Take a fresh look at your lifestyle.

అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రంలో భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. పలు జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జోరు వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాను వర్షం ముంచెత్తింది. వంగూరు మండలంలోని డిండి చింతపల్లి వద్ద దుందుబి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. తిమ్మాజిపేట మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో పలు గ్రామాల్లో చెరువులు అలుగుపారుతున్నాయి. కల్వకుర్తి మండలంలోని గుండూర్‌ ‌గ్రామంలో ప్రధాన రహదారి తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలలో వరి, పత్తి పంటలు కొట్టుకుపోయాయి. ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామంలో వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. సిద్దిపేట జిల్లాలోని మండపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతినమే కాకుండా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ ‌మత్తడ పోస్తున్నది. కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాల్లో వానలు దంచి రకకొట్టాయి. అల్పపీడన ప్రబావం ఇంకా కొనసాగడతంతో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ అదికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో గంటపాటు కుండపోత వర్షం..ఎఎస్‌ ‌రావు నగర్‌లో కుంగిన రోడ్డు
హైదరాబాద్‌ ‌నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, అ‌ర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ ‌నగర్‌లో కుండపోత వాన పడింది. పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, ‌కోఠి, బషీర్‌బాగ్‌, ‌ఖైరతాబాద్‌, ‌మెహదీపట్నం, అత్తాపూర్‌, ‌షేక్‌పేట, అప్జల్‌గంజ్‌, ‌దిల్‌సుఖ్‌నగర్‌, ‌సరూర్‌నగర్‌, ‌వనస్థలిపురం, మలక్‌పేట, సైదాబాద్‌, ‌చంపాపేట్‌, ‌నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. లకిడీకాపూల్‌, ‌లంగర్‌హౌజ్‌, ‌గోల్కొండ, కార్వాన్‌లో చిరుజల్లులు పడ్డాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ అడిషనల్‌ ‌సీపీ అనిల్‌ ‌కుమార్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నగరంలో వర్షం కురుస్తుందని, వాహనదారులందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఇంటికి చేరుకోవాల్సిందిగా కోరారు. వర్షం కారణంగా రహదారులు జారుడు స్వభావం కలిగి ఉండొచ్చని కావునా మూలమలుపుల్లో మరింత జాగ్రత్తగా డ్రైవ్‌ ‌చేయాల్సిందిగా సూచించారు. ఇదిలావుంటే ఎఎస్‌ ‌రావు నగర్‌లో రోడ్డు కుంగింది. అందరూ చూస్తుండగానే భారీ గొయ్యి పడింది. భారీ వర్షం నేపథ్యంలో మాన్సూన్‌ ‌బృందాలను జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ అలర్ట్ ‌చేశారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌ ‌స్థంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇక పాదాచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు ఇంటికెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాల జనాలంతా తీవ్ర భయంతో వణికిపోతున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి ప్రవేసిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడింది.

వనపర్తి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం..
వనపర్తి జిల్లాను వర్షం ముంచెత్తింది. అల్పపీడనంతో కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. వరదకు చెరువులు నిండి అలుగులు పారుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, ‌శంకర్‌నగర్‌, ‌బ్రహ్మణవీధి, శ్వేతనగర్‌, ‌రామ థియేటర్‌ ‌ప్రాంతాల్లోని వరద నీరు రోడ్లపై ప్రవహించింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే జిల్లా కేంద్రానికి నాగర్‌కర్నూల్‌, ‌గద్వాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రేవెల్లి మండలంలోని కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. చిన్నబావి మండలంలో పలు పంట పొలాలు నీటముగిశాయి. గోపాల్‌పేట పెద్ద చెరువు అలుగుపారడంతో ప్రధాన రహదారిపైకి నీళ్లు చేరడంతో రవాణా స్తంభించింది. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి వద్ద చాపలవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు మండలాల్లోనూ వర్షాలు కురిసిన వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వీపనగండ్ల మండల కేంద్రం సపంలోని బీమా కాలువ ప్యాకేజీ నంబర్‌ 16, ‌డిస్టిబ్యూట్రర్‌ 11 ‌కెనాల్‌ ‌తెగిపోవడంతో పంట పొలాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా గోపాలపేట మండలంలో 145.5 మిల్లీ టర్లు, ఘణాపూర్‌లో 126.5, పనగల్‌లో 126.6 మిల్లీటర్ల వర్షం కురిసింది. అలాగే జిల్లా కేంద్రంలో 110.8 మిల్లీటర్లు, కొత్తకోటలో 93, వీపనగండ్లలో 110 మి.టర్లు, అలాగే పలు మండలాల్లోనూ మోసర్తు వాన కురిసింది.

