Take a fresh look at your lifestyle.

పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన

  • పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టు..అంగీకరించని ప్రభుత్వం
  • విపక్షాల మద్దతుతో లోక్‌ ‌సభలో ఓబిసి బిల్లుపై చర్చ
  • రాజ్యసభలో గందరగోళం..విపక్షాల నినాదాల మధ్య సభ నేటికి వాయిదా
  • ఎన్‌ఆర్‌సిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం

పార్లమెంట్‌ ఉభయ సభల్లో పెగాసస్‌ ‌దుమారం కొనసాగుతున్నది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టువీడం లేదు. అయితే చర్చకు ప్రభుత్వం కూడా అంగీకరించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఉభయసభలు తొలుత మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్‌పై చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారం కొలువుదీరాయి. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగిన ఓబీసీ సవరణ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబమమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఓబీసీ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని 15 విపక్ష పార్టీల నిర్ణయం తీసుకున్నాయి. రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్‌ ‌విప్‌ ‌జారీ చేసింది. రాజ్యసభకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం దక్కనుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. అయితే ఆ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు పాస్‌ ‌కావడం అనివార్యమే అవుతుంది. లోక్‌ ‌సభ ఓబిసి బిల్లుపై చర్చ అనంతరం నేటికి వాయిదా పడగా, రాజ్యసభ గందరగోళం మధ్య నేటికి వాయిదా పడ్డది.

ఎన్‌ఆర్‌సిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం
దేశవ్యాప్తంగా నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌సిటిజెన్స్ ‌సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబంధనలు రూపొందించడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరినట్లు గత నెల పార్లమెంట్‌కు హోంశాఖ చెప్పింది. వొచ్చే ఏడాది జనవరి 9 వరకూ దీనికి సమయం ఉంది. ఇక మరోవైపు దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడున్నట్లు వొస్తున్న రిపోర్టుల గురించి కూడా హోంశాఖ లోక్‌సభకు వివరించింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్టాల్రకు కేంద్రం సూచనలు జారీ చేసింది. దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్లను గుర్తించడం, వాళ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం, వాళ్లు బయోగ్రఫిక్‌, ‌బయోమెట్రిక్‌ ‌వివరాలను సేకరించడం, వాళ్ల దగ్గర ఉన్న నకిలీ భారత ధృవపత్రాలను రద్దు చేయడం, వాళ్లను దేశం నుంచి పంపించేయడంపై సూచనలు చేసినట్లు హోంశాఖ తెలిపింది. అక్రమ వలసదారుల బయోగ్రఫిక్‌, ‌బయోమెట్రిక్‌ ‌వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు, వాళ్లను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలిసారి హోంశాఖ వెల్లడించింది.

Leave a Reply