“ఎందుకీ ఆరాటం? దేనికోసం నీ పోరాటం?…ఢిల్లీ కోటను ఆక్రమించి, జాతీయజెండాను ఎగరవేసి భారత రిపబ్లిక్ కు అధ్యక్షుడవై కిరీటం ధరించాలనా?……..భారత స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యని నేతాజీని జపాన్ ప్రధాని టోజో అడిగిన ప్రశ్న… ‘‘స్వతంత్ర భారతాన్ని గాంధీజికి అప్పగించి రాజకీయాల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంట’’…..టోజో ప్రశ్నకు సుభాష్ చంద్రబోస్ సమాధానం.”
కొన్ని సంఘటనలు కళ్ళు ముందు జరుగుతున్నా వాటిని వాస్తవాలుగా ఒప్పుకోడానికి అంగీకరించకుండా కొన్ని సంకోచాలు మన మనసును తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. కొందరు కొన్ని నిజాలను వెలికితీసినా వాటిని అబద్దంగానే ప్రజల మనసుల్లో ముద్రించడానికి కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం ఇన్నేళ్ళైనా ప్రపంచానికి అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోఢి సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని కోలుకత పర్యటన నేపథ్యంలో నేతాజి అదృశ్య సంబందిత ఫైళ్ళ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుబాష్ చంద్రబోస్ మరణం నేటీకీ అంతుచిక్కని నిగూఢ రహస్యంగా మిగిలిపోయింది. అయితే ఆ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబందించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేసిన నాటి నించి ఆయన అదృశ్యంపై ఆసక్తిని మరింతగా పెంచింది. ఆయనకు చెందిన 64 రహస్య ఫైళ్లను మమతబెనర్జీ ప్రభుత్వం విడుదల చేయడం అభినందించదగినదే అయినా ఇన్ని రోజులు వాటిని రహస్యంగానే ఉంచవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన అదృశ్యం ఎవరికి లాభం? నేతాజీ దేశభక్తుడా? లేక దేశద్రోహ?…అయితే ఆయన చేసిన ద్రోహం ఏంటి?.. ఇలా ఒకదానికొక్కటి గొలుసుకట్టు ప్రశ్నలు ప్రపంచ మస్తిష్కాన్ని తొలుస్తూనే ఉన్నాయి.
నేతాజీ ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడాన్ని కాంగ్రెస్ అందరినీ ఆశ్చార్యానికి గురిచేస్తూ స్వాగతించింది. తాము అధికారంలో ఉన్నన్నాళ్ళు గుర్తుకు రాని ఈ ఫైళ్ల విషయంపై కాంగ్రెస్ సానుకూలంగా స్వాగతించడం ప్రపంచాన్ని మరింత అశ్చర్యాన్ని గురిచేసింది. ఇప్పటికే నేతాజీ కుటుంబంపై నిరంతర నిఘా ఉంచిన కాంగ్రెస్ నాయకత్వం..ఆ ఫైళ్లలో తమకు వ్యతిరేఖ అంశాలేమైన ఉంటాయేమోనని అనుమానంలోనూ ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతాజీకి సంబందిన రహస్య ఫైళ్లను బయటపెడతానని వాగ్దానం చేసిన నరేంద్రమోడి మళ్ళీ ఆ విషయంపై మౌనంగానే ఉన్నాడు. మన్మోహన్ సర్కారు సైతం నేతాజీ ఫైళ్ల విషయంలో కినుక వహించింది. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంపై రహస్యాలను విడుదల చేయాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. అయితే పశ్చిమ బెంగాలులో గత కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న అప్పటి కమ్యునిస్టు ప్రభుత్వం సైతం ఆయన రహస్య ఫైళ్ళ విషయంలో ఎటువంటి ఆసక్తి కనబరచకపోవడం అప్పట్లోనే అనేక అనుమానాలను రేకెత్తించింది. ప్రస్తుత మమత భెనర్జీ ప్రభుత్వం ఇంకా ఆ విషయంలో సంతృప్తికర నిర్ణయాన్ని వెలిబుచ్చలేదు..
నేతాజీ అదృశ్యంపై నాటి నెహ్రూ ప్రభుత్వం ఎటువంటి శ్రద్దవహించలేదనీ,పైపెచ్చు ఆయనను శాశ్వతంగా విదేశాలలో ఉంచేందుకు నెహ్రూ ప్రయత్నించాడని ఒక వాదన.ఒకవేళ ఆ విధంగా ఉంచితే,ఆయనను ఎక్కడ నిర్భందించి ఉండవచ్చు?..ఈ అంతులేని ప్రశ్నలకు కోలుకత మ్యుజియం ఫైళ్లలో సమాచారం లభించవచ్చు. నేతాజీ అదృశ్యంపై వెలువడిన ‘‘ఇండియాస్ బిగ్గెస్ట్ కవరప్’’ పుస్తకం ఆయన అదృశ్యంపై సంచలనాత్మకమైన అంశాలను బయటపెట్టింది. 1945 ఆగస్టు 18న నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించాడని జపాన్ రేడియో ప్రకటించడాన్ని ఆ పుస్తకం తప్పు పట్టింది.అసలు ఆ రోజు ఆ ప్రాంతంలో విమాన ప్రమాదమే జరగలేదని కుండ బద్దలు కొట్టింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ చైనా,రష్యాలను సందర్శించినట్లు అమెరికా,బ్రిటన్ అనుమానించింది.ఈ సమయంలోనే నెహ్రూ బోస్ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టాడు.ఈ గూఢాచర్యం దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సాగింది. నేతాజీ విమాన ప్రమాద దుర్ఘటనపై విచారించేందుకు 1956లో షానవాజ్ కమిటీ, 1970 లో ఖోస్లా కమిటీలను నియమించినా ఆశాజనక సమాచారం రాలేదు. 1999లో నియమించబడిన ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదంపై ఆశ్చర్యకరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.1945లో తైవాన్ భూభాగంపై ఎటువంటి విమానప్రమాదం జరగలేదనీ, అసలు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని నివేదిక సమర్పించింది. టోక్యోలోని రింకోజీ దేవాలయంలో ఉన్న అస్తికలు నేతాజీవి కావని,అవి తైవాన్ వీరుడు ఇచిరో ఒకురాకు చెందినవని తెలిపాడు.
నేతాజీ ఈ సమయంలో ఎక్కడ ఉండి ఉంటారు?…రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల చేతిలో చావు దెబ్బ తిన్న జర్మనీ,జపానులలో ఉండే అవకాశాలు లేనేలేవు. బ్రిటన్ సూచనపై రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ఆయనను బందీగా ఉంచినట్లూ వాదనలున్నాయి. 1946 మార్చ్ నెలలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ముఖ్య అధికారియైన మేజర్ జనరల్ జేకే భోన్స్లేను కంబైండ్ సర్వీస్ డిటైల్డ్ ఇంటరాగేషన్ కేంద్రంలో విచారించారు.ఆయనను విచారించిన ఐడి అధికారి రాయ్ బహదూర్ భక్షి బద్రినాథ్ నేతాజీ కదలికలపై భోన్స్లే నిజాలు చెప్పడం లేదని అనుమానం వ్యక్తపరిచారు.అయితే ఆగస్టు 17న తాను,నేతాజీ,హబీబుర్ రహ్మాన్ మరియు ఇతర జపాన్ అధికారులతో సమవేశమై బోస్ ను ఆయన గమ్యస్థానానికి చేర్చే అంశాన్ని చర్చిన్నట్లు భోన్స్లే అంగీకరించాడు.రష్యా తనకు అన్ని విధాల రక్షణ కల్పిస్తే బోస్ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నడని భోన్స్లే వెల్లడించాడు. బోస్ కు రష్యాకు వెళ్లాలనే కోరిక తీవ్రంగా ఉండేదని,దానికి జపాన్ సైతం అంగీకారం తెలిపిందని నేతాజీకి దుబాసీగా ఉన్న కింజి వతనబే వెళ్ళడించిన అంశం ఆసక్తికరం. రష్యా,జపాన్ ల మధ్య సంబందాల పునరుద్ధరణకు తాను కృషి చేస్తానని నేతాజీ అన్నాడని కింజి ఊటంకించాడు. సుభాష్ చంద్రబోస్ మంచూరియాలోని మారుమూల ప్రాంతంలో సజీవంగానే ఉన్నడని ఆయన సహచరుడు దేబ్ నాథ్ దాస్ 1948లో సంచలన ప్రకటన చేయడం ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని,ఆ సమయానికి ఇంకా సజీవంగానే ఉన్నాడని అనిపిస్తుంది. సజీవంగానే ఉన్న సుభాష్ కు భారత్ కు రావడానికి భయమేంటి? ఆయనను వేదించిన అంశాలేవి?.ఆ సమయంలో జాతీయ,అంతార్జాతీయ రాజకీయ రంగంలో వస్తున్న మార్పులను బోస్ నిశితంగా పరిశీలిస్తుండేవారనీ,….దేశానికి ఎవరు మిత్రులు,ఎవరు శత్రువులని గమనిస్తుండేవారని తెలుస్తోంది.
మహాత్మా గాంధీ అహింస సిద్దాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ కు తన రాజీనామా ఇచ్చాడు. బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్ వ్యతిరేకులను కలిసి ఒక ఐక్యకార్యాచరణ కార్యక్రమానికి ప్రయత్నం చేశాడు. ఇదేసమయంలో తమ శత్రువైన హిట్లర్ తో జతకట్టిన నేతాజీని బందించాలని బ్రిటన్ కు సహజంగానే కోరికగా ఉంటుంది. స్వతంత్ర పోరాట సమయంలో బ్రిటీష్ కు వ్యతిరేఖంగా జైళుకు వెళ్లిన బోస్,1936లో దేశబహిష్కరణ శిక్షను సైతం ఎదుర్కొన్నాడు. గాంధీ,నెహ్రూల లాగా బ్రిటీష్ పెద్దలతో బోస్ కు సత్సంబందాలు లేవు. మొదటి నుంచి బ్రిటీష్ పాలనకు తీవ్ర వ్యతిరేకియైన నేతాజీ రెండో ప్రపంచ యుద్ధం వంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ తమకు మద్దతు పలకగా,బోస్ హిట్లర్ ను కలవడం బ్రిటన్ కు మింగుడు పడలేదు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించాడన్న వార్తను అంతుచిక్కని నిగూఢ రహస్యంగా వర్ణించాడు నాటి బ్రిటన్ ప్రధాని చర్చిల్. అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేతాజీ మరణించాడని ప్రజలకు సులువుగా నమ్మబలికే ప్రయత్నం చేసింది. అయితే నేతాజీ మరణ వార్త భారతీయులకు కొత్త కాదు.1941లో ఆయన రహస్యంగ తన ఇంటినుంచి అంతర్థానమైనమయ్యాక బ్రిటీష్ ప్రభుత్వం ఆయన ఆచూకీ తీయడానికి అనేక విధాల ప్రయత్నించి,విఫలమయ్యాక బుద్ధిపూర్వకంగా ‘నేతాజీ మరణించాడు’’ అనే వార్తను ప్రచారం చేసింది. నేతాజీని ‘వక్రమార్గం తొక్కిన దేశాభిమాని’’ సంబోధించిన గాంధీజీ సైతం ఆయన మరణవార్తను నమ్మలేదు. కాని ఆ వార్త ఆయనను తీవ్రంగా కలవరపెట్టిది. తమ మధ్య ఉన్నది సైద్ధాంతిక విరుద్దమే కాని, వ్యక్తిగత వైషమ్యాలు కావని ఇద్దరికీ తెలుసు. ఈ సందర్భంలోనే సుభాష్ శ్రాద్ద కర్మలు నిర్వహించకండని గాంధీజి బోస్ కుటుంబసభ్యులతో తెలిపడం గమనార్హం. మరి నేతాజీతో నెహ్రూకున్న వ్యక్తిగత సంబందం ఆయనను దేశానికి రాకుండా చేసిందా?.స్వాతంత్రానంతరం నెహ్రూతో సమానంగా ప్రజాభిమానాన్ని సంపాదించింది నేతాజీనే.
ఎందుకీ ఆరాటం? దేనికోసం నీ పోరాటం?…ఢిల్లీ కోటను ఆక్రమించి, జాతీయజెండాను ఎగరవేసి భారత రిపబ్లిక్ కు అధ్యక్షుడవై కిరీటం ధరించాలనా?……..భారత స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యని నేతాజీని జపాన్ ప్రధాని టోజో అడిగిన ప్రశ్న… ‘‘స్వతంత్ర భారతాన్ని గాంధీజికి అప్పగించి రాజకీయాల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంట’’…..టోజో ప్రశ్నకు సుభాష్ చంద్రబోస్ సమాధానం. ఈ మాటలలో అతని ధ్యేయం,కర్తవ్యాలతో పాటు పదవి మీద నిరాసక్తత కూడ గోచరిస్తుంది.’’తమకెలాంటి రాజ్యాంగవిధానం కావాలో భారతప్రజానీకమే నిర్ణయించుకోవాలి’’అనడంలో అతని ప్రజాస్వామికతత్వం ప్రతిఫలించగా•-‘‘తాత్కాలిక ప్రభుత్వం రాజీనామా చేసి శాశ్వత జాతీయ ప్రభుత్వానికి తావిస్తుంది’’ అని చెప్పడంలో తనదీ తన ప్రభుత్వానిదీ దేశానికి దాస్యవిముక్తి కలిగించేవరకు మాత్రమే పాత్ర అని చెప్పకనే చెప్పారు. అవును..ఆయన బ్రిటీష్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రావుబహద్దూర్ బిరుదును తిరస్కరించిన దేశభక్తుడు జానకిబోస్ తనయుడు మరి.

అసిస్టెంట్ ప్రొఫెసర్,
చరిత్ర శాఖ, ఎన్జిడిసి, మహాత్మాగాంధీ యూనివర్సిటి