Take a fresh look at your lifestyle.

సోమశిలకు కొనసాగుతున్న వరద

నెల్లూరు,సెప్టెంబర్‌ 28: ‌సోమశిల జలా శయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. 74 టీఎంసీల నీటి నిల్వతో సోమశిల నిండుకుండలా మారింది. దాదాపు లక్షా 20 వేల క్యూసెక్కుల ఇన్‌ ‌ప్లో, లక్షా 20 వేల క్యూసెక్కుల అవుట్‌ ‌ప్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్ల నుంచి పెన్నా నది ద్వారా సముద్రానికి నీటిని విడుదల చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, గ్రామ వలంటీర్లను  తహసీల్దారు షఫీమాలిక్‌ ‌హెచ్చరించారు.  సోమశిల జలాశయం నుంచి దిగువ పెన్నానదికి వరద ప్రవాహం వస్తుందని చెప్పారు. జొన్నవాడ, శ్రీరంగరాజపురం, దామరమడుగు గ్రామాల లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

ఇదిలావుంటే పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చి సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇన్‌ప్లో గంట గంటకూ హెచ్చుతగ్గులు ఉండటంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన రేగుతోంది. ఈ పరిస్థితుల్లో జలాశయం దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జలాశయ భద్రతా దృష్ట్యా నిల్వ సామర్థ్యం 75 టీఎంసీలకు కుదించారు. సోమశిల నుంచి భారీగా నీరు దిగువకు విడుదల  చేయడంతో జలాశయం ముందు ప్రొటెక్షన్‌ ‌వాల్‌కు సపంలో ఎడమ వైపు నిర్మించి ఉన్న పొర్లుకట్ట రివిట్‌మెంట్‌ ‌సుమారు 150 టర్లు కోతకు గురైంది. జలాశయం నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే ఈ ప్రాంతంలో కట్టకు ప్రమాదం తప్పదు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన వర్షాలకు కుందూ, పాపాగ్ని, సగిలేరు, చిత్రావతి నదుల నుంచి వస్తున వరద పెన్నాలో కలవడంతో సోమశిలకు భారీగా వరద వస్తోంది. సోమశిల నుంచి నెల్లూరు వరకు పెన్నాతీరం వెంబడి చాలా గ్రామాల్లో పొర్లు కట్టలు ధ్వంసం చేసి కొందరు పొలాలుగా మార్చారు. దీంతో దిగువ పరివాహక ప్రాంతాలలోని గ్రామాలకు ముప్పు పొంచి వుంది. వరద భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply