వెనక్కు ఉన్నామో అనేది స్పష్టం చేసింది.సిలబస్‌ అయిపోయింది అనిపించుకుని పై తరగతులకు ప్రమోట్‌ ‌చేసుకుంటూ పోతున్న ఈ సాంకేతిక బోధనలో సృజనాత్మకత గల విద్యార్థులు లభిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.ఇది వ్యక్తిగతంగా పిల్లలే కాదు సమాజం మొత్తం నష్టపోతోంది.
– రుద్రరాజు శ్రీనివాసరాజు.., లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్.., ఐ.‌పోలవరం.., 9441239578.

Leave a Reply