Take a fresh look at your lifestyle.

రాహుల్‌ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్రకు అడుగడుగున ఆటంకాలు ఎదురవు తున్నాయి. యాత్ర ప్రారంభం నుండి వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా వొత్తిడులను ఎదుర్కునాల్సి రావడంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్రాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా అస్సాంలో యాత్రను అడ్డుకోవడంతోపాటు, కాంగ్రెస్‌ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులపై వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. రాహుల్‌ యాత్రను అడుగడుగున అడ్డుకోవడం, అనుమతులను నిరాకరించడం అప్రజాస్వామిక చర్యగా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా రాహుల్‌ లాంటి ముఖ్యనేతకు భద్రత కల్పించడంలో అస్సాం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం క్షమించరానిదని, ఇలాంటి చర్యలతో అత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకునే బిజెపి కుట్రలు ఫలించవంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి వొస్తున్న ఆదరణ చూసి బిజెపి బెంబేలెత్తిపోతున్నదని తెలంగాణ మంత్రులు కూడా విమర్శిస్తున్నారు.

యాత్రపై దాడులు జరుపడం హేయమైన చర్యగా వారు పేర్కొంటూ…ఈ విషయంలో అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈ మేరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. వాస్తవంగా రాహుల్‌ గాంధీ మొదటివిడుతగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన వొచ్చింది. రాహుల్‌ ప్రసంగాలు ప్రజల్లో ఆలోచనను రగిలించేవిగా ఉండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మింగుడు పడకుండా పోతున్నదంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. అందుకే రాహుల్‌ చేపట్టిన రెండవ విడుత యాత్రలో అడుగడుగునా అటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నెల 14న మణిపూర్‌లో మొదలైన యాత్ర మొదలు నేడు అస్సాం పర్యటనవరకు అనేక అవరోధాలను ఎదుర్కునాల్సి రావడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. యాత్రకు శ్రీకారం చుట్టిన మణిపూర్‌లో అనుమతించే విషయంలోనే అక్కడి ప్రభుత్వం దాదాపు పదిరోజుల సమయం తీసుకుంది. అంతేగాక యాత్ర ప్రారంభించడానికి ఎన్నుకున్న స్థలాన్ని మార్చాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయినా కాంగ్రెస్‌ నాయకత్వం ససేమిరా అనడంతో విధిలేని పరిస్థితిలో అనుమతించింది. అదికూడా షరతులతో కూడిన అనుమతి. యాత్ర ప్రారంభానికి చాలా తక్కువ మంది రావాలని, ఎవరు హాజరవుతారన్నది ముందుగా తెలుపాలని ఇలా అనేక కండీషన్‌లను పెట్టిందా ప్రభుత్వం. ఇప్పుడు అస్సాంలో కూడా అదే పరిస్థితి. మణిపూర్‌, నాగాలాండ్‌ తదితర ప్రాంతా నుంచి అస్సాంకు రాహుల్‌ యాత్ర ఈ నెల 18న చేరుకుంది. అక్కడ పర్యటనలో భాగంగా శ్రీ శంకర్‌దేవ్‌ జన్మస్థలి బటద్రవ సత్ర ఆలయానికి వెళ్ళే విషయం తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరుగుతున్న రోజు కావటం వల్ల ఆ రోజున ఇక్కడ ఆలయ ప్రవేశానికి అనుమతించేదిలేదని అస్సాం ప్రభుత్వం ఆటంకపరిచింది. ఆలయ ప్రవేశానికి అడ్డంగా బ్యారికేడ్లను ఏర్పరిచారు. దీంతో అది కాస్తా వివాదంగా మారింది.

తనను అనుమతించాల్సిందేనని రాహుల్‌ పట్టుపట్టడమే కాకుండా అక్కడే బైటాయించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లను తొలగించడం, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం యుద్ద వాతావరణంగా మారింది. అనంతర క్రమంలో కొందరు అక్కడి కాంగ్రెస్‌ బ్యానర్లు, కటౌంట్లను ధ్వంసం చేయడం గందరగోళానికి దారితీసింది. ప్రజలు ఆలయ సందర్శనం చేసుకోవాలంటే ప్రధాని మోదీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంపైన రాహుల్‌ తీవ్రంగా స్పందించారు.

అదే మార్గంలో భజరంగ్‌ దళ్‌ యాత్ర జరిపినా, బిజెపి చీఫ్‌ నడ్డా ర్యాలి చేసినా లేని ఇబ్బంది తాను ఆలయ దర్శనానికి వెళ్ళితేనే ఇబ్బంది ఎలా అవుతుందన్నది రాహుల్‌ ప్రశ్న. శ్రీమంత శంకరదేవ్‌ 15వ శతాబ్ధపు సాధువు. అస్సాంలో ఆయన మఠాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. కాగా మేఘాలయంలోనూ ఆయనకు అదే రీతిన అటంకం ఎదురైంది. అక్కడ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులతో కలిసి మాట్లాడే విషయంలోనూ అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేకాదు ఎక్కడ రోడ్లపైన కార్నర్‌ మీటింగ్‌లను కూడా పెట్టరాదని ఆంక్షలు విధించారు. దాంతో ఆయన అస్సాం` మేఘాలయ సరిహద్దుల్లో మంగళవారం తాను పర్యటిస్తున్న వాహనంపై నుండే ప్రసంగించక తప్పలేదు.

విద్యార్థులతో కలువనీయకుండా విధిస్తున్న నిబంధనలు ఇక్కడ ఒక్క చోటే కాదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. విద్యార్థులు తమ స్వంత ఆలోచనలు కలిగి ఉండకుండా, కోరుకున్న వారి ప్రసంగాలు వినే స్వేచ్ఛ ఉండకుండా, తమ ఇష్టానుసారం జీవనం సాగించకునే వీలులేకుండా బిజెపి ప్రభుత్వం చేస్తున్నదంటూ ఆయన తన ప్రసంగంలో విచారం వ్యక్తం చేయడం గమనార్హం. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం కలుగాలన్న సందేశంతో చేస్తున్న తమ యాత్రను చూసి బిజెపి భయపడుతున్నదంటున్నారు కాంగ్రెస్‌ శ్రేణులు.

మండువ రవీందర్‌రావు,

సీనియర్‌ జర్నలిస్ట్‌.

Leave a Reply