Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలపై .. అనుమానాలెన్నో..!

  • ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల మేరకు గర్భిణులకు పరీక్షలేవీ ?
  • ఈ విషయంపై దృష్టి సారించాలి : టీజేఏసీ

కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, పక్క రాష్ట్రమైన ఏపీలో సైతం రోజురోజుకూ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం కేసుల సంఖ్య గురువారం మినహాయిస్తే గత నాలుగు రోజులుగా పది లోపే నమోదు కావడం పల్ల వైద్య నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొరోనా టెస్టులు ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారమే చేస్తున్నామని చెబుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతీ రోజు తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగానే పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొరోనా టెస్టుల విషయంలో తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. రాజకీయ పార్టీలు, టీ జేఏసీ లేవనెత్తుతున్న సందేహాల ప్రకారం…గత నెల ఏప్రిల్‌ 20‌న గర్భిణిలందరికీ కొరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ ‌స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం క్లస్టర్స్, ‌కంటైన్‌మెంట్‌ ‌జోన్లు, హాట్‌స్పాట్‌ ‌జిల్లాలలోని భారీ వలస సముదాయాలు, నిర్వాసిత కేంద్రాలలో నివసిస్తున్న గర్భిణులకు కొరోనా లక్షణాలు లేనప్పటికీ తప్పనిసరిగా పరీక్షలు చేయాలి..ప్రసవానికి ఐదు రోజుల ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి. అయితే, అందుకు భిన్నంగా తెలంగాణలో అసలు ఈ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. నీతి ఆయోగ్‌ ‌లెక్కల ప్రకారం తెలంగాణలో జనాభా పెరుగుదల రేటు 1000కి 17.5. ప్రస్తుత జనాభా 3.90 కోట్లు. తెలంగాణలో క్లస్టర్లు, కంటైన్‌మెంట్‌జోన్లు, హాట్‌స్పాట్‌ ‌జిల్లాల్లో భారీ వలస సముదాయాలు, నిర్వాసిత ప్రాంతాలలో ఉండే జనాభా రాష్ట్ర జనాభాలో సుమారు 10 నుంచి 15 శాతం వరకూ ఉంటుంది. ఇది కాకుండా, మొత్తం తెలంగాణలో కనీసం 15 శాతం మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించాలి. కాగా, ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో కేవలం గర్భిణిలకు ప్రతీ రోజూ కనీసం రోజుకు 280 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించాలి. కానీ, రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అన్ని రకాల పరీక్షలు మొత్తం కలిపినా 150 దాటడం లేదనీ, మరి అలాంటప్పుడు ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాలు ఎక్కడ అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరగడంతోనే కేసులు తక్కువగా నమోదవుతున్నాయనీ, పరీక్షల సంఖ్య పెంచితే, కేసుల సంఖ్య పెరగడంతో పాటు హాట్‌స్పాట్‌ ‌జిల్లాల సంఖ్య కూడా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా జరిగితే గర్భిణులకు చేయాల్సిన పరీక్షల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు.

నిజానికి గర్భిణులకు అసలు కొరోనా పరీక్షలు జరుగుతున్న దాఖలాలు లేవనీ, స్త్రీలు గర్భం దాల్చినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందనీ, అసలు ఈ లాక్‌డౌన్‌ ‌సమయంలో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, రవాణా సౌకర్యాలు లేక మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఇటీవల రోడ్లమీదనే జరుగుతున్న ప్రసవాలు, సమయానికి వైద్యం అందక రోడ్లపైనే తల్లీ శిశువులు మరణిస్తున్న ఘటనలు రోజూ చూస్తున్నామనీ, అలాంటిది ప్రభుత్వం గర్భిణిలకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలో పరీక్షలు చేసే సామర్ద్యం రోజుకు 1540 వరకూ ఉందనీ, కావాలంటే మరో 5000 పరీక్షలను కూడా చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తెలంగాణలో ఐసీఎంఆర్‌ ‌నిబంధనల మేరకు గర్భిణులకు పరీక్షలు జరగాలని పేర్కొంటున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వం కర్తవ్యమనీ, మరి తెలంగాణలో అదనపు పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఆలోచించాలని టీ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Leave a Reply