Take a fresh look at your lifestyle.

వర్షాలు తగ్గినా.. పలు ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

  • జూరాల, శ్రీశైలంలకు చేరుతున్న వరదనీరు
  • మేడిగడ్డ నుంచి దిగువకు నీటి విడుదల
  • పులిచింతల వద్ద కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

శ్రీరాంసాగర్‌ ‌నుంచి నీటి విడుదల..ఆయకట్టు రైతుల డిమాండ్‌తో ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. ఉధృతి తగ్గినా నీటి రాకతో జలాశయాలకు వరద చేరుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద వొస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.35లక్షల క్యూసెక్కుల ప్రవాహం వొస్తుంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వొస్తుండగా..వొచ్చిన నీటిని వొచ్చినట్టే అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి 3,16,708 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గరిష్ఠ నీటిమట్టం 9.657 టీఎంసీలకు గాను..ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకూ వరద కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వొచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం 3,22,262 క్యూసెక్కుల భారీ వరద వొస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 874.40 అడుగుల మేర నీరుంది. డ్యామ్‌ ‌గరిష్ఠ నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. 160.910 టీఎంసీల నిల్వ ఉన్నది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే డ్యామ్‌ ‌నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా..నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు 18,142 క్యూసెక్కుల ప్రవాహం వొస్తున్నది.

డ్యామ్‌ ‌నుంచి 3,988 క్యూసెక్కులు ఔట్‌ ‌ఫ్లో ఉన్నది. సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 539.10 అడుగులు మేర నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 186.4567 టీఎంసీల నీరు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ ‌మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. అధికారులు 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ ‌ఫ్లో, ఔట్‌ ‌ఫ్లో 3,03,900 క్యూసెక్కులుండగా బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 1.768 టీఎంసీలుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతి) బ్యారేజీ వద్ద అధికారులు 62 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ‌ఫ్లో 35,000 క్యూసెక్కులుండగా..అవుట్‌ ‌ఫ్లో 20,000 క్యూసెక్కులుంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 0.88 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. పులిచింతల ఇన్‌ ‌ప్లో 7,217 క్యూసెక్కులు, ఔట్‌ ‌ఫ్లో 10,800 క్యూసెక్కులు. పులిచింతల పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 173.63 అడుగులకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు, ప్రస్తుతం 43.74 టీఎంసీలకు చేరుకుంది. నాలుగు యూనిట్లలో 60.21 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. విద్యుదుత్పత్తి కోసం 10,200 క్కూసెక్కుల నీటిని విడుదల చేశారు.

శ్రీరాంసాగర్‌ ‌నుంచి నీటి విడుదల..ఆయకట్టు రైతుల డిమాండ్‌తో ప్రభుత్వం నిర్ణయం
శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను విడుదల చేయాలన్న ఆయకట్టు రైతుల కోర్కెను మంత్రులు, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ ‌దృష్టికి తెచ్చారు. సీఎం వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. దీంతో మంగళవారం ఉదయం శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కుల నీళ్లను వదిలారు. దీని వల్ల నిజామాబాద్‌ ‌జిల్లాలోని కొంత భాగం, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్‌,‌పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, మంథని తదితర నియోజకవర్గాలలోని పంట పొలాలకు సమృద్ధిగా నీళ్లందుతాయి. ఈ ఆయకట్టు కింది రైతులు వరి నాట్ల పనులను మరింత ముమ్మరం చేస్తారు. సకాలంలో నీళ్లను విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply