Take a fresh look at your lifestyle.

ఒకరి నిష్క్రమణ ..మరొకరి ఆవిష్కరణ ..!

విశ్లేషకులు ఊహించినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  దశల వారీగా కనుమరుగవుతుంది. బుధవారం ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్‌ ‌రావు ..తెలుగు దేశం పార్టీ తరఫున సత్తుపల్లి నియోజక వర్గం నుంచి గెలిచి  తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి తమ పార్టీ శాసన సభా పక్షాన్ని   తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీఎకర్‌కు లేఖ ఇవ్వడం…వెంటనే అధికారిక బులెటిన్‌ ‌విడుదల కావడం జరిగి పోయింది. ‘తెలుగు ఆత్మ గౌరవం’ నినాదంతో 1982లో ప్రముఖ తెలుగు సినిమా నటుడు ఎన్‌టీ రామా రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక చరిత్రగా మిగిలిపోనుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ సమైక్య రాష్ట్రంలో దాదాపు 16 సంవత్సరాలు అధికారంలో ఉంది. అందులో సగం ..దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాలు నారా చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ ప్రారంభం నుంచి బలహీన వర్గాలకు ప్రాధాన్యత నిచ్చి..రాజకీయంగా వారి ఎదుగుదలకు దోహదపడింది. గ్రామ స్థాయి నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో..పటిష్టమయిన నాయకత్వం కలిగిన ఆ పార్టీ ఈ రోజు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. పార్టీ నాయకత్వం తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి సమీక్షించుకునే అవకాశం కూడా లేకుండా రాజకీయాలు అతి వేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలను, ఎత్తుగడలను ప్రతిపక్షాలు అందుకోలేక పోతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పతనానికి తెలంగాణ రాష్ట్ర సమితిని కారణంగా చూపించాల్సిన అవసరం లేదు. తెలుగు దేశం పతనానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు పక్కా సమైక్యవాది అనడం కంటే ..తెలంగాణ బద్ద వ్యతిరేకి అనడం సమంజసం..! వెన్నుపోటు రాజకీయాలతో ముఖ్యమంత్రి పదవి పొందాడన్న ఆరోపణలున్న చంద్రబాబు నాయుడు…తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసెంబ్లీలో  తెలంగాణ  పదం వినిపించకూడదని హుకుం జారీ చేసిన పక్కా తెలంగాణ వ్యతిరేకి ..! 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావొద్దని ..ఒక లేఖతో తెలంగాణకు అనుకూలమని ..టీఆర్‌ఎస్‌తో కూటమిగా ఏర్పడి చతికిల బడ్డాడు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చి ..2009లో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడగానే..వ్యతిరేకంగా దిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబును..ఆయన పార్టీని తెలంగాణ ప్రజలు 2018 ఎన్నికల్లో కూడా తిరస్కరించారు. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు అంచనా వేయలేకపోయారు. తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు కుట్రలు కొనసాగాయి. ‘వోటుకు నోటు’ కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు బలవంతంగా తన స్థావరాన్ని విజయవాడకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను అర్ధాంతరంగా వొదిలి పెట్టి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రకు తరలి పోవడంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంలో  పడింది. ఆంద్ర ప్రదేశ్‌లో కూడా అధికారం కోల్పోయిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధాంత రాజకీయాలకు ఆమడ దూరం అన్న అభిప్రాయం సర్వత్రా ఉన్నది.

40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు దేశం తెలంగాణ ప్రాంతం నుంచి కనుమరుగవుతున్న సమయంలో…40 రోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తె షర్మిల ఈ రోజు ఖమ్మంలో జరగ బోయే బహిరంగ సభలో  పార్టీ పేరు..కార్యక్రమాలు ప్రకటించనున్నారు. షర్మిల స్థానికురాలు కాదు..ప్రాంతేతరురాలు అన్న అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో..సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కోడలును..రాజన్న రాజ్యం కోసం తనను ఆశీర్వదించమని ప్రజల ముందుకు రానున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు.. డా.వై ఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి సమకాలికులే  కాదు. .రాష్ట్ర విభజకు  ఇద్దరూ వ్యతిరేకం ..! రాష్ట్ర విభజను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగు దేశం శకం ఇక తెలంగాణలో ముగిసినట్లే..మరి షర్మిలను ఈ ప్రాంతం ప్రజలు ఆదరిస్తారా. కారణం ..గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రతి ఎన్నికల ఫలితాలు తెలంగాణా వాదం ఎంత బలంగా ఉందో నిరూపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయమున్నది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కుమార్తెగా తెలంగాణ ప్రజలు ఆమెను తిరస్కరిస్తారా…లేక తెలంగాణా కోడలు అని ఆదరిస్తారా..కాలం నిర్ణయిస్తుంది ..!

Leave a Reply