నిజామాబాద్‌ ‌జిల్లాలో అధికారుల అప్రమత్తం..జాలర్లు చేపల వేలకు వెళ్లొద్దని హెచ్చరిక
నిజామాబాద్‌ ‌జిల్లాలో భారీ వర్షాలకు రెంజల్‌ ‌మండలం కందకుర్తి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ..మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. శివాలయం పైనుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉభయ జిల్లాల వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. నిజామాబాద్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో అనేక జలాశయాలు కొంగొత్త అందాలు సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతానికి మించి వానలు కురిశాయి. నిజామాబాద్‌ ‌జిల్లాలోని రెండు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 27 మండలాల్లో సాధారణ వర్షపాతానికి ఎక్కువగానే వానలు పడ్డాయి. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నిండుకుండలా మారి గేట్లు ఎత్తగా… నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టు మాత్రం వరద లేక బోసిపోతోంది. కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. కళ్యాణి, సింగీతం, పోచారం, కౌలాస్‌ ‌నాలా ప్రాజెక్టుల గేట్లు సైతం ఎత్తగా దిగువకు భారీగా వరద కొనసాగుతోంది. మూడు రోజులుగా కురిసిన వానలతో మంజీర నదిలో మరోమారు జలకళ ఉట్టిపడుతోంది. భారీ వర్షపాతంతో ఆయా మండలాల్లో చెరువులు, కుంటలు మత్తడి పారుతున్నాయి. ఒకే సీజన్‌లో వందలాది చెరువులు రెండు, మూడు సార్లు మత్తడి దుంకుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు వరుసగా రెండో ఏడాది గేట్లు తెరుచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి సెప్టెంబర్‌ ‌రెండో వారానికే గేట్లు తెరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు అధికారుల అంచనాలకు భిన్నంగా మహారాష్ట్ర నుంచి వరద భారీగా రావడంతో నాలుగు గేట్లు ఎత్తారు. వరద ఉధృతి పెరగడంతో 26 గేట్లు ఎత్తి వరదను నియంత్రించారు. ఎస్సారెస్పీ గేట్ల నుంచి పాల పొంగులా ఎగిరి దుంకుతున్న జలాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో ఉరకలు వేస్తూ వరద దిగువకు పరుగులు తీస్తోంది. కామారెడ్డి జిల్లాలోని మరో చారిత్రక ప్రాజెక్టు నిజాంసాగర్‌ ‌మాత్రం నీళ్లు లేక బోసిపోతోంది. ఎగువ నుంచి వరద స్వల్పంగానే కొనసాగుతోంది. సింగూరు నుంచి వరద అంతగా రావడం లేదు. కామారెడ్డి జిల్లాలోని మధ్యతరహా జలాశయాలు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ఉప్పొంగాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానలతో వరద వస్తుండడంతో కౌలాస్‌ ‌నాలా ఒకే సారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వరదను వదిలి పెట్టారు. కౌలాస్‌ ‌ప్రాజెక్టు నుంచి వరద వదలడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్‌, ‌పిట్లం మండలాల్లో జన జీవనానికి ఇబ్బందులు తలెత్తాయి. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకోగా ఈ సీజన్‌లో రెండో సారి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు సైతం పూర్తి స్థాయి నీటి మట్టంతో సరికొత్త అందాలను సంతరించుకుంది.

కరీంనగర్‌ ‌జిల్లాలో భారీ వర్షం..లోయర్‌ ‌మానేరు డ్యామ్‌కు వరద పోటు
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్‌ ‌సపంలోని లోయర్‌ ‌మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, డ్‌ ‌మానేర్‌ ‌నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్‌ఎం‌డీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్‌ ‌మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్‌ ‌నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్‌ఆర్‌ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్‌, అన్నారం సరస్వతి బ్యారేజ్‌, ‌మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!