Take a fresh look at your lifestyle.

నర్సులు ఆరోగ్యాన్ని పునరుద్ధరించే పుణ్యమూర్తులు

“మానవాళి మనుగడకే సవాలుగా పరిణమించిన కరోనా మహమ్మారితో ఇపుడు పోరాడుతున్న ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, రవాణా కార్మికులు మరియు రక్షక భటులు మొదలైన వారందరిలోకెల్లా నర్సులు సమాజానికి అందిస్తున్న సేవలు ‘మానవ సేవే మాధవ సేవ’  అన్న మాటలకు ప్రతి రూపాల్లా అనిపిస్తున్న విషయం అక్షర సత్యం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్న మాటల విలువ మనందరికీ తెలుసు. మన ఆరోగ్య సంరక్షణలో భాగంగా మనం తరచుగా డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు మరియు ల్యాబ్‌ ‌టెక్నీషియన్స్ ‌లాంటి ఎంతో మంది వైద్య నిపుణుల సేవలు పొందుతుంటాం. ఐతే వివిధ రకాలైన వ్యాధుల బారిన పడిన రోగులను కంటికి రెప్పలా కాపాడి వారి వ్యాధి నయం కావడానికి అహర్నిశలు శ్రమించే నర్సుల సేవలు మాత్రం ఎంతో ప్రత్యేకమైనవిగానూ మరియు పవిత్రమైనవిగానూ పరిగణించదగినవే.”

మానవాళి మనుగడకే సవాలుగా పరిణమించిన కరోనా మహమ్మారితో ఇపుడు పోరాడుతున్న ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, రవాణా కార్మికులు మరియు రక్షక భటులు మొదలైన వారందరిలోకెల్లా నర్సులు సమాజానికి అందిస్తున్న సేవలు ‘మానవ సేవే మాధవ సేవ’  అన్న మాటలకు ప్రతి రూపాల్లా అనిపిస్తున్న విషయం అక్షర సత్యం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్న మాటల విలువ మనందరికీ తెలుసు. మన ఆరోగ్య సంరక్షణలో భాగంగా మనం తరచుగా డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు మరియు ల్యాబ్‌ ‌టెక్నీషియన్స్ ‌లాంటి ఎంతో మంది వైద్య నిపుణుల సేవలు పొందుతుంటాం. ఐతే వివిధ రకాలైన వ్యాధుల బారిన పడిన రోగులను కంటికి రెప్పలా కాపాడి వారి వ్యాధి నయం కావడానికి అహర్నిశలు శ్రమించే నర్సుల సేవలు మాత్రం ఎంతో ప్రత్యేకమైనవిగానూ మరియు పవిత్రమైనవిగానూ పరిగణించదగినవే. ఈ నేపథ్యంలో ప్రతీ సంవత్సరం మే నెల 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ ‌జయంతి సందర్భంగా ప్రపంచంలోని నర్సుల సేవలకు గుర్తింపుగా పాటించబడుతున్న ‘‘ప్రపంచ నర్సుల దినోత్సవం’’ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ (12 ‌మే, 1820 – 13 ఆగస్టు, 1910) సంపన్న కుటుంబంలో జన్మించిన ఆంగ్ల జాతీయురాలైన నర్సు, గణాంకవేత్త, సంఘ సంస్కర్త మరియు ఆధునిక నర్సింగ్‌ ‌వ్యవస్థకు ఆద్యులు. 1854-56 మధ్య కాలంలో జరిగిన క్రీమియన్‌ ‌యుద్ధంలో క్షతగాత్రులైన సైనికులకు సేవలందించే క్రమంలో కాన్‌ ‌స్టాంటినోపుల్‌ ‌నగరంలోని స్కుటారి అనే ప్రదేశంలోనున్న బ్రిటీషు వారి బేస్‌ ‌హాస్పిటల్లో మేనేజరుగా మరియు నర్సుల శిక్షకురాలుగా ఫ్లోరెన్స్ ‌విధులు నిర్వర్తించేది. ముందుగా ఎంతో అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టింది. పరిశుభ్రతతోనే చాలా వరకు అనారోగ్యాలను అరికట్టవచ్చుననే అవగాహనను అక్కడి వారిలో కలిగించ గలిగింది. గాయాల బారిన పడిన సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా వైద్య పరమైన సపర్యలు మరియు కౌన్సెలింగ్‌ ‌నిర్వహించేది. ఆ రోజుల్లో నర్సింగ్‌ ‌వృత్తికి సరైన గౌరవం దక్కేలా ఫ్లోరెన్స్ ఎం‌తో కృషి చేసింది. యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించేందుకు చీకట్లో సైతం లాంతరు చేతబట్టి వారి మధ్య రౌండ్లు నిర్వహించిన ఫ్లోరెన్స్ ‘‌లేడీ విత్‌ ‌ద ల్యాంప్‌’‌గానూ మరియు ‘ది ఏంజిల్‌ ఆఫ్‌ ‌ద క్రీమియా’ గానూ ప్రసిద్ధినొందింది. ఫ్లోరెన్స్ ‌తన నర్సుల బృందంతో క్రీమియన్‌ ‌యుద్ధంలో గాయపడిన సైనికులకు అంకితభావంతో చేసిన సేవల ఫలితంగానే ఆ హాస్పిటల్లో మరణాల రేటును మూడింట రెండు వంతుల వరకు తగ్గించగలిగారు. ‘‘నోట్స్ ఆన్‌ ‌హాస్పిటల్స్’’ ‌మరియు ‘‘నోట్స్ ఆన్‌ ‌నర్సింగ్‌’’ అనే గ్రంథాలను కూడా రచించింది ఫ్లోరెన్స్. ఆమె  కాలం నుంచే నర్సులకు తప్పనిసరిగా శిక్షణను ఇవ్వడం ప్రారంభమైంది. 1860 జూన్‌ 24 ‌న నైటింగేల్‌ ‌ట్రైనింగ్‌ ‌స్కూల్‌ ‌ఫర్‌ ‌నర్సెస్‌ అనే సంస్థను లండన్‌ ‌లో స్థాపించిన ఫ్లోరెన్స్ ‘‌మదర్‌ ఆఫ్‌ ‌మోడరన్‌ ‌నర్సింగ్‌’ ‌గా గుర్తించబడినది.

