గ్రేటర్, ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రగతిభవన్‌లో సక్ష
ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, పార్టీ నేతలకు దిశానిర్దేశం
ఎమ్మెల్సీ ఎన్నికల వోటు నమోదులో చురుకుగా ఉండాలి : పార్టీ ఇన్‌ఛార్జీలతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనతో పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా..గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై సీఎం కెసిఆర్ చర్చించినట్లు సమాచారం. నోటరీ, 58, 59 జీవో పరిధిలోని ఇండ్ల క్రమబద్దీకరణపై కూడా మేయర్, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇదిలావుంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థల ఎంపికలపై తీసుకువాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పట్టభద్రుల కోటాలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి మేయర్ బొంత రామ్మోహన్‌ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో తీవ్ర పోటీ ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో నిరాశ విపక్షాలకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీతో సత్సంబంధాలు, స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్మోహన్‌ను బరిలో నిలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భేటీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికపై కూడా సీఎం పార్టీ నేతలతో చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వోటు నమోదులో చురుకుగా ఉండాలి : పార్టీ ఇన్‌ఛార్జీలతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల వోటరు నమోదు ఇంఛార్జిలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పట్టభద్రుల వోటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వోటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే వివిధ నియామక పక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ప్రయివేటు రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించామని గుర్తు చేశారు. పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలనలో అపూర్వమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 60 ఏళ్ల ప్లోరైడ్ రక్కసిని ఆరేళ్లలో తరిమేశామన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు దివాలా తీశాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నమోదు ప్రక్రియను వేగవంతంగా చేపట్టి అందరినీ ఎన్రోల్ అయ్యేలా చేయాలన్నారు.