బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్ నేరెడ్మెట్లో నాలాలో పడి చిన్నారి సుమేధ మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం న్యాయవాడి, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వేణుగోపాల్ వర్షం వెలిసిన తరువాత స్నేహితురాలి దగ్గరికి వెళ్లి వస్తానని తండ్రితో సంతోషంగా చెప్పిన సుమేధ నిర్జీవంగా ఇల్లు చేరిందనీ, వరద నీటి ఉధృతికి పొంగి పొర్లుతున్న నాలాలో కొట్టుకుపోయి విగత జీవిగా లభించిన హృదయ విదారక సంఘటన సుమేధ కుటుంబాన్ని విషాదంలో ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందనీ, సుమేధ మృతి చెందిన నాలాకు సుమారు 30 మీటర్ల మేర ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనకు బాధ్యులుగా ప్రజాప్రతినిధులైన స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపి, స్థానిక సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్, కమిషనర్ అంతా దోషులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వీరి బాధ్యతారాహిత్యం కారణంగానే అమాయకురాలైన చిన్నారి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రతీ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఓపెన్ కాలువలపై తక్షణం పైకప్పులు తగిన రక్షణ చర్యలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలనీ, ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ను కోరారు.