స్విట్జర్లాండ్‌ ‌దేశంలోని జెనీవా నగరం కేంద్రంగా పనిచేస్తున్న ‘‘ది ఇంటర్నేషనల్‌  ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నర్సెస్‌’’ అని పిలువబడే అంతర్జాతీయ నర్సుల మండలి అందరికీ నాణ్యమైన నర్సింగ్‌ ‌సేవలు మరియు ఉన్నతమైన ఆరోగ్య ప్రణాళికలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో 1899 సంవత్సరంలో నెలకొల్పబడ్డది. మొత్తం ఆరోగ్య కార్యకర్తల్లో సగానికి పైగా ఉండే నర్సుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా స్థాపించ బడిన ఈ విస్తృత స్థాయి సంస్థ ప్రస్తుతం దాదాపు 130 వివిధ దేశాల జాతీయ నర్సుల సంఘాలను సభ్యులుగా కలిగి ఉన్న అంతర్జాతీయ సమాఖ్యగా విశేష కృషి చేస్తున్న విషయం గమనార్హం. ఇంటర్నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నర్సెస్‌  1965 ‌సంవత్సరం నుండి ప్రతీ ఏటా మే నెల  12 నాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నది. కాకపోతే 1974 సంవత్సరం నుండి మాత్రమే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అధికారికంగా పాటించబడుతున్నది.

