Take a fresh look at your lifestyle.

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద శ్రీశైలం, సాగర్‌లకు జలకళ

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వొచ్చి ప్రాజెక్టుల్లో చేరుతుంది. దీంతో శ్రీశైలం, సాగర్‌లు జలకళను సంతరించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల జలాశయానికి 4.77 లక్షల క్యూసెక్కుల వరద వొస్తుంది. దీంతో అధికారులు 47 గేట్లను ఎత్తి దిగువకు 4,73,674 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 6.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి 5,59,057, క్యూసెక్కుల వరద వొస్తుంది. ప్రాజెక్టు నుంచి ఔట్‌ ‌ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉన్నది. పది క్రస్ట్ ‌గేట్లను 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.50 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207.4103 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమగట్టుల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు 4,54,931 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా.. ఔట్‌ ‌ఫ్లో 35,820 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం సాగర్‌లో 567.20 అడుగుల నీరుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 249.54 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లోనే డ్యామ్‌ ‌నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply