చింతమడక గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనుల సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్రావు
సీఏం కేసీఆర్ స్వగ్రామ చింతమడక, మధిర గ్రామస్తులంతా.. ఒకే మాట, ఒకే బాటపై నడవాలి.! గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ఐక్యతతో కలిసి పని చేసి సీఏం కేసీఆర్ సంతోషపడేలా అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం.! చింతమడక గ్రామ అభివృద్ధి దేశంలోనే మోడల్ గా నిలిచేలా జరపాలని నిశ్చయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ చెప్పారు. ఈమేరకు చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, అంకంపేట, దమ్మ చెరువు గ్రామ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రత్యేక అధికారులు, కలెక్టర్ వెంకట్రామ రెడ్డిలతో కలిసి సమికృత కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…వారం రోజులలోపు చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, గ్రామాల్లోని ఇళ్లను పూర్తిస్థాయిలో తొలగించాలని, తొలగించిన ఇళ్లకు వెంటనే జిల్లా కలెక్టర్ గారిచే ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. చింతమడకలో ఇప్పటికే పలుచోట్ల ఇళ్లను కూల్చివేయడం జరిగిందని, మిగిలి పోయిన ఇళ్ల కూల్చివేతకు గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆ గ్రామ ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
అంకంపేట, దమ్మ చెరువు గ్రామాల్లోని నిర్మాణ పనులను జూన్ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో నిర్మాణ పనుల పురోగతి జాప్యం పై ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి ఆరా తీయగా., కరోనా ప్రభావంతో ఆలస్యమైందని, ఈ వారం రోజుల్లోపు కూలీలను తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తామని ఏజెన్సీ ప్రతినిధి మంత్రికి తెలిపారు. గ్రామాన్ని మెచ్చుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచిస్తూ., ఐక్యతతో ముందుకు వెళ్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమీక్షలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ అనంత రెడ్డి, తహశీల్దార్ పరమేశ్వర్, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు రామ చంద్రం, శ్రీనివాస్ రెడ్డి, చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, ఇతర గ్రామ సర్పంచ్ లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.