“విధి వంచితులు.. అందరి లాగే తమ పిల్లలు కూడా పెరిగిపెద్దవారై ప్రయోజకులై తమను ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు ఆశించారు.. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు..నాలుగు పదుల వయసులోనూ అన్నింటా అమ్మే తోడై సపర్యలు చేయాల్సిన దుస్థితి..పుట్టిన ముగ్గురు కొడుకులు మానసిక, శారీరక వికలాంగులులై నిస్సహాయస్థితిలో మంచానికే పరిమితమయ్యారు.. ఇటీవల ఆ ఇంటి యజమాని మరణంతో ఆ కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది.”
యుక్త వయసులోనూ తల్లి సేవలే••..
పుట్టినవారంతా మానసిక, శారీరక వికలాంగులే..
బరువు తీర్చాల్సిన వారే భారమయ్యారు..
మేనరిక వివాహమే కారణమా..?

శ్రీమతమ్మ, శంకర్ రెడ్డి కుటుంబం ఆర్ధికంగా తమంతట తాము ఎవరికి చేయిచాపకుండా ఉండేవారు. పులిమీద పుట్రలా అటు పిల్లల అనారోగ్యం, భర్త అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయి అప్పులతో, దారిద్య్రంతో సహవాసం చేయాల్సిన గడ్డుపరిస్థితి దాపురించింది. శ్రీమతమ్మ భర్త శంకర్ రెడ్డి అప్పట్లో నాచారం ఐడీఏలోని ఓ ప్రైవేటు కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా కొనసాగాడు. అంతలోనే ఆ కంపెనీ మూతబడడంతో పశుపోషణతో కొంతకాలం నెట్టుకొచ్చారు. అటు తరువాత అతనికి వెన్ను నొప్పి ప్రారంభమై కాలు పనిచేయకుండా అయ్యింది. అతని ఆరోగ్యం కోసం కూడా అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సివచ్చింది. తరువాత కొంతకాలం వికలాంగుల సంక్షేమ సంఘం మండల, జిల్లా స్థాయి నాయకుడిగా పని చేశాడు. అయితే ఆయన చివరి రోజుల్లో మూత్రపిండాలు చెడిపోయి తీవ్రంగా భాధపడ్డాడని, ఆయన వైద్యానికి కూడా లక్షల రూపాయల అప్పులు తెచ్చి పెట్టినా బతకలేదని శ్రీమతమ్మ వాపోయింది. తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం పించన్ అందజేస్తోందని, అయితే కొన్ని అప్పులకు మిత్తీలు కట్టగా నెలకు కేవలం 12 వందల రూపాయలు మాత్రమే చేతిలో ఉంటాయని ఆమె పేర్కొంది. పిల్లలు, భర్త అనారోగ్యంతో వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయామని వాపోయింది శ్రీమతమ్మ. పిల్లలను సాకుకుంటూ అప్పులు లేకుండా ఉండాలని ఆమె ఆరాటం. తమను దాతలు ఆదుకోవాలని కోరుతోంది ఆతల్లి. దయార్ధ్ర హృదయంతో ముందుకు వచ్చి సహాయం చేసే దాతలు సెల్ నంబర్ 9154371474లో సంప్రదించాలని ఆమె కోరుతోంది.
