Take a fresh look at your lifestyle.

వన్‌ ‌నేషన్‌.. ‌వన్‌ ‌మార్కెట్‌

  • నిత్యావసర వస్తువుల చట్టం సవరణ
  • రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా లక్ష్యం
  • రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయి
  • కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జవదేకర్‌

‌ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆరు దశాబ్దాల (1955) నాటి నిత్యావసర వస్తువుల చట్టానికి చేసిన సవరణను ఆమోదించింది. వ్యవసాయోత్పత్తుల నిల్వలపై ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తున్న ఈ చట్టాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధానంగా ఈ చట్ట సవరణ చేసినట్టు మంత్రులు ప్రకాష్‌ ‌జవదేకర్‌, ‌నరేంద్ర తోమర్‌ ‌మంత్రివర్గ సమావేశానంతరం డియాకు తెలిపారు. రైతుల కోసం కేంద్ర కేబినెట్‌ ‌మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ‌మార్కెట్‌ ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తెలిపారు. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయని జవదేకర్‌ ‌చెప్పారు. అగ్రికల్చర్‌ ‌ప్రొడ్యూస్‌ ‌మార్కెటింగ్‌ ‌కమిటీతో ఏర్పడుతున్న ఇబ్బందులు రైతులకు ఇక ఉండబోవన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్నదని జవదేకర్‌ ‌చెప్పారు. బుధవారం అత్యవసర వస్తువుల సవరణ చట్టంలో రైతులకు మేలు జరిగే పలు నిర్ణయాలను చేర్చామని జవదేకర్‌ ‌తెలిపారు.

తాజా సవరణలతో రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభించిందన్నారు. అదేవిధంగా కోల్‌కతా పోర్ట్ ‌ట్రస్ట్ ‌పేరును శ్యామప్రసాద్‌ ‌ముఖర్జీ ట్రస్ట్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని జవదేకర్‌ ‌తెలిపారు. పేదలు, రైతులు, చిన్న తరహా వ్యాపారులు, కరోనా వైరస్‌ ‌కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఇటీవల ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ విధమైన సహాయక చర్యలు తోడ్పడతాయని ఆయన చెప్పారు. వన్‌ ‌నేషన్‌-‌వన్‌ ‌మార్కెట్‌ ‌పథకాన్ని అమలు చేయాలని కూడా కేబినెట్‌ ‌తీర్మానించిందన్నారు. సవరణ అనంతరం పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఆయిల్‌ ‌సీడ్స్, అపరాలు, ఉల్లిపాయలు, పొటాటో వంటి ఉత్పత్తులను ఇక డీరెగ్యులేట్‌ ‌చేసే సూచనలున్నాయని, దీని వల్ల వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని వారు చెప్పారు. ఈ సవరణ నేపథ్యంలో ఏ స్టాక్‌ ‌పరిమితి కూడా ప్రాసెసర్లకు వర్తించబోదని, ఈ విధమైన పరిమితులు కేవలం అసాధారణ పరిస్థితుల్లోనే.. అంటే ప్రకృతి విపత్తులు, దుర్భిక్షం వంటి పరిస్థితుల్లోనే విధిస్తారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌కూడా తెలిపారు. దేశంలో నిత్యావసరాల కొరత ఉన్నప్పుడు ఈ చట్టం తెచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు అని ప్రకాష్‌ ‌జవదేకర్‌ ‌వెల్లడించారు. ఉత్పత్తులు అధికంగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించాల్సిందే అని ప్రభుత్వం అభిప్రాయపడిందన్నారు. సంస్కరణల్లో భాగంగా రైతులకు, వ్యవసాయ రంగానికి పెద్దగా ఊతమిచ్చేందుకు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం గత నెలలోనే నిర్ణయించిందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy