Take a fresh look at your lifestyle.

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి

సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌‌యంత్రాంగం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ భూములు అనేక మంది ఆక్రమించుకుని ఉన్నారు. ఆభూములు కొంతమంది సాగు చేసుకుంటూ మరికొంతమంది పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. అనేకసార్లు దేవస్థానం అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి భూములు ఖాళీ చేయాల్సిందేనని ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేసారు. అయినప్పటికి వారు ఏమాత్రం స్పందించలేదు. తరచూ దేవస్థానం అధికారులు ఆక్రమణ దారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో శుక్రవారం నాడు పక్కా ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నారని దేవస్థానం అధికారులు పురుషోత్తపట్నం ప్రాంతానికి చేరుకున్నారు. దేవస్థానం అధికారులు ఆ ప్రాంతాలకు వొచ్చారని తెలుసుకున్న ఆక్రమణదారులందరు ఒక్కసారిగా దేవస్థానం అధికారులపై దాడులకు దిగారు.

ఈ భూములు దేవస్థానంకు సంబంధించినవి కాదని, తాము ఖాళీ చేసి వెళ్ళమని దేవస్థానం అధికారులు, ఈఓ శివాజీకి తేల్చీ చెప్పడంతో దేవస్థానం అధికారులు కూడా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో ధర్నాకు దిగారు. దేవస్థానం భూములు కాపాడాలంటూ భారీగా నినాదాలు చేసారు. ఇంత గొడవ జరుగుతున్నప్పటికి ఆంధ్రా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. దేవస్థానం ఆ భూములపై పక్కా ఆధారాలు ఉన్నప్పటికి ఆక్రమణదారులు, అధికారులపై దాడికి దిగారు. ఇటు తెలంగాణ పోలీసులు, అటు ఆంధ్రా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోకపోవడం హాస్యస్పదం. ఈ విధంగా పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానంకు చెందిన వేల ఎకరాల భూములు పూర్తిగా ఆక్రమణకు గురయినప్పటికీ వీటిని రక్షించడానికి పైస్థాయి అధికారులు కూడ విఫలమయ్యారు. దేవస్థానం అధికారులు చేస్తున్న ధర్నాకు వ్యతిరేకంగా ఆక్రమణదారులు కూడ దేవస్థాన అధికారుల దౌర్జన్యాన్ని ఆపాలంటూ నినాదాలు చేసారు. సుమారు గంటకు పైగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవస్థానం ఈఓ శివాజీ, అర్చకులు, ఆలయ సిబ్బంది ధర్నాలో పాల్గొన్నారు.

Leave a Reply