Take a fresh look at your lifestyle.

జీవ వైవిధ్యతనే జాతి సంపద

“జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. ఒక జాతికి చెందిన విభిన్న లక్షణాలు ఉండే జన్యు వైవిధ్యం,జాతుల మధ్య తేడాలు,సంఖ్యలను తెలియదు జాతుల వైవిధ్యం,ఆహారపు చక్రాలను తేలిపోయే పర్యావరణ వైవిధ్యం మానవ వికాసానికి కీలకమైనవి.వైవిధ్యాన్ని సంరక్షించడమంటే ఉత్పాదక, వినియోగ, ఆహ్లాద, సాంస్కృతిక, నైతిక విలువలను సాగు చేయడం వంటిది.”

 జూన్‌ 5, ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…

asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం
9652275560

ఆహారపు గొలుసు ,ఆహారపు వల చక్రమలో తప్పిపోయిన జాతుల వలన ఏర్పడిన అసమతుల్యత వలన కరోనా వైరస్‌ ‌మహమ్మారి, మిడతల దండు దండయాత్రతో ప్రపంచం విలవిల లాడుతున్న సందర్భంలో జూన్‌-5 ‌పర్యావరణ దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది.మానవ జీవనానికి అనుకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమిని సంరక్షించుకోవాలి భవిష్యత్‌ ‌తరాలకు అందించాలి అనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి అనుబంధ యునైటెడ్‌ ‌నేషన్స్ ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ‌ప్రోగ్రామ్‌ ‌వారు 1974 నుండి ప్రతి ఏటా జూన్‌ 5 ‌ను పర్యావరణ దినంగా పాటిస్తున్నారు.గ్లోబల్‌ ‌వార్మింగ్‌,‌సుస్థిర వినియోగం, కాలుష్యం వంటి అనేక అంశాల మీద 150 దేశాలలో అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.ఈ పరంపరలో జూన్‌ 5,2020 ‌ని ‘‘జీవ వైవిధ్యం’’ఇతివృత్తంతో నిర్వహించాలని కోరింది.భూమి పై ఉన్న జీవ వైవిధ్యంలో పది % క్షీరదాలను 14% ఉభయజీవులను,18%పక్షులను కలిగివున్న కొలంబియా, ఆర్ధిక సహకారం అందిస్తున్న జర్మనీలతో యు యన్‌ ఇ ‌పి అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నది .2020 నుండి ప్రకృతి భూగోళం మరింత సంక్షోభానికి కబలించడానికి ఉన్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికగా,ఆశయసిద్ధితో కార్యాచరణకు పునుకొని జీవ వైవిధ్యత ,ఆవరణ వ్యవస్థల రక్షణ కోసం కృషి చేసి వాటిని సాధారణ స్థితిలకు తీసుకువచ్చి తద్వారా ఆహారభద్రతను కలిపించాలని పిలుపునిచ్చింది.ఐక్యరాజ్య సమితి 2011-2020 ని జీవ వైవిధ్య,2021-2030 లను ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దాలుగా ప్రకటించింది.ఈ వెలుగులో 2020 ని కార్యాచరణ ను శీఘ్రతరం చేసే సంవత్సరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.ప్రకృతి సమతుల్యతను సంరక్షణ కు ఇదే సరైన సమయమని ,అంతరించే జంతు వృక్ష జాతులను కాపాడుకోవడానికి తగిన విధానాలను రూపొందించుకుని అమలు చేయాలని సభ్య దేశాలను యు యన్‌ ఇ ‌పి కోరింది.

