- దేశంలో తగ్గుతున్న కొరోనా కేసులు
- దేశ వ్యాప్తంగా 172.82 కోట్ల టీకా డోసుల పంపిణీ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 12 : దేశంలో తాజాగా 24 గంటల్లో కొత్తగా 50,407 కేసులు నమోదయ్యాయి. కాగా రికవరీ రేట్ 97.37 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443 కాగా..వీక్లీ పాజిటివిటీ రేట్ 5.07 శాతంగా అధికారులు పేర్కొన్నారు. తాజాగా 24 గంటల్లో 14.50 లక్షల మందికి కొరోనా పరీక్షలు చేపట్టగా 50,407 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ సంఖ్య క్రితం రోజు కన్నా 13 శాతం తక్కువ. తాజాగా 804 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 4.25 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా..5,07,981 మంది కొరోనాకు బలయ్యారు. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల రేటు 1.43 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 3.48శాతానికి పడిపోయింది.
తాజాగా 24 గంటల్లో 1,36,962 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.14 కోట్లకు పెరిగింది. ఇదిలా ఉంటే దేశంలో కోవిడ్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ టీకా పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 172.82 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అదికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో తాజాగా 24 గంటల్లో 46.82 లక్షల టీకా డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 172 కోట్ల టీకా డోసులు వినియోగం అయ్యాయి.