- దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
- వెనక్కి తగ్గేదిలేదంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
- ఇయు దేశాలు అండగా నిలవాలని విజ్ఞప్తి
- రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిక
న్యూ దిల్లీ, మార్చి 2 : వరుసగా ఏడోరోజూ రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. చర్చలు ఫలించక పోవడంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. మొదటి విడత చర్చలు ముగిసిన తర్వాత కీవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుంది. దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో..క్రెయిన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న దృష్యా రష్యా అధ్యక్షడు పుతిన్ సైతం తమ కుటుంబాన్ని ఐలాండ్ లోని బంకర్‌కు తరలించారు. అయితే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. మొదటి విడత చర్చలు విఫలం అయిన నేపథ్యంలో రెండో దశ జరిగే చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ దేశాలన్నీ చర్చలు సఫలం కావాలంటూ కోరుతున్నాయి. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సంచలన ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదని స్పష్టం చేశారు.
రష్యాకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ పేర్కొన్నారు. కీవ్‌పై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రష్యన్ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయి. సుమారు 64 కిలోవి•టర్ల పొడవైన యుద్ధ ట్యాంకుల కాన్వాయ్ కీవ్‌లోకి ఎంటరైంది. కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మిస్సైల్స్, ఫిరంగులతో ఎటాక్స్ చేస్తున్నారు. తాజాగా 56 రాకెట్లు, 113 క్షిపణులను రష్యా ప్రయోగించింది. యూరోపియన్ యూనియన్‌లో చేరతామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దరఖాస్తు చేసిన ఒకరోజులోనే యూరోపియన్ యూనియన్ అత్యవసర పార్లమెంట్ సమావేశం నిర్వహించి సభ్యత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన జెలెన్స్కీ ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని కోరారు. రష్యా దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతు న్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈయూ సైతం రష్యా వి•డియాపై నిషేధం విధించింది. దీంతోపాటు ఈ యుధ్దంపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. 7, 8 వ తేదీలల్లో విచారణ చేయనుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైతం ప్రత్యేక సమావేశం నిర్వహించి యుద్దాన్ని ఆపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పేర్కొంది.
రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తాం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు పుతిన్ భారీ మూల్యం చెల్లించు కోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్‌లో వార్షిక ప్రసంగం చేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి క్యాపిటల్ హిల్‌లో బైడెన్ ప్రసంగించారు. పుతిన్ పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను ప్రకటించడం ద్వారా తప్పుగా అంచనా వేశారని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వొస్తుందని అన్నారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. ఈ ఆదేశాల్లో స్వేచ్ఛా ప్రపంచపు పునాదులను కదిలించేందుకు యత్నించా రని అరోపించారు. నియంతలు దూకుడుగా వ్యవహరించినందుకు మూల్యం చెల్లించిన విషయాలను చరిత్రలో చూశామని, వారు మరింత గందరగోళానికి గురవుతారని అన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతిస్తామని పునరుద్ఘాటించారు.