Take a fresh look at your lifestyle.

రెండు స్థానాల్లోనూ కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ఆధిక్యం

  • నాలుగో రౌండ్‌లో పల్లా, మూడో రౌండ్‌లో వాణిదేవి ముందంజ
  • రెండో ప్రాధాన్యత వోట్ల లెక్కింపు పూర్తయ్యాకే తేలనున్న ఫలితం

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల వోట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతోంది.. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నాలుగో రౌండ్‌ ‌వోట్ల లెక్కింపు ముగిసే సమయానికి సమీప ప్రత్యర్థి తీన్మార్‌ ‌మల్లన్నపై 15,438 వోట్ల ఆధిక్యంలో ఉన్నారు.మొత్తం నాలుగు రౌండ్లలో పల్లాకు 63,442, తీన్మార్‌ ‌మల్లన్నకు 48,004, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌కు 39,615, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 23,703, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 15,935 వోట్లు పోలయ్యాయి.

నాలుగో రౌండ్‌లో పల్లాకు మొత్తం 17,710, తీన్మార్‌ ‌మల్లన్నకు 13,500, ప్రొ.కోదండరామ్‌కు 11,917 వోట్లు పోలయ్యాయి. దీంతో నాలుగో రౌండ్‌లో పల్లాకు 3,600 వోట్ల ఆధిక్యం లభించింది. ఇక రంగారెడ్డి- హైదరాబాద్‌- ‌మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్‌ ‌కొనసాగుతుంది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి మూడో రౌండ్‌ ‌పూర్తయ్యే సరికి సమీప అభ్యర్థి రాంచందర్‌రావుపై 2613 వోట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణి దేవికి 13,395 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 12,223 ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 17732 వోట్లు, రాంచందర్‌రావుకు 16,173 వోట్లు సాధించారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం కొనసాగుతున్న వోట్ల లెక్కింపులో రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ రెండో ప్రాధాన్యత వోట్ల లెక్కింపు పూర్తయిన తరువాతనే విజేతలు ఎవరన్నది తేలనుంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత వోట్ల లెక్కింపు కొనసాగుతుండగా, గురువారం తెల్లవారుజాము వరకు ఈ పక్రియ కొనసాగనుంది. దాని తరువాత రెండో ప్రాధాన్యత వోట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. వొకవేళ మొదటి ప్రాధాన్యం వోట్లు తక్కువ పొందిన అభ్యర్థి• రెండో ప్రాధాన్యత వోట్లు ఎక్కువగా సాధించిన పక్షంలో ఈ రెండింటిలో ఎక్కువ వోట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండో ప్రాధాన్యత వోట్ల లెక్కింపు పక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు శనివారం సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply