Take a fresh look at your lifestyle.

సెకండ్ వేవ్ లో ఉపాధి కోల్పోయిన కోటి మంది ..!

  • ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఘోర వైఫల్యం
  • 2020-21 అత్యంత చీకటి సంవత్సరంగా నిలిచింది
  • మాజీమంత్రి చిదంబరం ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ,జూన్‌1: ‌దేశ ఆర్థిక వ్యవస్థ సమర్ధ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ ఎం‌పీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మంగళవారం నాడు ఘాటు విమర్శలు చేశారు. నాలుగు దశాబ్దాల్లో అత్యంత చీకటి సంవత్సరంగా 2020-21 నిలుస్తుందని అన్నారు. కొరోనా మొదటి వేవ్‌ ‌పతాక స్థాయికి చేరుకున్న అనంతరం ’ఆర్థిక పునరుత్దానం’పై ఆర్థిక శాఖ గత ఏడాది జూలైలో ప్రజలను తప్పుదారి పట్టించిందని పేర్కొన్నారు. నేరుగా నగదు బదిలీ వంటి చర్యలకు కాంగ్రెస్‌ ‌సూచనలు ఇచ్చినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందని చిదంబరం విమర్శించారు. అందుకే గత నాలుగు దశాబ్దాల్లో అత్యంత చీకటి వత్సరంగా నిలుస్తోందన్నారు. నాలుగు తైమ్రాసికాల్లోని పరిస్థితి ఇందుకు అద్దం పడుతుంది. మొదటి రెండు తైమ్రాసికాల్లో రెసిషన్‌. ‌మూడు, నాలుగో తైమ్రాసికాల్లో కోలుకోని పరిస్థితి ఉందని చిదంబరం పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ, నాలుగో క్వార్టర్‌లో 1.6 శాతం వృద్ధి నిరాశాజనకమని అన్నారు.

గత ఏడాది కొరోనా ఉపశమించినట్టు కనిపించినప్పుడు ఆర్థిక మంత్రి, ఆమె ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందంటూ కథలు వినిపించారని, వి-స్పీడ్‌ ‌రికవరీ అంటూ జోస్యం చెప్పారని, అంతకుమించి చేసిందేమీ లేదని చిదంబరం విమర్శించారు. అదంతా కట్టుకథ. అప్పుడే మేము మా అభిప్రాయాలు చెప్పాం. కోలుకునే సంకేతాలు కనిపించడం లేదంటూ హెచ్చరించాం. ఆర్థిక వ్యవస్థకు బలమైన డోస్‌ ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వ వ్యయం పెంచాలని, పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలని, ఉచిత రేషన్‌ అం‌దరికీ ఇవ్వాలని చెప్పాం. మా విజ్ఞపులను పెడచెవిని పెట్టారు. ఇప్పటి ప్రతికూల వృద్ధికి ఇదే కారణం అని చిదంబరం చెప్పారు.

గత ఏడాదితో పోల్చుకుంటే తలసరి జీడీపీ 8.2 శాతం తగ్గిందని, దీంతో ప్రజలు రెండేళ్ల వెనక్కి పేదరికంలోకి వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగితపై సీఎంఐఈ నివేదిక కూడా అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. సెకెండ్‌ ‌కోవిడ్‌ ‌వేవ్‌తో కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని, 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ‘కొరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై నిస్సందేహంగా చాలా ఎక్కువగా పడింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణతో ఈ కష్టాలు ఇబ్బడిముబ్బడి అయ్యాయని చిదంబరం ఘాటుగా విమర్శించారు. 2020/21 నాటి పరిస్థితే 2021/22లో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా మేలుకోవాలని, తప్పులు ఒప్పుకోవాలని, విధానాలను మార్చు కోవాలని, ఆర్థిక నిపుణులు, విపక్షాల సలహాలు తీసుకోవాలని చిందబరం హెచ్చరించారు.

Leave a Reply