Take a fresh look at your lifestyle.

ఏడాది ప్రయాణం

“వ్యక్తిగతంగా కలవటానికి మంత్రులకే అవకాశం ఉండదన్న ప్రచార నేపథ్యంలో ..  మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో  ప్రకటించిన నవ రత్నాలను ఆచరణలో పెట్టడానికి వై ఎస్‌ ‌జగన్‌ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటం నాయకుడి ప్రధాన బాధ్యత. ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది అనే దాట వేత ధోరణిని ఎక్కడా ప్రదర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా సంక్షోభంలో మునిగి ఉన్న సమయంలో కూడా ఇచ్చిన హామీల మేరకు ఎక్కడా సంక్షేమానికి కోత పెట్టకపోవటం ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనంగా భావించవచ్చు. నవరత్నాల అమలుకు జగన్‌ ఏకంగా క్యాలెండర్‌నే విడుదల చేశారు.. 

మాట తప్పను, మడమ తిప్పను అంటూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్‌ ‌జగన్మోహన రెడ్డి … ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర పగ్గాలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించక ముందు…ఆయన కొనసాగించిన ప్రయాణం కూడా రాజకీయ క్షేత్రంలో స్ఫూర్తి దాయకమైందే. దివంగత నేత వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకుని…ఆయన మరణానంతరం తండ్రి వదిలి వెళ్లిన నీడలో తనదైన వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఏర్పరుచుకుంటూ దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ప్రయాణం చేశారు. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు ఒక వైపు, తాను ఒక వైపు నిలబడాల్సి వచ్చినా ధైర్యంగానే ముందుకు వెళ్లారు. గత ఏడాది విజయానికి ముందు ఉన్న సంక్షిప్త నేపథ్యం ఇది. 2019 లో హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. జగన్‌ ‌నేతృత్వంలో 175 స్థానాలకు గాను ఏకంగా 151 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. 50 శాతానికిపైగా ఓట్లు, 86 శాతం సీట్లుతో వైస్సార్సీపీకి ప్రజలు భారీ మద్దతు పలికారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రభుత్వం ఎంత వరకు నిలబెట్టుకుంది? చేసిన తప్పులేంటి? సరిదిద్దుకోవాల్సిన అంశాలేమిటి? మరింత మెరుగైన పాలనకు ఇంకా ఏం చేయాలి ? అనే చర్చ ఇప్పుడు అవసరం.

సంక్షేమానికి సింహ భాగం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదే ఆయనను ప్రజల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఆయన తనయుడిగా జగన్‌ ‌కూడా అదే దారిని ఎంచుకున్నారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఆయన ప్రకటించిన నవ రత్నాలను ఆచరణలో పెట్టడానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటం నాయకుడి ప్రధాన బాధ్యత. ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది అనే దాట వేత ధోరణిని ఎక్కడా ప్రదర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా సంక్షోభంలో మునిగి ఉన్న సమయంలో కూడా ఇచ్చిన హామీల మేరకు ఎక్కడా సంక్షేమానికి కోత పెట్టకపోవటం ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనంగా భావించవచ్చు. నవరత్నాల అమలుకు జగన్‌ ఏకంగా క్యాలెండర్‌నే విడుదల చేశారు. వైయస్సార్‌ ‌రైతు భరోసా, అమ్మఒడి, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు లాంటివే కాకుండా వివిధ వర్గాల ఆర్ధిక స్థితి మెరుగు పడేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఆశావర్కర్లు, అంగన్‌ ‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల వంటి అనేక మంది జీతాలను పెద్ద ఎత్తున పెంచారు. ఈ చర్య వల్ల పాలనా యంత్రాంగంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.

ప్రతి వ్యక్తికి కనీస ఆదాయం ఉండాలని ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్ర వేత్త, నోబెల్‌ ‌పురస్కార గ్రహీత అభిజిత్‌ ‌బెనర్జీ చేసిన సూచన కూడా ఇదే కదా. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆర్ధికవేత్తలందరూ ముక్త కంఠంతో ఇదే చెబుతున్నారు. కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన సమాజంలో ఆర్ధిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఈ సూచన చేయటం వెనుక బలమైన అర్థశాస్త్ర లెక్కలున్నాయి. ప్రజల చేతిలో డబ్బుంటే వారి వినియోగ వ్యయం పెరుగుతుంది. పొదుపు చేసే శక్తి వస్తుంది. వస్తువులు, సేవలకు డిమాండ్‌ ఉం‌టే సప్లయ్‌కి, ఉత్పత్తికి మార్గం ఏర్పడుతుంది. ఉత్పత్తి జరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదంతా ఒక సైకిల్‌ ‌చైన్‌ ‌లాంటిది. పలు పథకాల అమలు రూపంలో ఏపీ సీఎమ్‌ ‌జగన్మోహన రెడ్డి గత ఏడాది కాలం నుంచి ఇదే చేస్తున్నారు.

అభివృద్ధి సంగతేమిటి?
రాష్ట్రానికి అయినా, దేశానికి అయినా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులు లాంటివి. సంక్షేమం తాత్కాలిక ఊరట అయితే అభివృద్ధి శాశ్వతం. జ్వరం వచ్చిన రోగికి వెంటనే మందు బిళ్లలో, ఇంజెక్షనో ఇచ్చి జ్వరం తగ్గేటట్లు చూస్తారు. కాస్త తీవ్రత ఎక్కువగా ఉంటే సెలైన్‌ ‌బాటిల్‌ ‌కూడా ఎక్కిస్తారు. జ్వరం తగ్గిన తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు పాలు, పండ్లు వంటి పౌష్టికాహారం తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇవన్నీ ఉపసమన చర్యలు. జ్వరం వచ్చినప్పుడు ఇచ్చారు కదా అని రోజూ సెలైన్‌ ‌బాటిల్‌ ఎక్కించుకుంటామా? అదే సమయంలో ఆరోగ్యం కుదుటపడిన తర్వాత దృష్టి సారించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. రోజూ వ్యాయామాలు లాంటివి చేయటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత విశ్రాంతి…ఇవన్నీ దీర్ఘకాలం చేస్తే అనారోగ్యం అంత తొందరగా దరికి చేరదు. ఇది అభివృద్ధి ప్రక్రియ.

మనలాంటి ఆర్ధిక వ్యవస్థల్లో సంక్షేమ చర్యలు, పథకాలు అవసరమే అయినా…అవి మాత్రమే సరిపోవు అన్నది స్పష్టం. వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రభుత్వం అభివృద్ధి పై తగినంత దృష్టి సారించలేదనే చెప్పాలి. రీ టెండరింగ్‌, ‌రాజధాని మార్పు వంటి నిర్ణయాల వల్ల పెట్టుబడి దారులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఉన్న పనులు కూడా ఆగిపోవటంతో ఆ యా వర్గాల్లో అభద్రత నెలకొని ఉంది. కరోనా లాక్‌డౌన్‌ ‌వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఊతం ఇచ్చే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆహ్వానించగినవి. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉపాధికల్పనకు పట్టుకొమ్మలు. మొదటి ఏడాది సంక్షేమం పైనే దృష్టి పెట్టారు కనుక రెండో ఏడాది అభివృద్ధికి ఊతం ఇచ్చే చర్యలు మరింతగా తీసుకుంటారేమో చూడాలి. ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు కూడా చెప్పుకునే స్థాయిలో రాకపోవటం హర్షణీయమే.కేంద్రంతోనూ, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణాతోనూ సంబంధాలు ఈ ఏడాది కాలంలో సహృద్భావ వాతావరణంలోనే సాగాయి. ముందు ముందు కూడా ఇలానే ఉండటం రాష్ట్ర ప్రయోజనాల రీత్య అవసరం.

వివాదాలు-కక్షసాధింపులు:
ముందు నుంచి ఏపీ రాజకీయాలు రెండు వర్గాల మధ్య విద్వేషాలు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. కులాల ప్రాబల్యం ఎక్కువ కావటం వల్ల పాలనలోనూ దీని ప్రభావం కనిపిస్తుంది. తెర ముందు జరిగే నిర్ణయాలకు, తెర వెనుక ఎత్తుగడలకు మధ్య లోతైన సంబంధం ఉంటుంది. దీనిలో కొంత మేరకు మీడియా వాటా కూడా ఉంటుందన్నది వాస్తవం. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రాజకీయ వివాదాలకు కోదవ లేకుండా పోయింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని తరలింపు, శాసనమండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌మార్పు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ‌మాధ్యమంలో బోధన, టీటీడీ ఆస్తుల వేలం వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇంగ్లీష్‌ ‌మాధ్యమంలో బోధన వివాదాస్పదం, చర్చనీయాంశం అయినప్పటికీ ప్రజల్లో మద్దతు లభించింది. అందుకే విపక్షాలు కూడా వేగం తగ్గించాయి. టీటీడీ ఆస్తుల విషయంలో విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ప్రభుత్వమే వెనకడుగు వేయటంతో వివాదానికి తెర పడినట్లే.

