Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన

  • మంత్రి ప్రకటించినా తరగతులకు హాజరు కాని విద్యార్థులు
  • మంత్రి తమను ఏనాడు పట్టించుకోలేదని విమర్శ
  • సిఎం నుంచి ప్రకటన వొచ్చేవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం

నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరవుతారని ప్రకటించినా విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి  ఆశించిన స్పందన లేదన్న విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన వొచ్చేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పటికి సిఎం నుంచి స్పందన లేకపోతే రాత్రి పూట కూడా శాంతియుతంగా తమ నిరసన కొనసాగిస్తామని ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్‌ ఐటిలో  విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ల  పరిష్కారం కోసం సర్కార్‌ ‌కసరత్తు ప్రారంభించింది.

వీసీ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ ‌కవి•టీ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థులకు వెంటనే యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో భేటి తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. దీంతో గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో నడుస్తున్న వివాదానికి త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఈ వివాదానికి చెక్‌ ‌పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం కసరత్తు ప్రారంభించింది. ఇదిలావుంటే జిల్లా మంత్రిఇంద్రకరణ్‌ ‌రెడ్డి ఏనాడూ సమస్యలు పట్టించుకోలేదని విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏనాడూ సంస్థకు రాలేదని, విద్యార్థులతో సమస్యలపై చర్చించలేదని వారు అంటున్నారు.

Leave a Reply