ఇటీవల జీవ వైవిధ్య ,ఆవరణ వ్యవస్థల సేవలపై ఇంటర్‌ ‌గవర్నమెంటల్‌ ‌సైన్స్ ‌పాలసీ కీలక నివేదిక ప్రకారం ఆకలి,పేదరికం,ఆరోగ్యం,ఉత్పత్తి, నీరు,వాతావరణ మార్పు వంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రగతి కి బదులు తీవ్రమైన తిరోగమన ధోరణులు ప్రారంభమయ్యాయని హెచ్చరించింది.2050 నాటికి ప్రస్తుతం భూమి పై ఉన్న జాతులలో 30% అంతరిస్తాయని పేర్కొంది.మానవ జాతి చరిత్రలో అంతరించటం పునరుద్ధరణ ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడి ఎన్నడు లేని వేగంతో జాతుల విలుప్తత లో ఆరవ మాహా విపత్తు వైపు పయనిస్తున్నాము.విచక్షణ లేని నేల, సముద్ర వినియోగం,జంతువుల వేట,వాతావరణ మార్పు,కాలుష్యం, హానికర అవాంఛిత జీవుల అనూహ్య వృద్ధి వలన జీవ వైవిధ్యత ఆవరణ వ్యవస్థలకు ప్రమాద ఘంటికలు కలుగుతున్నాయి.అణు పరీక్షలు,ఆయుధాల ఉత్పత్తి,వైమానిక నౌకా దళ యుద్దాల నుండి వెలువడే విస్ఫొటనాలు, శబ్దాలు రసాయనాలు జీవుల సహజ అవాసాలకు పెను ముప్పును తెచ్చిపెడుతున్నాయి.

నేలపై, నీటిలోని ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న జీవరాశులు వాటిమధ్యన గల విభిన్నతలనే జీవవైవిధ్యంగా పిలుస్తారు. జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. ఒక జాతికి చెందిన విభిన్న లక్షణాలు ఉండే జన్యు వైవిధ్యం,జాతుల మధ్య తేడాలు,సంఖ్యలను తెలియదు జాతుల వైవిధ్యం,ఆహారపు చక్రాలను తేలిపోయే పర్యావరణ వైవిధ్యం మానవ వికాసానికి కీలకమైనవి.వైవిధ్యాన్ని సంరక్షించడమంటే ఉత్పాదక, వినియోగ, ఆహ్లాద, సాంస్కృతిక, నైతిక విలువలను సాగు చేయడం వంటిది. ఇది ఎలాగంటే.. మావో నాటి చైనా లో ఆహార పంటలను నాశనం చేస్తున్న జాతులుగా ఎలుకలు,పిచ్చుకలు గా గుర్తించి వాటిని భారీ ఎత్తున వేటాడి చంపేసారు.కానీ ఆహార గోలుసులోమిడతలను తిని వాటి సంఖ్యను పరిమితం చేసే పిచ్చుకల సంఖ్య తగ్గడం మూలంగా మిడతల సంఖ్య పెరిగి పంటలకు పిచ్చుకలు చేసే నష్టం కంటే అనేక రేట్లు పంటలను నాశనం చేసాయి. ఈ ఉదంతంలో చైనా మళ్ళీ రష్యా నుండి పిచ్చుకలను దిగుమతి చేసుకుని వాటి సంఖ్యను వృద్ధి చేసింది. ప్రస్తుతం భారత్‌ ‌తో పాటు అనేక ఆసియా ఆఫ్రికా దేశాలు ఆహార పంటల పై మిడతల దాడికి లోనవుతున్నాయి.మిడతలని తినే పాములు మైనాలు ,నెమళ్లు, రోజిలు, బీటిల్స్ ,‌కాకుల తదితర పక్షుల జాతులు మానవ చర్యల వలన తగ్గడం వలన మిడతల సంఖ్య పెరిగి పంటలను నష్టపరిచి ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.భూమిపై ఆహారపు పంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే డెబ్బై శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారులుగా ఉంటాయి. మానవ చర్యలతో పారిశ్రామిక దుష్ఫలితాలతో అనేక కీటక, పక్షిజాతులు అంతర్థానం అవుతున్నాయి. ప్రతియేటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాదపుటంచులకు చేరింది. కీటక, పక్షి జాతులు తగ్గడం వలన హానికర, వ్యాధికర జీవులు ప్రబలి అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్నది. ఇదే విధంగా మొక్కలు నేలలోని నీటిని వాతావరణానికి చేర్చే జల చక్రానికి విఘాతం కలుగుతుంది.