మామూలు పరిస్థితుల్లో సైతం  వ్యాధిగ్రస్తులకు సేవలందించే క్రమంలో ఇన్ఫెక్షన్లు మరియు ఇతరత్రా ప్రమాదాలకు గురయ్యే ఆరోగ్య కార్యకర్తలందరిలోనూ నర్సుల సంఖ్యే ఎక్కువని రోజూ ఎన్నో వార్తలు వింటున్నాం. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని మరణ శయ్య మీదకి విసిరేస్తూ లక్షల సంఖ్యలో మనుషుల ఊపిరిని లాగేస్తున్న నేటి విషమ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల సంఖ్య కూడా ఆందోళన చెందాల్సిన స్థాయిలో ఉండటం కడు విషాదకరం. ఇంటర్నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌నర్సెస్‌ ‌సంస్థ 2020 సంవత్సరం మే నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌- 19 ‌బారిన పడి ఇన్ఫెక్షన్‌ ‌సోకిన మరియు మృతి చెందిన ఆరోగ్య కార్యకర్తల వివరాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఆ వివరాల ప్రకారం 31 డిసెంబర్‌, 2020 ‌నాటికి 1.6 మిలియన్లకు మించి ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ ‌కు గురైనట్లు మరియు 31, జనవరి, 2021 నాటికి సుమారు 2700 కు పైగా నర్సులు ప్రపంచ వ్యాప్తంగా మరణించినట్లుగా తెలియవస్తున్న అంచనాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. అయితే వాస్తవ సంఖ్యలు ఇంకా ఎక్కువగానే ఉంటాయనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. కరోనా రెండో వేవ్‌ ‌విజృంభణతో భారత దేశంలో ఇప్పటికే ప్రతీ రోజూ నాలుగు లక్షలు దాటి పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న విపత్కర పరిస్థితి నెలకొన్నది. కోవిడ్‌-19 ‌కాటుకు మృత్యువాత పడుతున్న నర్సుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో నర్సింగ్‌ ‌వృత్తిని వదిలి వేసే వారి సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతున్న వైనం విస్మరించరానిది. ఇదే సంస్థ వెల్లడించిన గణాంకాల ద్వారా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నర్సులుగా సేవలందిస్తున్న వారి సంఖ్య సుమారు 27.8 మిలియన్లుగానూ, కోవిడ్‌-19 ‌మహమ్మారి అవనిపై అడుగిడకముందే 5.9 మిలియన్ల సంఖ్యలో నర్సుల కొరత ఉన్నట్లుగానూ మరియు కరోనా ప్రభావం, రిటైర్మెంట్‌ ‌తదితర కారణాల వల్ల 2030 సంవత్సరం నాటికి ఈ నర్సుల కొరత 13 మిలియన్ల సంఖ్య దాటవచ్చుననే ప్రమాద ఘంటికల మోత వినబడుతున్నది. విపరీతమైన  పని ఒత్తిడి వల్ల ఎందరో నర్సుల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు మరియు కొందరైతే మానసికంగా కృంగిపోతున్నట్లుగా కూడా ఎన్నో నివేదికలు వెలుగు చూస్తున్నాయి.

నర్సుల సంక్షేమం మరియు వారి పనితీరు మెరుగు పరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో యుద్ధం, ప్రకృతి విపత్తుల సమయంలో క్షతగాత్రులు లేదా నిరాశ్రయుల సేవలో అత్యంత  వృత్తి నిబద్ధతను కనబరిచే నర్సు లేదా ప్రజారోగ్యం, నర్సింగ్‌ ‌విద్యా రంగంలో అత్యుత్తమ సేవలు అందించే నర్సుకు రెడ్‌ ‌క్రాస్‌ ‌సంస్థ రెండేళ్లకోసారి బహుకరించే ‘‘ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ ‌మెడల్‌’’‌ను అంతర్జాతీయంగా ఒక నర్సు అందుకోగల అత్యున్నత బహుమతిగా పరిగణిస్తారు. భారత దేశంలో మెరుగైన సేవలు అందించే నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జాతీయ ఫ్లోరెన్స్ ‌నైటింగేల్‌ అవార్డులను 1973 సంవత్సరం నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదానం చేస్తున్నారు. ఇవే కాక రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రోత్సాహక చర్యలు చేపట్టబడుతున్నాయి.

2021 సంవత్సరానికి గాను ‘‘నర్సెస్‌: ఎ ‌వాయిస్‌ ‌టు లీడ్‌ – ఎ ‌విజన్‌ ‌ఫర్‌ ‌ఫ్యూచర్‌ ‌హెల్త్ ‌కేర్‌’’ అనే థీమ్‌ ‌ప్రకటించబడింది. ప్రపంచ మానవాళి ఆరోగ్య సంరక్షణకై విశేష కృషి చేస్తున్న నర్సుల వృత్తి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు సరైన పరిష్కారం లభించాలని, నర్సు వృత్తి చేయడానికి అనువైన వాతావరణం కల్పించి ఇప్పటికే నర్సుల కొరతతో సతమతమవుతున్న ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలనీ మరియు కరోనాను కట్టడి చేయడంలో బాధ్యత గల పౌరులుగా మనమంతా ముఖానికి మాస్క్ ‌ధరించి, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్‌ ‌లేదా  సబ్బుతో చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ కరోనాను మన దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉంటూ నర్సులపై కొంతైనా ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలని ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆశించడం అత్యాశ కానే కాదు.
– మోహన్‌ ‌లింగబట్టు), 9398522294

Leave a Reply