వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నిర్భయ దోషులకు.. ఉరి మరోసారి వాయిదా

January 31, 2020

  • రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ ‌పెండింగ్‌లో ఉన్నందునే..
  • ఆ తరువాతే తుది నిర్ణయం
  • కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

Once again postpone the executionదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ఢిల్లీలోని పటియాలా హౌస్‌ ‌కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని ఆదేశించింది. గతంలో కోర్టు జారీ చేసిన డెత్‌ ‌వారెంట్‌ ‌ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో నలుగురు దోషులలో ఒకరైన వినయ్‌ ‌శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే న్యాయపరంగా అన్ని అవకాశాలూ ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ‌శుక్రవారం పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ ‌జడ్జి జస్టిస్‌ ‌ధర్మిందర్‌ ‌రాణా ఉరిశిక్ష అమలుపై స్టే విధించారు. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ ‌పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తున్నట్లు వెల్లడించారు. దోషులకు డెత్‌ ‌వారెంట్‌పై స్టే ఇవ్వడం ఇది రెండో సారి. కాగా, జనవరి 22ననే నిర్శయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. దీంతో పిభ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని డెత్‌ ‌వారెంట్‌ ‌జారీ చేశారు. తాజాగా రెండోసారి దీనిపై స్టే విధించడం గమనార్హం. దీంతో రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకున్న తరువాత కోర్టు తుది డెత్‌ ‌వారెంట్‌ ఇవ్వనుంది. కాగా, నిర్భయ కేసు విచారణ సమయంలో తాను మైనర్‌నంటూ పిటిషన్‌ ‌వేసిన దోషి పవన్‌ ‌గుప్తా మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది.

ఇదిలా ఉండగా, నిర్భయపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డ దోషులకు ఉరిశిక్ష అమలును మరోసారి వాయిదా వేస్తూ పటియాలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై నిర్భయ తల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ దోషులకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడదంటూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ‌సవాల్‌ ‌విసిరాడనీ, దీనిని కోర్టు ఆదేశాలు నిజం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలయ్యే దాకా తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వెంటనే దోషులను ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఏడేళ్లుగా తాను న్యాయం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ దోషులు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: Execution,convicts,rape and murder, Nirbhaya