జీవవ్కెవిధ్యం పర్యావరణ వ్యవస్థలను సమతుల్యం చేస్తుంది మరియు భూమిని జీవించేలా చేస్తుంది. జీవ జాతుల సుస్థిరతకు ఇది అవసరం. పరిశ్రమ, మత్స్య, పశుసంవర్ధక, అటవీ, ఫార్మసీ మరియు వ్యవసాయ కార్యకలాపాలు వంటి రంగాలలో స్వచ్ఛమైన గాలి మరియు నీటిని సరఫరా చేయడానికి జీవవైవిధ్యం ఉపయోగించబడుతుంది. అధిక జీవవైవిధ్యం ఆర్థిక లాభం మరియు వ్యవసాయం, సాంకేతికత మరియు విజ్ఞాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో ఉన్న 40% అడవులు 2019 నాటికి 19% అయ్యాయి.జీవ వైవిధ్యాన్ని నిలయంగా ఉన్న అనేక ప్రాంతాలు ముప్పులోనయ్యి సంరక్షించే హాట్‌ ‌స్పాట్‌ ‌లు గా గుర్తించారు.పశ్చిమ కనుమలు,హిమాలయాలు,అండమాన్‌ ‌దీవులు,ఇండో బర్మా సరిహద్దు ప్రాంతం..ఇవి అత్యధిక స్థానీయ జాతులను కలిగిఉన్నవి..అలాగే మన దేశంలో ప్రపంచ ములోని సాగు అవుతున్న పంటల రకాలలో 40% సాగవుతున్నాయి.జీవ వైవిధ్యత సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో మన దేశం కూడా చోటును కలిగివుంది.అన్ని దేశాలు పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను అమలు చేయడానికి శాసనాలు చేసి కట్టుదిట్టంగా అమలు చేయాలి.పరాగ సంపర్కములో కీలకమైన కీటకాలను తేనెటీగలను కోసం విరివిగా పూల మొక్కలను నాటాలి.పంటలకు నష్టం చేసే చీడ పీడలను నివారించడానికి పెస్టిసైడ్స్ ‌కు మానేసి జీవ సంబంధ నియంత్రణకారులను ఉపయోగించాలి.శిలాజ ఇంధనాలను పొదుపుగా ఉపయోగించాలి.

అడవులకు వాటి అపి ఆధారపడిన జీవ జాతులకు హాని కలిగించే భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపాలి.రైతాంగానికి సబ్సిడీలను పెంచి అపార మద్దతును ఇవ్వాలి.వనరుల కోసం జరిగే యుద్ధోన్మాద చర్యలను నిరసించి మానవులనే కాదు యావత్తు ప్రకృతిని ధ్వంసం చేసి అణ్వస్త్రాలను నిర్ములించాలి.శాంతియుత సహజీవనాన్ని ప్రచారం చెయ్యాలి.లాభమే తప్ప సుస్థిర సమ్మిళిత ఆభివృద్ధికి, వినియోగానికి వ్యతిరేఖంగా సమస్త రుగ్మతలకు కారణమైన పెట్టుబడిదారి విధానాన్ని నియంత్రించి వనరులను జాతీయము చేయాలి.పాలకులు పౌరసమాజం బలమైన సంకల్పంతో ప్రకృతిని ప్రాణపదంగా భావించి పని చేసినప్పుడు మళ్ళీ వివిధ జాతులతో అలరారే అపూర్వ సౌందర్య వనాల,సహజ అవాసాల పునరుద్ధరణ జరుగుతుంది.అప్పుడు మాత్రమే తల్లి భూదేవి తన ప్రేమమయత్వాన్ని,ప్రకృతి రాణి తన సమ్మోహన రూపాన్ని శతసహాస్త్ర స్వరూపాలలో సాక్షాత్కారమై సమ్మోహనపరచి లాలించి మనతో పాటు భావి తరాల వికాసానికి దోహదం చేస్తుంది.

Leave a Reply