Take a fresh look at your lifestyle.

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తగ్గని వరద కొనసాగుతున్న వరద..

  • నిండుకుండల్లా జలాశయాలు
  • వృథాగా సముద్రంలోకి గోదావరి నీరు…
  • బాబ్లీ గేట్ల మూసివేతపై ఆలోచన

పరీవాహక ప్రాంతంలో కుండపోత వర్షంతో కృష్ణమ్మ మహొ గ్ర రూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 63 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు దిగువన పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న 4.35 లక్షల క్యూసెక్కులకు సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 77 వేల క్యూసెక్కుల తుంగభద్ర నదీ జలాలు కలుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,10,750 క్యూసెక్కులు చేరుతోంది. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం, 884 అడుగుల నీటి నిల్వ ఉండటంతో.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తేసి, కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌లోకి శ్రీశైలం నుంచి నీరు విడుదల కావడంతో 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ‌నుంచి విడుదల చేస్తున్న జలాలకు మూసీ వరద తోడవ్వడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగు తోంది. పులిచింతల ప్రాజెక్టులో 15 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వదులుతున్న జలాలకు వైరా, మున్నేరు, కట్టలేరు, కొండవాగుల నుంచి వస్తున్న వరద తోడవ్వడంతో ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. బ్యారేజీలోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

సింగూరులో కొనసాగుతున్న ప్రవాహం
భారీ వర్షాల కారణంగా సింగూర్‌ ‌ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. సింగూర్‌ ‌ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 23.456 టీఎంసీలుగా ఉంది. అలాగే ప్రాజెక్టు నీటి ఇన్‌ ‌ఫ్లో 8140 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. మిషన్‌ ‌భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతీ రోజు 60 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి ఆవిరి, లికేజ్‌ ‌ద్వారా 60 క్యూసెక్కులు విడుదలవుతోంది. సింగూర్‌ ‌ప్రాజెక్టులో మొత్తం నీటి ఔట్‌ ‌ప్లో 120 క్యూసెక్కులుగా నమోదయ్యింది. సింగూర్‌ ‌ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది. కరీంనగర్‌ ‌జిల్లాలోని లోయర్‌ ‌మానేరు డ్యామ్‌లోకి ఇన్‌ప్లో కొనసాగుతోంది. దాదాపు 30 వేల క్యూసెక్కుల వరద నీటితో జలాశయం నిండుకుండలా మారింది. 24 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న లోయర్‌ ‌మానేర్‌ ‌డ్యామ్‌లో ప్రస్తుతం 23.732 టీఎంసీల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు 15 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

వృథాగా సముద్రంలోకి గోదావరి నీరు….బాబ్లీ గేట్ల మూసివేతపై ఆలోచన
గోదావరిలో వరద నీటి వృథాను అరికట్టేంందుకు బాబ్లీ గేట్లను ముందే మూసేసే ప్రతిపాదనపై అధికారుల స్థాయిలో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. సముద్రంలోకి వృథాగా నీరు పోయే బదులు అరికట్టేందుకు చర్చిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ ‌గేట్లను గడువు కన్నా ముందే దించడం ద్వారా వృథాను అరికట్టవచ్చని మహారాష్ట్ర సర్కారు సూచిస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారని సమాచారం. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉన్పప్పటికీ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. సుప్రీమ్‌కోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్‌ 28 ‌వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్‌ 29‌న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది.

ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ ‌మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది. దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ‌నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్‌లు, చెక్‌డ్యామ్‌లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్‌ ‌వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్‌ ‌ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్‌ ‌వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్‌లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్‌ ‌శాఖలో అంతర్గత చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply