Take a fresh look at your lifestyle.

తెలంగాణ వాతా వరణం… మాదిరెడ్డి సులోచన రచానా నేపథ్యం

“మారుతున్న కాలంలో మారని విలువలను తెలియ జెప్పడంతో పాటు స్త్రీలను చైతన్య వంతులను చేసే ధ్యేయంతో నవలా యజ్ఞం సాగించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన. సమాజం విధించే కుహనా కట్టుబాట్లు, ఆచారాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని, జీవితాలను తీర్చిదిద్దుకున్న పాత్రలు మాదిరెడ్డి నవలల్లో కనిపిస్తాయి. అలాగే, మార్పులకు లోనవుతున్న ఆర్థిక విధానాలతో ప్రభావితమైన సామాజిక విలువలు, ఆ క్రమంలో విపరీత మైన సంఘర్షణలకు లోనైన స్త్రీల జీవితాలకు కూడా సులోచన నవలలు అద్దం పడతాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా,  ఎన్ని తరాలు మారినా, మారని మానవ నైజాలు, ప్రవృతులూ, ప్రేమ , ద్వేషం, స్వార్ధం లాంటివి మాదిరెడ్డి సులోచన నవలలో స్పష్టంగా కనిపిస్తాయి.”

అక్టోబర్‌ 26… ‌మాదిరెడ్డి సులోచన జయంతి

తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఆమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు. తెలంగాణ రచయిత్రుల సాహిత్య ప్రస్థానంలో మాదిరెడ్డి సులోచన ఒక మైలురాయి. ఆచార్య పాకాల యశోదారెడ్డి తరువాత తెలంగాణ పలుకుబడి, తెలంగాణ స్థానీయతను రచనల్లో చూపించిన రచయిత్రి మాదిరెడ్డి.

మారుతున్న కాలంలో మారని విలువలను తెలియ జెప్పడంతో పాటు స్త్రీలను చైతన్య వంతులను చేసే ధ్యేయంతో నవలా యజ్ఞం సాగించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన. సమాజం విధించే కుహనా కట్టుబాట్లు, ఆచారాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని, జీవితాలను తీర్చిదిద్దుకున్న పాత్రలు మాదిరెడ్డి నవలల్లో కనిపిస్తాయి. అలాగే, మార్పులకు లోనవుతున్న ఆర్థిక విధానాలతో ప్రభావితమైన సామాజిక విలువలు, ఆ క్రమంలో విపరీత మైన సంఘర్షణలకు లోనైన స్త్రీల జీవితాలకు కూడా సులోచన నవలలు అద్దం పడతాయి.సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా,  ఎన్ని తరాలు మారినా, మారని మానవ నైజాలు, ప్రవృతులూ, ప్రేమ , ద్వేషం, స్వార్ధం లాంటివి మాదిరెడ్డి సులోచన నవలలో స్పష్టంగా కనిపిస్తాయి.

అర్ధ శతాబ్ది క్రితం, తెలంగాణ వాతవరణం, మానవ సంబంధాలూ కలిపి చక్కనైన కుటుంబ కథా నవలలను వ్రాశారు. ఆమె నవలలలో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలలలో ఎదురయ్యే సమస్యలు కనిపిస్తూ వుంటాయి. మన చుట్టూ వుండే వాతావరణం ప్రతిబింబిస్తూ వుంటుంది. ఆ నవల చదువుతూ వుంటే ఇది ఎక్కడో మనమధ్యే జరిగిందే అన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది. మాదిరెడ్డి సులోచన (26.10.1935 – 16.2.1983) మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా శంషాబాద్‌ ‌లో 1935  అక్టోబర్‌ 26‌న  ఒక భూస్వామ్య కుటుంబంలో మామిడి రామకృష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు.

ఆ రోజుల్లో దొరలు, దేశముఖ్‌ ‌ల  ఇళ్ళల్లోని ఆడపిల్లలు ఘోషా పాటించడం వల్ల సులోచన ప్రాథమిక విద్యను ఇంట్లోనే పూర్తి చేసుకున్నారు. కొంతకాలం ఆర్య సమాజ్‌ ‌గురుకుల పాఠశాల, బేగం పేటలో చదువుకుని మెట్రిక్యులేషన్‌ ‌పూర్తి చేశారు. రాజ బహదూర్‌ ‌వెంకట్రామిరెడ్డి కళాశాల, నారాయణ గూడలో బి.ఎస్సీ డిగ్రీ చదివారు. భువనగిరి, నల్గొండ జిల్లా వాస్తవ్యులైన మాదిరెడ్డి రామచంద్రారెడ్డితో 1952లో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.యిడి ఎం.ఎ., ఎం.యి.డి పూర్తి చేశారు. తర్వాత మాదిరెడ్డి సులోచన ఉపాధ్యాయవృత్తిలో చేరి 1971 వరకు సుమారు పది సంవత్సరాలు కెమిస్ట్రీ ఉపాధ్యాయినిగా సెయింట్‌ ‌జాన్స్ ‌హైస్కూలులో పనిచేశారు. బోధనను తన వృత్తిగానే కాక ప్రవృత్తిగా కూడా మలచుకున్న ఉత్తమ పాటు ఇథియోపియా, జాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కొంతకాలం ఉపాధ్యాయినిగా పనిచేశారు.

1965 లో ‘ జీవనయాత్ర ‘ పేరుతో ప్రారంభమైన ఆమె నవలా ప్రస్థానం తరంగాలు , కలహంస, అంద గాడు, అపురూప , నాగ మల్లికలు, సంధ్య, శిక్ష, పూల మనసులు, మిష్టర్‌ ‌సంపత్‌ ఎంఎ, ‌లాహిరి, సజీవ స్మృతులు, స్నేహ ప్రియ, రాలిన రేకులు, నవతరం, ఎంత ఘాటు ప్రేమయో, పంతులమ్మ, వారసులు, కలకాదు సుమా, వంశాంకురం, అందని పిలుపు, నెలవంక, బిందు పథం, సుప్రియ, గడ్డితినే మనుషులు, మరో ప్రేమకథ, గాజు బొమ్మలు, ప్రేమ పంజరం, అపరంజి, సంసార నౌక, పుణ్య పురుషులు, ఋతుచక్రం, చిగురాకులలో చిలకమ్మ, మీరైతే ఏం చేస్తారు, ఆశయాల ఆఖరి మెట్టు, అధికారులు – ఆశ్రిత జనులు, సంధ్యారాగం, గెలుపు నాదే, అభినేత్రి, ఇల్లు కట్టి చూడుపెళ్ళి చేసి చూడు, శ్రీనిలయం, సృష్టిలో తియ్యనిది లాంటి 72 నవలలతో పాటూ దాదాపు 150 కథలు, 21 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీరి రచనలు ఆనాటి దిన, వార, మాస పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. ఆమె రచించిన 10 నవలలు మేన కోడలు, ప్రేమలు – పెళ్ళిళ్ళు, ఈ కాలం పిల్లలు, ఈ తరం మనిషి , కళ్యాణి, కలవారి సంసారం, చందమామ, తరం మారింది మొదలైనవి సినిమాలుగా నిర్మించ బడ్డాయి. 1977 లో  తరం మారింది సినిమాకు నందిఅవార్డు లభించింది. ఆమె రచనలపై అనేక పరిశోధనలు జరిగాయి.  1965 నుండి రచనలు ప్రారంభించిన మాదిరెడ్డి సులోచన 1983 ఫిబ్రవరి 16న అకాల మరణం చెందే వరకు రచనను కొనసాగించారు.

గృహలక్ష్మి నవలకు 1978లో  స్వర్ణ కంకణము లభించింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు విభిన్న సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని నవలలు వ్రాసి  ఆంధ్ర  పాఠకుల హృదయాలలో చిర స్మరణీయంగా నిలచి పోయిన మాదిరెడ్డి సులోచన 1984లో ఇంట్లో గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలిన దుర్ఘటనలో  మరణించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494

Leave a Reply