Take a fresh look at your lifestyle.

ఎపిలో కొనసాగుతున్న వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద
అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ ‌నివాస్‌
‌తమ్మిలేరు పెరిగిన వరద ఉధృతి
ధవళేశ్వరం వద్ద స్వల్పంగా పెరిగిన వరద
విజయవాడ,జూలై23: ఇటీవలి వర్షాలకు తోడు ఎగువనుంచి వస్తున్న వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో గల పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్టలేరు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతిపై ప్రకాశం బ్యారేజి ఎగువ ప్రాంతాల అధికారులను కలెక్టర్‌ ‌జె నివాస్‌ అ‌ప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి 40 గేట్ల ద్వారా రెండు అడుగుల మేర ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నందిగామ మండలం నుంచి వీరులపాడు మండలానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద వరద నీరు 12 అడుగులు చేరుకుంది. పోలంపల్లి ఆనకట్టపై 50వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి కాజ్వేపై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గడిచిన 48 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 60 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు వరద నీరు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.

జిల్లాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురవడం తో నగరాలు, గ్రామాలు జలమయమవుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. అసలే అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు మరింత అధ్వానంగా మారాయి. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన కరుస్తున్న భారీ వర్షాలకు వత్సవాయి మండలం లింగాల గ్రామం కాజ్వేపైన వరద ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్రా నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు అంతరాయం కలగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదిలావుంటే ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలియచేసింది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పంటపొలాలు నీట మునిగాయి. అమలాపురం డివిజన్‌లో వరి సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 438 హెక్టార్లలో నారుమళ్లు, 202 హెక్లార్లలో వరినాట్లు మునిగిపోయాయి. రామచంద్రపురం, కాకినాడ డివిజన్లలోనూ పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని 31 మండలాల్లో 6,986 హెక్టార్లలో పంటపొలాలు నీట మునిగాయి. ముంపునకు గురైన పొలాల్లో 1,475 హెక్టార్లలో నారుమళ్లు, 5,511 హెక్టార్లలో వరి నాట్లు ఉన్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో తమ్మిలేరుకు వరద ఉధృతి అధికంగా ఉంది. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్‌ ‌నీటి మట్టం 346 అడుగులకు చేరింది. ఇన్‌ ఎ•-‌లో 6574 క్యూసెక్కులు, అవుట్‌ ఎ•-‌లో నిల్‌గా ఉంది. రిజర్వాయర్‌ ‌పూర్తి స్థాయి సామార్థ్యం 355 అడుగులుగా కొనసాగుతోంది. దవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 8.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు. దాదాపులక్షా 10 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు రెండు వేల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు కాపర్‌ ‌డ్యామ్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌కారణంగా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ముంపులోనే ఉండిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో వరి నాట్లు, కూరగాయల పంటలు నీటమునిగాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Leave a Reply