Take a fresh look at your lifestyle.

పార్లమెంటులో కొనసాగుతున్న గందరగోళం

విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా

న్యూ దిల్లీ, డిసెబర్‌ 17 : ‌పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, లఖింపూర్‌ ‌ఖేరి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాన నిందితుడు అశీష్‌ ‌మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్‌ ‌మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. లోక్‌సభలో సభ్యులు స్పీకర్‌ ‌పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. స్పీకర్‌ ఎం‌త నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. దాంతో సభను మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. ఛైర్మన్‌ ‌వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.

ఛైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు వెనక్కి వెళ్లాలని సూచించినా వాళ్లు లెక్కచేయలేదు. దాంతో ప్రభుత్వం, విపక్షాలు సమస్యపై సభ వెలుపల మాట్లాడుకుని ఒక పరిష్కారానికి రావాలని ఆయన సూచించారు. అందుకోసం సమయం ఇస్తూ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో లోక్‌సభ దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ ‌చేశారు. స్పీకర్‌ ‌తమ నినాదాలను లెక్కచేయకుండా సభా కార్యకలాపాలను కొనసాగించడంతో..ఆందోళన చేస్తున్న ఎంపీలు స్పీకర్‌ ‌పోడియాన్ని చుట్టుముట్టారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. దాంతో స్పీకర్‌ ఓం ‌బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. మళ్లీ విపక్ష ఎంపీలు స్పీకర్‌ ‌పోడియాన్ని చుట్టుముట్టి తమ ఆందోళన కొనసాగించారు. ఆందోళన చేస్తున్న సభ్యులు వెనక్కి వెళ్లి వారివారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ ఎం‌త చెప్పినా విపక్షాలు లెక్కచేయలేదు. దాంతో సభాపతి సభను సోమవారానికి వాయిదా వేశారు.

Leave a Reply