Take a fresh look at your lifestyle.

వాహనాలకూ సరి, బేసి విధానం అమలు చేయాలి..!

రాష్ట్రంలో ఒక పక్క సడలింపుల లాక్‌డౌన్‌ ‌జరుగుతుండగా మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొరోనాతో సహజీవనం తప్పదేమోన నిపిస్తున్నది. గత రెండు వారాల వ్యవధిలో జిహెచ్‌ఎం‌సీ పరిధిలో సుమారు అయిదు వందల కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి .తాజాగా శుక్రవారం ఒక్క రోజున్నే అరవై రెండు పాజిటివ్‌ ‌కేసులు నమోదవడం చూస్తుంటే ఇప్పట్లో కొరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను చూడలేమేమోననిపిస్తున్నది. విచిత్రకరమైన విషయమేమంటే మిగతా తెలంగాణ జిల్లాలన్నిటికన్నా రాష్ట్ర రాజధానిలోనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. శుక్రవారం నమోదు అయిన అరవై రెండు పాజిటివ్‌ ‌కేసుల్లో నలభై రెండు జీహెచ్‌ఎం‌సీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇదే శుక్రవారం ఒక్కరోజున్నే రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కొరోనా కారణంగా మృతి చెందడంకూడా ప్రమాద గంటికలను మోగిస్తున్నట్లుగానే కనిపిస్తున్నది.కొరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని పునరుద్దరించేందుకే క్రమంగా లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సడలిస్తూ వస్తున్నది. ఒకవైపు ఫ్యాక్టరీలు, భవన నిర్మాణ సంస్థలు ఇప్పుడిప్పుడే తిరిగి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న క్రమంలో వారికి కార్మికుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. విజృంభిస్తున్న కొరోనాకు భయపడి దేశవ్యాప్తంగా లక్షలాది వలస కార్మికులు తమ ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.

రాష్ట్రం నుండి కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్ళలో వేల సంఖ్యలో వలస కార్మికులు ఇప్పటికే తరలి వెళ్ళారు కూడా. అయితే విచిత్రకర విషయమేమంటే వెళ్ళిన వారిలో కొందరితోపాటు,, పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణవారు ఇటీవల కాలంలో తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరికి కొరోనా పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో శుక్రవారం ఒక్కరోజునే 42 కేసులు వెలుగుచూడగా వారిలో 19మంది వలస కార్మికులు కూడా ఉండడాన్ని ఆరోగ్య సిబ్బంది గుర్తించింది. అంటే తిరిగి వొచ్చే వలస కార్మికులతో కూడా మరింతగా కొరోనా బాదితుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికి రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య 1761కి చేరుకుంది. వీరిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళివచ్చినవారు 118 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే ఇప్పటి వరకు 38 మంది మృతి చెందినట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడయింది. లాక్‌డౌన్‌లో ప్రజలెవరు అనవసరంగా బయటికి రాకుండా కట్టుదిట్టం చేయడంలో తమ శక్తిమేర కృషి చేసిన పోలీస్‌శాఖకు కూడా ఈ వ్యాధి అంటుకున్నది . కొత్త గూడెం డిఎస్పీ ముందుగా ఈ వ్యాధి బారిన పడగా, తాజాగా ఓ కానిస్టేబుల్‌ ‌చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీరితోపాటు డ్యూటీ చేస్తున్న మరి కొందరికి కూడా ఈ వ్యాధి సోకడంతో వారంతా ఇప్పుడు చికిత్సపొందుతున్నారు.

కొరోనా కేసులు పెరుగడానికి లాక్‌డౌన్‌ ‌సడలింపులే కారణమా అన్నదిప్పుడు ప్రశ్న. సడలించని పక్షంలో ప్రజలు ఆగే పరిస్థితి కూడాలేదు. అనేక వ్యాపారాలు ఇప్పటికే స్థంబించిపోయాయి. ప్రొడక్షన్‌ ‌యూనిట్లన్ని నిలిచిపోయాయి. ప్రజల్లో క్రమేణా కొనుగోలు శక్తి క్షీణిస్తూ పోతున్నది. ఈ పరిస్థితిలో సడలింపుల అనివార్యత ఏర్పడింది. అయితే ఈ సడలింపులో ప్రజలు తమ బాధ్యతను మరిచిపోతున్నారు. ఇంతకాలంగా పాటించిన స్వీయ నియంత్రణను మరిచిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమవుతున్నది. ఉద్యోగులు ఇళ్ళకే పరిమితమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు, కోర్టులు ఇంకా నడవడమే లేదు. అయినా హైదరాబాద్‌ ‌మహానగరంలో అప్పుడే ట్రాఫిక్‌ ‌జామ్‌లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్‌ ‌సిగ్నల్స్ ‌దగ్గర రెడ్‌ ‌లైట్‌ ‌వెలిగినప్పుడు చూడాలి వాహనాలు ఏవిధంగా కిక్కిరిసినట్లు ఎంత దగ్గరదగ్గరా ఉంటున్నాయో .! పాదాచారులు కూడా రోడ్లపై తమకు తోచినట్లుగా నడుస్తున్నారు. దుకాణాల్లో, ఇతర కొనుగోలు కేంద్రాల్లో ఇంతకాలం పాటించిన ఎడాన్ని పాటించడమే లేదు. ముందున్న వ్యక్తిని ఎప్పటిలాగానే తోసుకుని వెళ్తుండడం ప్రమాదం మనతోనే ఉందన్న విషయాన్ని నొక్కిచెబుతున్నది. దేశవ్యాప్తంగా అమలులో భాగంగా రాష్ట్రంలో కూడా ఇప్పటికి నాలుగు విడుతలుగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారు. కాగా, ఈనెల చివరి తేదీతో మొత్తం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండవచ్చనుకుంటున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఎటు దారితీ స్తుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రధానంగా రవాణా వ్యవస్థను, అటు ఆటోలను పునరుద్దరించడం కూడా మరొక కారణంగా మారుతున్న దేమోనన్న అనుమానాలకు తావేర్పడుతున్నది. దుకాణాలు తెరుచు కోవడానికి విధించిన సరి,బేసి సంఖ్య విధానాన్ని అన్ని రకాల వాహనాలకు కొంతకాలం వర్తించేలా చేస్తే రద్దీని తగ్గించవొచ్చు .గతంలో ఈ విధానాన్ని కాలుష్య నివారణ కోసం ఢిల్లీ సర్కార్‌ అమలు చేసింది.

Leave a Reply