కోర్టులు-పంచాయతీలు:
ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయినా కొన్ని సందర్భాల్లో కోర్టులు తప్పుపట్టడం, సరి దిద్దుకునేటట్లు చేయటం చూస్తూనే ఉంటాం. అదే సమయంలో కొన్ని విషయల్లో ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేస్తుంటాయి. తాజాగా చెప్పుకుంటే వలస కార్మికుల విషయంలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత ధర్మాసనమే తేల్చి చెప్పింది. లాక్‌డౌన్‌ ‌వల్ల ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ళకు వెళుతూ రైలు పట్టాల పై నిద్రిస్తున్న 20 మంది వలస కార్మికుల పైనుంచి రైలు వెళ్లిన దుర్ఘటన నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యానించింది. పట్టాల పై కార్మికులు నడిచి వెళుతుంటే ఏ రకంగా ప్రభుత్వాలు అడ్డుకోగలుగుతాయని ప్రశ్నించింది. అయితే ఏపీ దగ్గరకు వస్తే ఈ ఏడాది కాలం నుంచి ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య సయోధ్య వాతావరణం లేదనే చెప్పాలి. పరిపాలన అంశాల్లో న్యాయస్థానం చాలా క్రియాశీలకంగా ఉండటమూ ఏపీలో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయటం కొత్త కాదు. తప్పా, ఒప్పా అనే సంగతి పక్కన పెడితే గతంలో కాంగ్రెస్‌, ‌మొన్నటి వరకు టీడీపీ, ఇటు తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు కూడా ఇలానే చేశాయి. ఇక ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేయాలన్న నిర్ణయాన్ని కూడా కోర్టులే నిర్దేశిస్తూ ఉండటం శాసన, న్యాయ వ్యవస్థల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌కు దారి తీస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు పరిపాలనా స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆ క్రమంలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం న్యాయస్థానాల భరోసా ప్రజలకు ఉండాలి. న్యాయ స్థానాల హూందాతనం దెబ్బతినంకుండా ఉండటమూ అవసరమే అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా మెలుకువతో వ్యవహరించటమూ ముఖ్యమే.

అనుసంధానం ఏది?
డాక్టర్‌ను కలిసి మాట్లాడగానే సగం రోగం తగ్గిపోతుందంటారు. రాజకీయాల్లోనూ అంతే. ఏ నాయకుడు అయినా తమ అధినేతతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటాడు. సమస్య పరిష్కారం అయినా కాకపోయినా…అధినేత దృష్టికి తీసుకువెళ్లాం అన్న భరోసా ఏర్పడుతుంది. మరి ముఖ్యమంత్రిగా వైఎస్‌ ‌జగన్‌ ఎం‌త మేరకు తమ నాయకులకు ఇలాంటి అవకాశం ఇస్తున్నారు? జగన్‌ను వ్యక్తిగతంగా కలవటానికి మంత్రులకే అవకాశం ఉండదన్న ప్రచారం ఉంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కింది స్థాయి నేతల సంగతి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 9 ఏళ్ల పాటు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగి జనం అంటే జగన్‌, ‌జగన్‌ అం‌టే జనం అనిపించుకున్న వ్యక్తేనా ఇవాళ అధికార సౌధం నుంచి బయటకు రానిది? తనను ఈ స్థితిలో గౌరవం ఇచ్చిన ప్రజలను, జెండా మోసిన కార్యకర్తలు, నాయకులను కలవటానికి ఆసక్తి చూపకపోవటం, అధికార రేఖకు ఆవలే ఉండిపోవటం దీర్ఘకాలంలో నాయకుడికి మంచి చేయదు. ఇక్కడ వైస్‌ ‌ను ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నంత కాలం ప్రతి రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్య ప్రజలను కలవటానికి కేటాయించే వారు. అపాయింట్‌ ‌మెంట్లు, వాటి కోసం పాట్లు ఉండేవి కావు. సాయంత్రం మూడు నుంచి ఒక గంట నాయకులు, ప్రజా ప్రతినిధులకు కేటాయించే వారు. పార్టీలతోను సంబంధం ఉండేది కాదు. ఎవరికైనా రాచమార్గమే. ఇంకా ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే రాత్రి ఎనిమిది తర్వాత లేదా తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల ప్రాంతంలో అవకాశం ఇచ్చే వారు. ఇటువంటి నాయకత్వ శైలి వల్ల ఇరుపక్షాలకు విశాల ప్రయోజనాలు కలుగుతాయి.బలమైన నాయకత్వం సహనం, ఉదారశీలత, విశాల దృక్కోణంలోనే మరింత బలం పుంజుకుంటుంది. ఈ విషయంలోనూ సీఎం జగన్‌ ‌తండ్రి స్ఫూర్తిని నింపుకుంటారని ఆశిద్దాం.

Leave a Reply