Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో వెయ్యి దాటిన కొరోనా పాజిటివ్‌ల సంఖ్య

  • ఒక్క రోజే కొత్తగా 1,078 మందికి వైరస్‌
  • ‌పెరుగుతున్న కేసుల పట్ల ప్రజల్లో ఆందోళన
  • గాంధీలో మళ్లీ పెరుగుతున్న కేసులు..పలువురి ఆరోగ్య పరిస్థితి విషమం

‌రాష్ట్రంలో మళ్లీ కొరోనా కేసులు రోజుజోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజు కొత్తగా 1,078 మందికి కొరోనా సోకిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం మిడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో కొత్తగా 331 మంది కొరోనా నుంచి కోలుకున్నారని, వైరస్‌తో బాధపడుతూ ఆరుగురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,10,819కి చేరిందని, ఇప్పటివరకు మొత్తం 3,02,207 మంది కొరోనా నుంచి కోలుకున్నారని వారు చెప్పారు. ఇప్పటివరకు కోవిడ్‌తో 1,712 మంది చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 6,900 మంది వైరస్‌తో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నారని, ఇందులో 3,116 మంది హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్క రోజులో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొత్తగా 283 మంది కొరోనా బారినపడినట్టు వారు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కొరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మిదకు రావాలని, అలా వొచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని సూచించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

గాంధీలో మళ్లీ పెరుగుతున్న కేసులు..పలువురి ఆరోగ్య పరిస్థితి విషమం
రాష్ట్రంలో రెండోదశ కొవిడ్‌ ‌రోజురోజుకూ పంజా విసురుతోంది. తొలిదశ కంటే రెండోదశలో అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా..తొలిదశకు, రెండోదశకు ప్రధాన వ్యత్యాసాన్ని మాత్రం గుర్తించారు. హాస్పిటళ్లలో చేరికలు మొత్తంగా తక్కువే ఉన్నా.. చేరుతున్నవారిలో మాత్రం అత్యధికులు ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఒక్క గాంధీ హాస్పిటల్‌లోనే 108 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో 245 మంది, ప్రైవేటులో 734 మంది ఐసీయూలో వెంటిలేటర్‌ ‌చికిత్సల్లో ఉన్నారు. ఈ లెక్కన హాస్పిటళ్లలో 979 మందికి వెంటిలేటర్‌ ‌చికిత్సలు అవసరమైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. తొలిదశతో పోల్చితే ఈ తరహాలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నవారు అధికంగానే హాస్పిటళ్లలో చేరుతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పరిస్థితి విషమించిన తర్వాత.. ప్రభుత్వ హాస్పిటళ్లతో పోల్చితే ప్రైవేటు హాస్పిటళ్లలోని ఐసీయూల్లో పడకలు నిండిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లలో 90 శాతానికి పైగా ఐసీయూ పడకల్లో రోగులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వీరిలో 25-40 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 40 శాతానికి పైగానే ఉన్నట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. లక్షణాలు సోకినా 7-10 రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జలుబు, దగ్గు, జ్వరం పెరుగుతున్నా ఇంటి వద్దనే చికిత్స పొందడం వంటి కారణాలతో ఆరోగ్యం విషమిస్తుండగా, ఆ తర్వాత హాస్పిటళ్లకు తీసుకొస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ‌తీవ్రరూపం దాల్చిన తర్వాత త్వరితగతిన వీరి ఆరోగ్యం విషమిస్తోంది. ఫలితంగా యుక్తవయస్కుల్లోనూ కొవిడ్‌ ‌మృతులు పెరుగు తున్నట్లుగా తెలుస్తుంది. కొవిడ్‌ ‌సోకినా, లక్షణాలు కనిపిస్తున్నా చికిత్సకు జాప్యం చేసినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉంటున్నారని, వీరు మరింత త్వరగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐసీయూలో విషమ స్థితికి చేరుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని, రక్తనాళాల్లో గడ్డ కట్టడం, గుండెపోటు, పక్షవాతం వంటివి ఎదురవడం, కంటి చూపు దెబ్బతినడం వంటివి కూడా ఉన్నట్లు వివరిస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా ఎక్కువమందికి టీకాలను అందించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించగానే నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం, జ్వరం తగ్గకుండా లక్షణాలు పెరుగుతుంటే వెంటనే హాస్పిటళ్లలో వైద్యుణ్ని సంప్రదించడం చాలా ముఖ్యమని గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌రాజారావు అన్నారు. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే.. అంత ఎక్కువమందిని ఐసీయూలో చేరకుండా ముందుగానే కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

Leave a Reply